child info
-
బడిలో ఉన్నా.. లేనట్టే !
బడిలో చదువుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టింది. అవి అందాలంటే పిల్లల పూర్తి వివరాలు కచ్చితంగా చైల్డ్ ఇన్ఫోలో నమోదు కావాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నా ప్రైవేటు యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. చిన్నపాటి లొసుగుల కారణంగా నమోదు విషయంలో వారు మొండికేస్తున్నారు. అయినా విద్యాశాఖాధికారులు మాత్రం దీనిపై ఎందుకో ఉదాసీనవైఖరి అవలంబిస్తున్నారు. దీనివల్ల పిల్లలకు ప్రభుత్వ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. విజయనగరం అర్బన్: విద్యార్థుల ఆధార్ అనుసంధాన ఆన్లైన్ వివరాల నమోదు (చైల్డ్ ఇన్ఫో) ప్రక్రియపై విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ నమోదు జరగకపోయినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచింది. ఇప్పటికీ ఇంకా సుమారు 30 వేల మంది విద్యార్థుల వివరాల నమోదు పూర్తి కాలే దు. ఫలితంగా చిన్నారులకు ప్రభుత్వ పథకాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల ఆధార్‌తో కూడిన వివరాలను చైల్డ్ ఇన్ఫోలో క్రోడీకరిస్తున్నారు. కానీ ప్రైవేటు సంస్థలే నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లోనే ఇబ్బందులు.. జిల్లాలో 2019–20 విద్యాసంవత్సరానికి 3,09,139 మంది విద్యార్ధులు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలల్లో చేరాలన్నది లక్ష్యం. తాజా నివేదికల ప్రకారం 2,96,342 మంది నమోదయ్యారు. వీటిలో ఈ ఏడాది నూతనంగా ఒకటో తరగతిలో చేరినవారు 31,500 మంది ఉన్నారు. వీరిలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 6 వేల మంది వరకు ఉండగా మిగిలిన తరగతుల్లో 10వేల వరకు చేరారు. ఇందులో 8,479 మంది ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటుకు వెళ్లినవారు మాత్రం కేవలం 734 మంది మాత్రమే ఉన్నారు. పాఠశాలల్లో చేరిన ప్రతి విద్యార్థి వివరాలను అధార్ నంబర్, తల్లి బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటి వివరాలను అనుసంధానంగా చైల్డ్ ఇన్ఫోలో కలపాలి. ఈ ప్రక్రియను విద్యార్థి ప్రవేశించిన తొలి రోజునే ఆయా స్కూళ్ల యాజమాన్యాలు చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నమోదు నిబంధనలు శతశాతం పాటిస్తున్నారు. కానీ ప్రైవేటు, కార్మొరేట్ విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయం, నవోదయ, సైనిక్ స్కూల్ యాజమాన్యాలు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు. విద్యాశాకాధికారులు పటిష్టమైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమన్న వాదన వినిపిస్తోంది. నమోదుపై అశ్రద్ధ అందుకే... ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఆ యా యాజమాన్యాలు టీసీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటుకు వస్తున్న విద్యార్థులను టీసీ లేకపోయినా చేర్చుకుంటున్నారు. దీనివల్ల చైల్జ్ఇన్ఫోలో విద్యార్థుల వివరాలు చేర్పడానికి ప్రైవేటు యాజమాన్యాలు ముందుకు రావడంలేదు. జిల్లాలో 586 ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల విద్యాలయాలు ఉన్నాయి. వాటిలో గతేడాది చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసిన విద్యార్థుల సంఖ్య 98,268 మంది మాత్రమే. కానీ నిజానికి ఆ స్కూళ్ల నుంచి గతేడాది నుంచి నమోదు కావాల్సిన సంఖ్య 25 వేల వరకూ ఉంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో 90 పాఠశాలల వరకు ఉన్నాయి. ఇందులో ఐదు పాఠశాలల్లో 2 నుంచి 10 మందిలోపు విద్యార్థుల వివరాలు నమోదు చేశారు. వీటిలో 80 శాతం పాఠశాలల్లో కనీసం ఒక్క విద్యార్థి వివరాలైనా నమోదు చేయలేదు. నమోదు లేదంటే విద్యార్థులు పాఠశాలలో లేనట్టే. పథకాలకు దూరమయ్యే ప్రమాదం చైల్డ్ ఇన్ఫోలో వివరాలు లేకుంటే విద్యార్థుల పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని పాఠశాలలకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థి వివరాలు ఉంటేనే పథకం అందుతుంది. ఇప్పటికే పలు పాఠశాలల్లో విద్యార్థుల తల్లుల ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్లు తీసుకుంటున్నారు. మరోవైపు స్కూల్ యూనిఫాం దుస్తులకు సంబంధించి కుట్టుకూలి సైతం తల్లుల ఖాతాల్లోకే వేయమన్నారు. ఇలా ప్రతి పథకానికి విద్యార్థుల వివరాలే ప్రామాణికం. చైల్డ్ ఇన్ఫోలో నమోదు తప్పనిసరి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ఏ తరగతిలో చేర్చుకున్నా విధిగా చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాల్సిందే. విద్యార్థి నుంచి టీసీ తీసుకున్న తొలి రోజునే విద్యార్థి ఆధార్, తల్లి బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలతో చైల్డ్ ఇన్ఫోలో పెట్టాలి. ఈ బాధ్య త సంబంధిత పాఠశాల నిర్వాహకులదే. వీటి నమోదు ప్రభుత్వ పాఠశాలల్లో శతశాతం పూర్తయింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇంకా 2.5 శాతం చేయాల్సి ఉంది. – జి.నాగమణి, డీఈఓ, విజయనగరం -
రీ సర్వే
- ఆన్లైన్లో కనిపించని 80 వేల మంది విద్యార్థుల వివరాలు – సరిపోలని ప్రజాసాధికారత సర్వే. చైల్డ్ఇన్ఫో జాబితా – ఇంటింటికీ వెళ్లనున్న టీచర్లు, సీఆర్టీలు, డీఎల్ఎంటీలు – ఈ నెల చివరినాటికి సర్వే పూర్తి చేయాలని ఆదేశం అనంతపురం ఎడ్యుకేషన్ : జీఎం లాస్య...ఈ అమ్మాయి హౌసింగ్‌బోర్డులోని 28–5–36 డోరు నంబర్లో ఉంటోంది. జే. గౌతంరాజ్ ఈ అబ్బాయి అగళి మండలం కేంద్రంలోని ఇందిరమ్మకాలనీలో ఉంటున్నాడు. ప్రజాసాధికారత సర్వేలో అధికారులు ఇంటింటికి వెళ్లినప్పుడు ఈ వివరాలు నమోదు చేశారు. వీరి ఆధార్ నంబర్ల ఆధారంగా ఆన్లైన్లో చూస్తే వీరు ఎక్కడ చదువుతున్నారు...ఎన్నో తరగతి చదువుతున్నారనే వివరాలు కనిపించడం లేదు. మరో వైపు చైల్డ్ఇన్ఫోలో వీరి పేర్లే లేవు. జిల్లాలో 80 వేలమందికి పైగా విద్యార్థుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ క్రమంలో విద్యార్థుల లెక్కలు తేల్చడానికి ప్రభుత్వం రీ సర్వే చేపడుతోంది. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ప్రజాసాధికారత సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. గతంలో విద్యాశాఖ చేపట్టిన చైల్డ్ ఇన్ఫో జాబితాలోని విద్యార్థుల వివరాలకు, ప్రస్తుతం ప్రజాసాధికారత సర్వేలో చేపట్టిన వివరాలకు పొంతన కుదరడం లేదు. జిల్లాలో సుమారు 80 వేలమంది పిల్లలు వివరాలు తేలడం లేదు. చైల్డ్ ఇన్ఫో జాబితాలోని విద్యార్థులకు సంబంధించి సమగ్ర వివరాలుంటాయి. అంటే విద్యార్థి పేరు, తండ్రి, తల్లి, వయసు, తరగతి, స్కూల్ పేరు, స్కూల్ యూడైస్ కోడ్, కులం, ఊరు, ఆధార్ నంబరు ఇలా...దాదాపు అన్ని వివరాలుంటాయి. మరి ప్రజాసాధికారత సర్వే జాబితాలో ఉన్న ఆధార్‌కార్డు నంబరు ఆధారంగా ఆన్లైన్లో చూస్తే 80 వేలమంది పిల్లలు ఎక్కడ చదువుతున్నారనే వివరాలు రావడం లేదు. అంటే ఆధార్ నంబరును తప్పుగా నమోదు చేశారా..లేదంటే చైల్డ్ ఇన్ఫోలో నమోదు కాకపోయి ఉండాలి. ఇంటింటికీ అయ్యవార్లు.. విద్యార్థుల లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం రీ సర్వే చేయాలని నిర్ణయించింది. ఉపాధ్యాయులు, సీఆర్పీలు, డీఎల్‌ఎంటీల ద్వారా ఈ నెలాఖరులోగా ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల వివరాలను సేకరించనున్నారు. ప్రజాసాధికారత సర్వే జాబితాను రెవెన్యూ గ్రామాల వారిగా రూపొందించారు. ఈ జాబితాను విద్యాశాఖకు పంపారు. జాబితా ఆధారంగా ఆధార్ నంబరు, డోర్ నంబరుకు వెళ్లి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి/అబ్బాయి ప్రస్తుతం ఎక్కడ చదువుతున్నాడు...స్కూల్, తరగతి తదితర వివరాలు సేకరిస్తారు. ప్రత్యేక యాప్ ద్వారా నమోదు ఇందుకోసం ఏపీ జీఈఆర్ (ఆంధ్రప్రదేశ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) అనే యాప్‌ను ప్రభుత్వం కొత్తగా రూపొందించింది. సర్వేకు వెళ్లే టీచర్లు, సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ల ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేశారు. యాప్ ఓపెన్ చేయగానే జిల్లా, మండలం, రెవెన్యూ గ్రామం వివరాలు వస్తాయి. వాటిని క్లిక్ చేయగానే రెవెన్యూ గ్రామంలో ఉన్న పిల్లలు, అడ్రస్, ఆధార్‌నంబర్ కనిపిస్తాయి. వాటి ఆధారంగా ఆయా ఇళ్లకు వెళ్లి పిల్లలు ప్రస్తుతం ఎక్కడ చదువుతున్నారు...ఎన్నో తరగతి చదువుతున్నారనే వివరాలను యాప్‌లోనే నమోదు చేస్తారు. ఈ యాప్ ఆన్‌లైన్‌తో అనుసంధానం చేయడంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరతాయి. నెలాఖరులోగా పూర్తి కావాలి జిల్లాలో సుమారు 80 వేలమంది పిల్లలు వివరాలు ప్రజాసాధికారిత సర్వే, చైల్డ్ఇన్ఫో జాబితాకు సరిపోవడం లేదు. ప్రజాసాధికారత సర్వే జాబితా ఆధారంగా టీచర్లతో రీసర్వే చేయిస్తున్నాం. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – లక్ష్మీనారాయణ, డీఈఓ -
యూడైస్, చైల్డ్ఇన్ఫో నమోదుకు 25 దాకా గడువు
– బడి బయట పిల్లలపై సమగ్రంగా సర్వే చేయాలి – సీఆర్పీలకు అధికారుల ఆదేశం అనంతపురం ఎడ్యుకేషన్ : పాఠశాలలు, విద్యార్థులకు సంబంధించి యూడైస్, చైల్డ్ ఇన్ఫో, ఆధార్ నమోదును ఈ నెల 25 తుది గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర పరిశీలకుడు శేషశర్మ, విద్యాశాఖ ఏడీ పగడాల లక్ష్మీనారాయణ సూచించారు. సోమవారం ఉదయం అనంతపురం, గుత్తి డివిజన్లు, మధ్యాహ్నం ధర్మవరం, పెనుకొండ డివిజన్ల పరిధిలోని సీఆర్పీలకు స్థానిక కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ బడి బయట పిల్లలను గుర్తించేందుకు సర్వే చేయాలన్నారు. సర్వే ఆధారంగానే రాబోయే వార్షిక ప్రణాళికలు, బడ్జెట్ రూపొందించబడతాయని స్పష్టం చేశారు. కేటాయించిన ప్రాంతంలో ప్రతి ఇంటినీ సందర్శించి బడి బయట పిల్లల వివరాలను సేకరించాలన్నారు. ప్రొఫార్మాలో వివరాలు నమోదు చేసి అన్లైన్ చేయాలన్నారు. ప్లానింగ్ కోఆర్డినేటర్ గోపాల్‌నాయక్, ఐఈడీ కోఆర్డినేటర్ పాండురంగ, అలెస్కో బాలమురళీ, ఏఎస్ఓలు జయచంద్రనాయుడు, చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అన్నీ ఉంటేనే అనుమతి
–పాఠశాలకు యూడైస్ కోడ్ తప్పనిసరి – చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి –ఆధార్ కూడా ఉండాలి –ఇవి లేకపోతే పది పరీక్షలకు నో ఎంట్రీ అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి విద్యార్థులకు సంబంధించి అన్ని వివరాలు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేశారా? మీ పాఠశాలకు యూడైస్ కోడ్ ఉందా? విద్యార్థికి సంబంధించి ఆధార్‌కార్డు వచ్చిందా? స్కూల్లో అనుమతి ఉన్న సెక్షన్లకు మించి విద్యార్థులు ఉన్నారా?.. ఈ వివరాలన్నీ ఒకసారి సరిచూసుకోండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం తప్పదు. దేశ వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలలకు యూనిక్ నంబర్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో యూనిఫైడ్ yì స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూడైస్) జాబితాలో పాఠశాల పేరు ఉంటేనే అది ప్రభుత్వ లెక్కలో ఉన్నట్టు. ఒకవేళ ప్రభుత్వ గుర్తింపు ఉండి.. యూడైస్ కోడ్ లేకపోయినా ఆ పాఠశాలను పరిగణనలోకి తీసుకోరు. దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాలకు ఒక నంబరు కేటాయిస్తారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరొక స్కూల్‌కు ఇవ్వరు. వాస్తవానికి 2008లోనే యూడైస్ కోడ్ అమలులోకి వచ్చింది. ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకుల్లో చాలామందికి అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగా యూడైస్ కోడ్‌కు దరఖాస్తు చేసుకోలేదు. అయితే.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో నిర్వాహకులు హడావుడిగా యూడైస్ కోడ్ తీసుకుంటున్నారు. చైల్డ్ఇన్ఫోలో వివరాల నమోదు విద్యార్థులకు సంబంధించి అన్ని వివరాలను ఆన్లైన్ చేయడంలో భాగంగా ‘చైల్డ్ఇన్ఫో’ నమోదు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. యూడైస్ జాబితాలో ఉన్న 1–10 తరగతుల విద్యార్థులకు సంబంధించి పూర్తి వివరాలు చైల్డ్ఇన్ఫోలో నమోదు చేయాలి. విద్యార్థిపేరు, తరగతి, ఊరు, కులం, తల్లిదండ్రులు, వార్షిక ఆదాయం, ఆధార్‌నంబరు ..ఇలా 24 అంశాలను పొందుపర్చాలి. ఒక విద్యార్థ వివరాలు ఒకసారి మాత్రమే నమోదుకు అవకాశం ఉంది. అయితే.. జిల్లాలో ఇంకా 26 వేల మంది వివరాలను నమోదు చేయలేదు. జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో 1–10 తరగతుల విద్యార్థులు 5,54,543 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటిదాకా 5,28,543 మంది వివరాలను నమోదు చేశారు. తక్కిన విద్యార్థుల్లో ఎక్కువమంది ప్రైవేట్ పాఠశాలల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. యూడైస్, చైల్డ్ఇన్ఫో వివరాలుంటేనే ఎన్ఆర్లు తీసుకుంటాం – గోవిందునాయక్, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల వివరాలు కచ్చితంగా చైల్డ్ఇన్ఫోలో నమోదు చేసి ఉండాలి. ఆధార్‌కార్డు కూడా కల్గివుండాలి. చదువుతున్న స్కూల్‌కు యూడైస్ కోడ్ తప్పనిసరి. ఇవి లేకపోతే ఆయా విద్యార్థుల నామినల్ రోల్స్ తీసుకోము. అలాగే ఎన్ని సెక్షన్లకు అనుమతి తీసుకున్నారో అంతేమంది విద్యార్థులుండాలి. ఎక్కువగా ఉంటే అదనపు సెక్షన్‌కు అనుమతి తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే ఆ విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోం. పైగా ఈ విద్యా సంవత్సరం నుంచి ‘వితౌట్ స్కూల్ స్టడీ’ ఉండదు. అలాంటి వారికి ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్ష ఫీజు కట్టించాల్సి ఉంటుంది. విద్యార్థులకు తీవ్ర నష్టం – దశరథరామయ్య (ఎస్ఎస్ఏ పీఓ), అంజయ్య (డీఈఓ) విద్యార్థుల వివరాలు చైల్డ్ఇన్ఫోలో నమోదు చేయకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ఫలాలూ అందవు. నమోదు కాని విద్యార్థులు నష్టపోతారు. ఎంఈఓలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చొరవ చూపి ఛిజ్చిజీlఛీజీnజౌ.్చp.nజీఛి.జీn వెబ్సైట్లో విద్యార్థుల వివరాలను నమోదు చేయాలి. -
‘చైల్డ్ ఇన్ఫో’డేటా ఎంట్రీలో జిల్లాకు చివరి స్థానం
విజయనగరం అర్బన్: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో చదువుతున్న విద్యార్థుల నమోదుకు సంబంధించిన ‘చైల్డ్ ఇన్ఫో’ డేటా ఎంట్రీ ప్రక్రియలో జిల్లా వెనుకబడి ఉంది. చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్ డేటా ఎంట్రీ, విద్యార్థుల ఆధార్ నంబర్ల నమోదు ప్రక్రియలో జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఈ నెల 22వ తేదీలోగా పై రెండు అంశాలను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ఇచ్చిన గడువు దాటిపోయినా ఇంకా 50 శాతం కూడా పూర్తి కాకపోవడంతో ఎస్ఎస్ఏ అధికారులు ఎంఈఓలకు ఫోన్లు చేసి త్వరగా పూర్తి చేయండి మహాప్రభో అని వెంటపడుతున్నారు. జిల్లాలోనిఅన్ని మండలాలకు ఇన్చార్జి విద్యాశాఖాధికారులుండడం వల్ల చాలా మంది ఎస్ఎస్ఏ అధికారులతో సమన్వయంతో పనిచేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఇచ్చిన ఆదేశాలను సకాలంలో అమలు చేయడంలో ఎంఈఓలు విఫలమవుతున్నారని ఎస్ఎస్ఏ అధికారుల వాదన. అయితే మండల స్థాయిలో తమకు ఉన్న అధికపనుల ఒత్తిడి వల్ల సాధ్యం కావడం లేదని ఎంఈఓలు చెబుతున్నారు. వెబ్సైట్లో నమోదు కాని 63 శాతం మంది విద్యార్థులు అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో నమోదు చేయించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత మంది చదువుతున్నారు? అనే విషయాలను ప్రధానంగా తెలుసుకోవడం కోసం 2012-13 విద్యా సంవత్సరం ఆఖరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇప్పటికీ పూర్తి కాలేదు. జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో మంగళవారం వరకు కేవలం 37 శాతం మాత్రమే అయింది. 13 జిల్లాలతో పోల్చుకుంటే చివరి స్థానంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలుపుకొని 2,90,805 మంది విద్యార్థినీవిద్యార్థులున్నారు. ఇప్పటి వరకు లక్షా 3,576 మంది వివరాలు మాత్రమే నమోదు చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఇంకా నమోదు కాాని వారిలో అధికశాతం ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులున్నారు. జిల్లా మొత్తం మీద ప్రైవేటు విద్యాసంస్థల్లో 40 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో కేవలం 10,420 మంది వివరాలు మాత్రమే నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డూప్లికేట్ ఎంట్రీలు లేకుండా చూసేందుకు, డ్రాపౌట్స్ ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు ఇదే వెబ్సైట్లో విద్యార్థుల ఆధార్ నంబర్‌ను ఎంట్రీ చేయాలని నెల రోజుల క్రితం ఆదేశించారు. దీంతో విద్యార్థుల పేర్ల నమోదు ప్రక్రియ మళ్లీ మొదటి వచ్చింది. ఇప్పటికే ‘చైల్డ్ ఇన్ఫో’ డేటా ఎంట్రీ ప్రక్రియలో భాగంగా వెబ్సైట్లో నమోదయిన విద్యార్థులందరి ఆధార్ నంబర్‌ను ఫీడ్ చేయాలని ఆదేశించారు. విద్యార్థులు విధిగా ఆధార్‌కార్డులు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంలో ఎంఈఓలు విఫలమయ్యారు. ఆధారు కార్డులు లేని విద్యార్థుల వివరాలను పాఠశాల వారీగా తెలియజేస్తే సమీప ప్రాంతాలలో విద్యార్థులకు అందుబాటులో ఆధార్ కార్డు మంజూరు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రెవెన్యూ అధికారులు మొత్తుకొని చెప్పినా సంబంధిత వివరాలను ఇవ్వడంలో ఎంఈఓలు నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆధార్ కార్డులు లేనివిద్యార్థులను వెబ్సైట్లో నమోదు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఎంఈఓలు స్పందిస్తే చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో ఎంట్రీ ప్రక్రియను విజయవంతం చేయవచ్చని విద్యాశాఖ నిపుణులు చెపుతున్నారు. -
నమోదు కాని 96 వేలమంది పిల్లల వివరాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల పుణ్యమా అని 96 వేల మంది విద్యార్థులు రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలకు దూరం కానున్నారు. ఇప్పటికైనా ఆయా పాఠశాలల యాజమాన్యాలు తేరుకోకపోతే మాత్రం వీరందరికీ అన్యాయం చేసినట్టవుతుంది. ఇంతకాలం పాఠశాలల్లో చదువుతున్నట్లు రికార్డుల్లో ఉంటే చాలు మధ్యాహ్న భోజన పథకం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్కాలర్‌షిప్‌లతో పాటు పథకాలు మంజూరయ్యేవి. రికార్డుల్లో పేర్లున్న విద్యార్థులు ఫిజికల్‌గా ఉన్నారా... లేదా అనేది సంబంధం లేదు. చాలామంది పిల్లల పేర్లు అటు ప్రభుత్వ పాఠశాలలు, ఇటు ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఉన్నట్లు (డ్యూయల్ ఎంట్రీ) ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది. ఇంకా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనైతే రికార్డుల్లో చూపించిన విద్యార్థులు అసలే ఉండరు. కేవలం పోస్టులు కాపాడుకునేందుకు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారులను తప్పుదారి పట్టించడమే కాకుండా పథకాల అమలులో అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. ఈ అంశాలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. డ్యుయల్ ఎంట్రీ, లేని విద్యార్థులను ఉన్నట్లు రికార్డుల్లో చూపించడం వంటివాటికి చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. చైల్డ్ఇన్ఫోలో నమోదు 2012-13 విద్యా సంవత్సరం యూనిఫైడ్ డి స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూడైస్) జాబితాలో ఉన్న స్కూళ్లలో 1-10 తరగతులు చదువుతున్న విద్యార్థి పేరు, తరగతి, ఊరు, కులం, తల్లిదండ్రులు, వార్షిక ఆదాయం, ఆధార్ నంబరు తదితర సుమారు 24 అంశాలను పరిగణనలోకి తీసుకుని చైల్డ్ఇన్ఫోలో నమోదు చేయాల్సి ఉంది. ఒక విద్యార్థి వివరాలు ఒకసారి మాత్రమే నమోదుకు అవకాశం ఉంటుంది. నమోదు కాని 96 వేలమంది పిల్లల వివరాలు జిల్లాలో చదువుతున్న దాదాపు లక్షమంది విద్యార్థుల వివరాలను ఇప్పటిదాకా నమోదు చేయలేదు. వీరందరూ ఎక్కడ చదువుతున్నారు.. అసలు ఉన్నారా.. లేదా అని తెలియక విద్యా శాఖ తల పట్టుకుంటోంది. సుమారు ఆర్నెళ్లకుపైగా జిల్లాలో చైల్డ్ ఇన్ఫో కార్యక్రమం విడతల వారీగా చేపడుతున్నారు. 1-10 తరగతుల విద్యార్థులు 6,10,543 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటిదాకా 5,14.064 మంది పిల్లల వివరాలను నమోదు చేశారు. తక్కిన 96,479 మంది పిల్లల వివరాలు నమోదు కాలేదు. వీరిలో ప్రైవేట్ పాఠశాలల్లోనే ఎక్కువమంది ఉన్నారు. వీరంతా ఎక్కడున్నారనే దానిపై ఎస్ఎస్ఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఛిజ్చిజీఛీజీజౌ.్చఞ.జీఛి.జీ వెబ్సైట్లో పిల్లల వివరాలను నమోదు చేయాలని ఎస్ఎస్ఏ పీఓ మధుసూదన్‌రావు కోరుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల నిర్లక్ష్యం చైల్డ్ ఇన్ఫో నమోదులో ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన మేరకు నమోదు చేస్తున్నా, ప్రైవేట్ పాఠశాలలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఆర్నెళ్లకుపైగా అధికారులు వెంట పడుతున్నా.. నేటికీ ఈ ప్రక్రియ ప్రారంభించని ప్రైవేటు పాఠశాలలు చాలానే ఉన్నాయి. కొన్ని ప్రైవేటు స్కూళ్లలో కొందరి విద్యార్థుల వివరాలు మాత్రమే నమోదు చేస్తున్నారు. ఒక సెక్షనుకు అనుమతి తీసుకుని రెండు మూడు సెక్షన్లు నిర్వహిస్తుంటారు. అదనపు సెక్షన్లలో ఉండే విద్యార్థులను నమోదు చేయడం లేదని తెలిసింది. దీనికితోడు 2012-13 విద్యా సంవత్సరం డైస్ జాబితా మేరకు నమోదు చేస్తుండడంతో 2013-14లో నూతనంగా ప్రారంభమైన పాఠశాలల పిల్లలను నమోదు చేయడం లేదు. అయితే జిల్లా అధికారులు ఒక ప్రత్యేక ప్రొఫార్మా తయారు చేసి ఇలాంటి పాఠశాలల పిల్లల వివరాల నమోదుకు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు నష్టం చైల్డ్ఇన్ఫో నమోదు చేయకపోతే సదరు విద్యార్థికి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ఫలాలు అందవు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ చైల్డ్ఇన్ఫోలో నమోదైన విద్యార్థులను మాత్రమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. నమోదు కాని విద్యార్థులు నష్టపోనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే అధికారులు ఎంఈఓలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయుల వెంట పడుతున్నారు. అయినా ఆశించిన ఫలితం రావడం లేదు.