రీ సర్వే | re survey of child info | Sakshi
Sakshi News home page

రీ సర్వే

Published Sat, May 13 2017 11:31 PM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM

రీ సర్వే - Sakshi

రీ సర్వే

- ఆన్‌లైన్‌లో కనిపించని 80 వేల మంది విద్యార్థుల వివరాలు
– సరిపోలని ప్రజాసాధికారత సర్వే. చైల్డ్‌ఇన్‌ఫో జాబితా
– ఇంటింటికీ వెళ్లనున్న టీచర్లు, సీఆర్టీలు, డీఎల్‌ఎంటీలు
– ఈ నెల చివరినాటికి సర్వే పూర్తి చేయాలని ఆదేశం


అనంతపురం ఎడ్యుకేషన్‌ : జీఎం లాస్య...ఈ అమ్మాయి హౌసింగ్‌బోర్డులోని 28–5–36 డోరు నంబర్‌లో ఉంటోంది. జే. గౌతంరాజ్‌ ఈ అబ్బాయి అగళి మండలం కేంద్రంలోని ఇందిరమ్మకాలనీలో ఉంటున్నాడు. ప్రజాసాధికారత సర్వేలో అధికారులు ఇంటింటికి వెళ్లినప్పుడు  ఈ వివరాలు నమోదు చేశారు. వీరి ఆధార్‌ నంబర్ల ఆధారంగా ఆన్‌లైన్‌లో చూస్తే వీరు ఎక్కడ చదువుతున్నారు...ఎన్నో తరగతి చదువుతున్నారనే వివరాలు కనిపించడం లేదు. మరో వైపు చైల్డ్‌ఇన్‌ఫోలో వీరి పేర్లే లేవు.  జిల్లాలో 80 వేలమందికి పైగా విద్యార్థుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.  ఈ క్రమంలో విద్యార్థుల లెక్కలు తేల్చడానికి ప్రభుత్వం రీ సర్వే చేపడుతోంది.

ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ప్రజాసాధికారత సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల  సమగ్ర వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు.  గతంలో విద్యాశాఖ చేపట్టిన చైల్డ్‌ ఇన్‌ఫో జాబితాలోని విద్యార్థుల వివరాలకు, ప్రస్తుతం ప్రజాసాధికారత సర్వేలో చేపట్టిన వివరాలకు పొంతన కుదరడం లేదు. జిల్లాలో సుమారు 80 వేలమంది పిల్లలు వివరాలు తేలడం లేదు. చైల్డ్‌ ఇన్‌ఫో జాబితాలోని విద్యార్థులకు సంబంధించి సమగ్ర వివరాలుంటాయి. అంటే విద్యార్థి పేరు, తండ్రి, తల్లి, వయసు, తరగతి, స్కూల్‌ పేరు, స్కూల్‌ యూడైస్‌ కోడ్, కులం, ఊరు, ఆధార్‌ నంబరు ఇలా...దాదాపు అన్ని వివరాలుంటాయి. మరి ప్రజాసాధికారత సర్వే జాబితాలో ఉన్న ఆధార్‌కార్డు నంబరు ఆధారంగా ఆన్‌లైన్‌లో చూస్తే 80 వేలమంది  పిల్లలు ఎక్కడ చదువుతున్నారనే వివరాలు రావడం లేదు. అంటే ఆధార్‌ నంబరును తప్పుగా నమోదు చేశారా..లేదంటే చైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదు కాకపోయి ఉండాలి.

ఇంటింటికీ అయ్యవార్లు..
విద్యార్థుల లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం రీ సర్వే చేయాలని నిర్ణయించింది. ఉపాధ్యాయులు, సీఆర్పీలు, డీఎల్‌ఎంటీల ద్వారా ఈ నెలాఖరులోగా ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల వివరాలను సేకరించనున్నారు. ప్రజాసాధికారత సర్వే జాబితాను రెవెన్యూ గ్రామాల వారిగా రూపొందించారు. ఈ జాబితాను విద్యాశాఖకు  పంపారు. జాబితా ఆధారంగా ఆధార్‌ నంబరు, డోర్‌ నంబరుకు వెళ్లి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి/అబ్బాయి ప్రస్తుతం ఎక్కడ చదువుతున్నాడు...స్కూల్, తరగతి తదితర వివరాలు సేకరిస్తారు.

ప్రత్యేక యాప్‌ ద్వారా నమోదు
ఇందుకోసం ఏపీ జీఈఆర్‌ (ఆంధ్రప్రదేశ్‌ గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో) అనే యాప్‌ను ప్రభుత్వం కొత్తగా రూపొందించింది. సర్వేకు వెళ్లే టీచర్లు, సీఆర్పీలు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశారు. యాప్‌ ఓపెన్‌ చేయగానే జిల్లా, మండలం, రెవెన్యూ గ్రామం వివరాలు వస్తాయి. వాటిని క్లిక్‌ చేయగానే రెవెన్యూ గ్రామంలో ఉన్న పిల్లలు, అడ్రస్, ఆధార్‌నంబర్‌ కనిపిస్తాయి. వాటి ఆధారంగా ఆయా ఇళ్లకు వెళ్లి పిల్లలు ప్రస్తుతం ఎక్కడ చదువుతున్నారు...ఎన్నో తరగతి చదువుతున్నారనే వివరాలను యాప్‌లోనే నమోదు చేస్తారు. ఈ యాప్‌ ఆన్‌లైన్‌తో అనుసంధానం చేయడంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరతాయి.

నెలాఖరులోగా పూర్తి కావాలి
జిల్లాలో సుమారు 80 వేలమంది పిల్లలు వివరాలు ప్రజాసాధికారిత సర్వే, చైల్డ్‌ఇన్‌ఫో జాబితాకు సరిపోవడం లేదు. ప్రజాసాధికారత సర్వే జాబితా ఆధారంగా టీచర్లతో రీసర్వే చేయిస్తున్నాం. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– లక్ష్మీనారాయణ, డీఈఓ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement