బడిలో చదువుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టింది. అవి అందాలంటే పిల్లల పూర్తి వివరాలు కచ్చితంగా చైల్డ్ ఇన్‌ఫోలో నమోదు కావాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నా ప్రైవేటు యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. చిన్నపాటి లొసుగుల కారణంగా నమోదు విషయంలో వారు మొండికేస్తున్నారు. అయినా విద్యాశాఖాధికారులు మాత్రం దీనిపై ఎందుకో ఉదాసీనవైఖరి అవలంబిస్తున్నారు. దీనివల్ల పిల్లలకు ప్రభుత్వ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది.
విజయనగరం అర్బన్: విద్యార్థుల ఆధార్ అనుసంధాన ఆన్‌లైన్ వివరాల నమోదు (చైల్డ్ ఇన్ఫో) ప్రక్రియపై విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ నమోదు జరగకపోయినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచింది. ఇప్పటికీ ఇంకా సుమారు 30 వేల మంది విద్యార్థుల వివరాల నమోదు పూర్తి కాలే దు. ఫలితంగా చిన్నారులకు ప్రభుత్వ పథకాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల ఆధార్‌తో కూడిన వివరాలను చైల్డ్ ఇన్‌ఫోలో క్రోడీకరిస్తున్నారు. కానీ ప్రైవేటు సంస్థలే నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ప్రైవేటు విద్యాసంస్థల్లోనే ఇబ్బందులు..
జిల్లాలో 2019–20 విద్యాసంవత్సరానికి 3,09,139 మంది విద్యార్ధులు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలల్లో చేరాలన్నది లక్ష్యం. తాజా నివేదికల ప్రకారం 2,96,342 మంది నమోదయ్యారు. వీటిలో ఈ ఏడాది నూతనంగా ఒకటో తరగతిలో చేరినవారు 31,500 మంది ఉన్నారు. వీరిలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 6 వేల మంది వరకు ఉండగా మిగిలిన తరగతుల్లో 10వేల వరకు చేరారు. ఇందులో 8,479 మంది ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటుకు వెళ్లినవారు మాత్రం కేవలం 734 మంది మాత్రమే ఉన్నారు. పాఠశాలల్లో చేరిన ప్రతి విద్యార్థి వివరాలను అధార్ నంబర్, తల్లి బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటి వివరాలను అనుసంధానంగా చైల్డ్ ఇన్‌ఫోలో కలపాలి. ఈ ప్రక్రియను విద్యార్థి ప్రవేశించిన తొలి రోజునే ఆయా స్కూళ్ల యాజమాన్యాలు చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నమోదు నిబంధనలు శతశాతం పాటిస్తున్నారు. కానీ ప్రైవేటు, కార్మొరేట్ విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయం, నవోదయ, సైనిక్ స్కూల్ యాజమాన్యాలు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు. విద్యాశాకాధికారులు పటిష్టమైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమన్న వాదన వినిపిస్తోంది.
నమోదుపై అశ్రద్ధ అందుకే...
ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఆ యా యాజమాన్యాలు టీసీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటుకు వస్తున్న విద్యార్థులను టీసీ లేకపోయినా చేర్చుకుంటున్నారు. దీనివల్ల చైల్జ్‌ఇన్‌ఫోలో విద్యార్థుల వివరాలు చేర్పడానికి ప్రైవేటు యాజమాన్యాలు ముందుకు రావడంలేదు. జిల్లాలో 586 ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల విద్యాలయాలు ఉన్నాయి. వాటిలో గతేడాది చైల్డ్ ఇన్‌ఫోలో నమోదు చేసిన విద్యార్థుల సంఖ్య 98,268 మంది మాత్రమే. కానీ నిజానికి ఆ స్కూళ్ల నుంచి గతేడాది నుంచి నమోదు కావాల్సిన సంఖ్య 25 వేల వరకూ ఉంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో 90 పాఠశాలల వరకు ఉన్నాయి. ఇందులో ఐదు పాఠశాలల్లో 2 నుంచి 10 మందిలోపు విద్యార్థుల వివరాలు నమోదు చేశారు. వీటిలో 80 శాతం పాఠశాలల్లో కనీసం ఒక్క విద్యార్థి వివరాలైనా నమోదు చేయలేదు. నమోదు లేదంటే విద్యార్థులు పాఠశాలలో లేనట్టే.
పథకాలకు దూరమయ్యే ప్రమాదం
చైల్డ్ ఇన్‌ఫోలో వివరాలు లేకుంటే విద్యార్థుల పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని పాఠశాలలకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చైల్డ్ ఇన్‌ఫోలో విద్యార్థి వివరాలు ఉంటేనే పథకం అందుతుంది. ఇప్పటికే పలు పాఠశాలల్లో విద్యార్థుల తల్లుల ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్లు తీసుకుంటున్నారు. మరోవైపు స్కూల్ యూనిఫాం దుస్తులకు సంబంధించి కుట్టుకూలి సైతం తల్లుల ఖాతాల్లోకే వేయమన్నారు. ఇలా ప్రతి పథకానికి విద్యార్థుల వివరాలే ప్రామాణికం.
చైల్డ్ ఇన్‌ఫోలో నమోదు తప్పనిసరి
ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ఏ తరగతిలో చేర్చుకున్నా విధిగా చైల్డ్ ఇన్‌ఫోలో నమోదు చేయాల్సిందే. విద్యార్థి నుంచి టీసీ తీసుకున్న తొలి రోజునే విద్యార్థి ఆధార్, తల్లి బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలతో చైల్డ్ ఇన్‌ఫోలో పెట్టాలి. ఈ బాధ్య త సంబంధిత పాఠశాల నిర్వాహకులదే. వీటి నమోదు ప్రభుత్వ పాఠశాలల్లో శతశాతం పూర్తయింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇంకా 2.5 శాతం చేయాల్సి ఉంది.
– జి.నాగమణి, డీఈఓ, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment