private scholls
-
ఫీజు చెల్లించలేదని ఆన్లైన్ క్లాసులు ఎలా ఆపుతారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజలు వసూలు చేస్తున్నారంటూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌పై పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరెంట్స్ ఫోరం చేసిన అప్పీల్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణచేపట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పిటిషన్‌దారు కోర్టుకు తెలిపారు. ఫీజులు చెల్లించని 219 మందికి ఆన్లైన్ తరగతులు బోధించడం లేదన్నారు. పిటిషనర్ వాదనలకు బదులిస్తూ.. 10 శాతం ఫీజు పెంపును వెనక్కి తీసుకోవడంతోపాటు.. ఇప్పటికే 10వేల రూపాయల ఫీజు తగ్గించామని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఫీజు చెల్లించలేదని ఆన్లైన్ తరగతులు ఎలా ఆపుతారని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. అలా ఆపితే పిల్లల చదువుకునే హక్కును కాలరాయడమేనని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా విపత్తు వేళ మానవీయంగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. ఫీజుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఫీజులతో ముడి పెట్టకుండా ఆన్లైన్ బోధన కొనసాగించాలన్న హైకోర్టు.. తదుపరి విచారణ జూలై 13కి వాయిదా వేసింది. -
చేతులు కాలాకా..
సాక్షి, వేములవాడ : నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లు నడుపుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరించిన విద్యాశాఖ, ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్లపై తిరుగుతున్నా పట్టించుకోని రవాణా శాఖ అధికారులకు ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోయిన తర్వాత కనువిప్పు కలిగింది. ‘చేతుల కాలాకా.. ఆకులు పట్టుకున్నారన్న చందంగా’ విద్యాశాఖ, రవాణాశాఖ తేరుకుని చర్యలకు పూనుకుంది. ఈనెల 28న వేములవాడ బస్‌డిపో ప్రాంతంలో డివైడర్‌ను ఢీకొని వ్యాన్ బోల్తా పడటంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కంటి తుడుపు చర్యల్లో భాగంగా విద్యాశాఖ అధికారులు గురువారం వేములవాడ పట్టణంలోని వాగేశ్వరీ స్కూల్‌ను సీజ్ చేశారు. ఇక రవాణాశాఖ అధికారులు హడావిడిగా వేములవాడ ప్రాంతానికి చేరుకుని వాహనాల తనిఖీలు ప్రారంభించారు. వేములవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబకడంతో రాబోయే ప్రమాదాలనను ముందే పసిగట్టిన ప్రయివేటు విద్యా సంస్థలు ఐదు రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించుకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారుల బలికావడంపై యావత్ సమాజం అధికార యంత్రాంగంపై దుమ్మెత్తి పోస్తోంది. తేరుకున్న విద్యాశాఖ.. వాగేశ్వరి స్కూల్ సీజ్ వేములవాడలో అనుమతులు లేకుండా నడుస్తున్న వాగేశ్వరి పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడటంతో విద్యాశాఖ తేరుకుంది. గురువారం స్థానిక పోలీసులకు సమాచారం అందించి పట్టణంలోని వాసుదేవా టవర్స్‌లో నిర్వహిస్తున్న వాగేశ్వరీ స్కూల్‌ను ఎంఈవో కే.సురేశ్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు అనుమతులు లేవని, హాస్టల్ నడిపించడం రూల్స్‌లో లేవన్నారు. రూల్స్‌కు విరుద్ధంగా నడుస్తున్న వాగేశ్వరి స్కూల్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్కూల్‌ను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. చిన్నారుల మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై, వ్యాన్ డ్రైవర్ రఫీక్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎన్. వెంకటస్వామి తెలిపారు. అయోమయంలో పేరెంట్స్ వేములవాడ పట్టణంలోని వాగేశ్వరి స్కూల్ అనుమతులు లేకుండా నడుస్తుండటంతో గురువారం ఎంఈవో సురేశ్ సీజ్ చేశారు. దీంతో ఈ పాఠశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో గురువారం పలువురు పేరెంట్స్ పాఠశాల వద్దకు చేరుకుని విషయం తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. నాలుగు వేలిచ్చుకో.. ఫిట్నెస్ సర్టిఫికెట్ పుచ్చుకో.. ప్రతీ ఏడాది వాహనాలకు తప్పకుండా ఫిట్నెస్ చేయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు గత జూన్ మాసంలోనే విద్యా సంస్థలకు చెందిన వ్యాన్లు, బస్సులు, మినీ బస్సులకు ఫిట్నెస్ చేయించడంలో రవాణా శాఖ బిజీ అయ్యింది. ఈక్రమంలో ఒక్కో వాహనానికి రూ.4 వేల చొప్పున పైకం పుచ్చుకుని సర్టిఫికేట్లు ఇచ్చేసినట్లు పలువురు పాఠశాల యజమానులే పేర్కొంటున్నారు. ఫిట్నెస్ సమయంలో సరైన నిబంధనలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణాశాఖ అధికారులు కేవలం జూన్ మాసంలోనే హడావిడి సృష్టించి ఆ తర్వాత స్కూల్ వ్యాన్ల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న ఆరోపణలు గుప్పు మంటున్నాయి. వేములవాడ ప్రాంతంలో ఎన్ని స్కూళ్లు ఉన్నాయి..? వాటికి ఎన్ని బస్సులు ఉన్నాయన్న అంశం ఆ శాఖ అధికారులకు తెలిసినప్పుడు మిగతా వాహనాలపై ఎందుకు దృష్టి సారించలేకపోయారంటూ జనం ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు మూలనపడిన కాలం చెల్లిన బస్సులను సైతం రోడ్లపై తిప్పుతుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరగడం, అమాయక విద్యార్థులు బలవుతున్నారు. బస్‌డిపో వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం సైతం బస్ ఫిట్నెస్ లేకపోవడమే ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. అనుమతిలేని హాస్టల్ రద్దు రెండు నెలల క్రితం చింతాలఠాణ ఆర్అండ్ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన రేకుల షెడ్డులో వాగేశ్వరి పాఠశాల హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. దానికి అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేదని డీఈవో రాధాకిషన్ బుధవారం వెల్లడించారు. ఆ హస్టల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు సుమారుగా 40 నుంచి 50 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఉదయం ఇక్కడి నుంచి విద్యార్థులు స్కూల్‌కు వ్యాన్‌లో వెళ్లి మధ్యాహ్నం భోజనానికి వ్యాన్‌లో వచ్చి వెళ్తారు. మళ్లీ సాయంత్రం హాస్టల్‌కు వస్తారు. వరుసగా ఐదు రోజులు సెలవులు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పట్టణంలోని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు గురు, శుక్ర, శనివారాలు సెలవులు ప్రకటించారు. మరో రెండు రోజులు ఒకరోజు అదివారం, సోమవారం వినాయక చవితి కావడంతో విద్యార్థులకు ఐదు రోజులు సెలవులు ప్రకటించారు. -
బడిలో ఉన్నా.. లేనట్టే !
బడిలో చదువుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టింది. అవి అందాలంటే పిల్లల పూర్తి వివరాలు కచ్చితంగా చైల్డ్ ఇన్ఫోలో నమోదు కావాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నా ప్రైవేటు యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. చిన్నపాటి లొసుగుల కారణంగా నమోదు విషయంలో వారు మొండికేస్తున్నారు. అయినా విద్యాశాఖాధికారులు మాత్రం దీనిపై ఎందుకో ఉదాసీనవైఖరి అవలంబిస్తున్నారు. దీనివల్ల పిల్లలకు ప్రభుత్వ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. విజయనగరం అర్బన్: విద్యార్థుల ఆధార్ అనుసంధాన ఆన్లైన్ వివరాల నమోదు (చైల్డ్ ఇన్ఫో) ప్రక్రియపై విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ నమోదు జరగకపోయినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచింది. ఇప్పటికీ ఇంకా సుమారు 30 వేల మంది విద్యార్థుల వివరాల నమోదు పూర్తి కాలే దు. ఫలితంగా చిన్నారులకు ప్రభుత్వ పథకాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల ఆధార్‌తో కూడిన వివరాలను చైల్డ్ ఇన్ఫోలో క్రోడీకరిస్తున్నారు. కానీ ప్రైవేటు సంస్థలే నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లోనే ఇబ్బందులు.. జిల్లాలో 2019–20 విద్యాసంవత్సరానికి 3,09,139 మంది విద్యార్ధులు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలల్లో చేరాలన్నది లక్ష్యం. తాజా నివేదికల ప్రకారం 2,96,342 మంది నమోదయ్యారు. వీటిలో ఈ ఏడాది నూతనంగా ఒకటో తరగతిలో చేరినవారు 31,500 మంది ఉన్నారు. వీరిలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 6 వేల మంది వరకు ఉండగా మిగిలిన తరగతుల్లో 10వేల వరకు చేరారు. ఇందులో 8,479 మంది ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటుకు వెళ్లినవారు మాత్రం కేవలం 734 మంది మాత్రమే ఉన్నారు. పాఠశాలల్లో చేరిన ప్రతి విద్యార్థి వివరాలను అధార్ నంబర్, తల్లి బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటి వివరాలను అనుసంధానంగా చైల్డ్ ఇన్ఫోలో కలపాలి. ఈ ప్రక్రియను విద్యార్థి ప్రవేశించిన తొలి రోజునే ఆయా స్కూళ్ల యాజమాన్యాలు చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నమోదు నిబంధనలు శతశాతం పాటిస్తున్నారు. కానీ ప్రైవేటు, కార్మొరేట్ విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయం, నవోదయ, సైనిక్ స్కూల్ యాజమాన్యాలు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు. విద్యాశాకాధికారులు పటిష్టమైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమన్న వాదన వినిపిస్తోంది. నమోదుపై అశ్రద్ధ అందుకే... ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఆ యా యాజమాన్యాలు టీసీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటుకు వస్తున్న విద్యార్థులను టీసీ లేకపోయినా చేర్చుకుంటున్నారు. దీనివల్ల చైల్జ్ఇన్ఫోలో విద్యార్థుల వివరాలు చేర్పడానికి ప్రైవేటు యాజమాన్యాలు ముందుకు రావడంలేదు. జిల్లాలో 586 ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల విద్యాలయాలు ఉన్నాయి. వాటిలో గతేడాది చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసిన విద్యార్థుల సంఖ్య 98,268 మంది మాత్రమే. కానీ నిజానికి ఆ స్కూళ్ల నుంచి గతేడాది నుంచి నమోదు కావాల్సిన సంఖ్య 25 వేల వరకూ ఉంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో 90 పాఠశాలల వరకు ఉన్నాయి. ఇందులో ఐదు పాఠశాలల్లో 2 నుంచి 10 మందిలోపు విద్యార్థుల వివరాలు నమోదు చేశారు. వీటిలో 80 శాతం పాఠశాలల్లో కనీసం ఒక్క విద్యార్థి వివరాలైనా నమోదు చేయలేదు. నమోదు లేదంటే విద్యార్థులు పాఠశాలలో లేనట్టే. పథకాలకు దూరమయ్యే ప్రమాదం చైల్డ్ ఇన్ఫోలో వివరాలు లేకుంటే విద్యార్థుల పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని పాఠశాలలకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థి వివరాలు ఉంటేనే పథకం అందుతుంది. ఇప్పటికే పలు పాఠశాలల్లో విద్యార్థుల తల్లుల ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్లు తీసుకుంటున్నారు. మరోవైపు స్కూల్ యూనిఫాం దుస్తులకు సంబంధించి కుట్టుకూలి సైతం తల్లుల ఖాతాల్లోకే వేయమన్నారు. ఇలా ప్రతి పథకానికి విద్యార్థుల వివరాలే ప్రామాణికం. చైల్డ్ ఇన్ఫోలో నమోదు తప్పనిసరి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ఏ తరగతిలో చేర్చుకున్నా విధిగా చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాల్సిందే. విద్యార్థి నుంచి టీసీ తీసుకున్న తొలి రోజునే విద్యార్థి ఆధార్, తల్లి బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలతో చైల్డ్ ఇన్ఫోలో పెట్టాలి. ఈ బాధ్య త సంబంధిత పాఠశాల నిర్వాహకులదే. వీటి నమోదు ప్రభుత్వ పాఠశాలల్లో శతశాతం పూర్తయింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇంకా 2.5 శాతం చేయాల్సి ఉంది. – జి.నాగమణి, డీఈఓ, విజయనగరం -
ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% సీట్లు
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ప్రైవేట్, ప్రత్యేక కేటగిరీ పాఠశాలల్లో 25 శాతం సీట్లను బలహీన వర్గాల వారి పిల్లలకు కేటాయించాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. బాలలకు ఉచిత, నిర్బంధ విద్య చట్టం–2010 ప్రకారం..ప్రాథమికోన్నత స్థాయి విద్య 6–14 ఏళ్ల మధ్య పిల్లలందరి ప్రాథమిక హక్కని తెలిపింది. అదేవిధంగా బౌన్సర్ల నియమించుకుని బలవంతంగా రుణ వసూళ్లు చేపట్టే అధికారం ఏ బ్యాంకుకూ లేదని తెలిపింది. మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ సోమవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. అన్ని ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, స్పెషల్ కేటగిరీ పాఠశాలల్లో ఒకటి, అంతకంటే తక్కువ తరగతులకు చేపట్టే ప్రవేశాల్లో ఆ తరగతిలోని కనీసం 25 శాతం సీట్లను బలహీన, వెనుకబడిన వర్గాల వారి పిల్లలకు ఇవ్వాలి. ఆ తరగతి పూర్తయ్యే వరకు వారికి ఉచితంగా విద్య అందించాలి’ అని ఆయన కోరారు. ‘ఆ చిన్నారుల కయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రం నిర్ణయించిన ఫీజు ప్రకారం, లేదా వాస్తవంగా ఒక్కో చిన్నారి నుంచి వసూలు చేసే ఫీజు.. ఏది తక్కువైతే అందుకు సరిసమానమైన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది’ అని తెలిపారు. ప్రభుత్వం నుంచి భూమి, వసతి, పరికరాలను ఉచితంగా గానీ లేదా తక్కువ ధరకుగానీ పొంది 25 శాతం మంది చిన్నారులకు రిజర్వేషన్ ప్రకారం ఉచిత విద్య అందిస్తున్న పాఠశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదని తెలిపారు. బౌన్సర్లతో వసూళ్లు వద్దు: బలవంతంగా రుణాలను వసూలు చేసుకునేందుకు గాను ఏ బ్యాంక్‌కు కూడా బౌన్సర్లను నియమించుకునే అధికారం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించారు. ‘ఆమోదించిన మార్గదర్శకాల మేరకే రుణ వసూళ్లు చేపట్టాలి. రుణ గ్రహీతపై దౌర్జన్యం చేయడం, ఇబ్బందులు పెట్టడాన్ని ఆర్బీఐ నిషేధించింది. పోలీసుల ధ్రువీకరణ, అవసరమైన ఇతర అర్హతలు పొందిన తర్వాత మాత్రమే బ్యాంకులు రికవరీ ఏజెంట్లను నియమించుకునేందుకు ఆర్బీఐ వీలు కల్పించింది’ అని తెలిపారు. టీచర్స్ కోటా బిల్లుకు ఆమోదం కేంద్ర విద్యాసంస్థలు (టీచర్స్ కేడర్ బిల్లు–2019) బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. దేశవ్యాప్తంగా 41 సెంట్రల్ యూనివర్సిటీల్లో 8వేల పోస్టుల భర్తీకి అమలయ్యే రిజర్వేషన్ల విషయంలో డిపార్టుమెంట్‌ను యూనిట్‌ను కాకుండా యూనివర్సిటీని యూనిట్‌గా పరిగణించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వం తెచ్చిన చట్టం కూడా అమలవుతుంది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే ఆర్డినెన్స్ స్థానంలో అమలవుతుంది. -
మరింత దోచుకోమని సిఫారసులా?
హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న నవీన్ ఓ ప్రైవేటు కంపెనీలో సాధారణ ఉద్యోగి. ఆయన కొడుకు యూకేజీ ఫీజు ఏడాదికి రూ.42 వేలు. ఆటో ఫీజు కోసం మరో రూ.15 వేలు చెల్లిస్తున్నారు. మరో ప్రైవేటు ఉద్యోగి శ్రీనివాస్.. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ ప్లే స్కూల్లో తన కూతురుకు రూ.30 వేలు చెల్లిస్తున్నారు. వరంగల్‌లో ప్రైవేటు ఉద్యోగి గోపాల్ ఓ సాధారణ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్న తన మూడో తరగతి కూతురికి ఏటా రూ.20 వేలు చెల్లిస్తున్నారు. అదే తన మూడేళ్ల చిన్న కూతురు ప్లే స్కూల్‌కు మాత్రం రూ.25 వేలు చెల్లించాల్సి వస్తోంది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఖమ్మంలోని ఓ సాధారణ స్కూల్లో ఐదో తరగతి చదివే తన కూతురుకు ఏటా రూ.30 వేలు ఫీజు కడుతున్నారు. చిన్నవాడైన తన కొడుకుకు నర్సరీకి రూ.20 వేలు చెల్లిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్ ..ఇలా 31 లక్షల మంది సాధారణ, మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేటు యాజమాన్యాలు ఏటా భారీ మొత్తంలో ఫీజులను పెంచుతుండటంతో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని రాష్ట్రంలో తల్లిదండ్రుల కమిటీలు ఆందోళన చేశాయి. అయితే ఏడేళ్లుగా ఫీజుల తగ్గింపు కోసం తల్లిదండ్రుల కమిటీలు ఆందోళనలు చేయడం.. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, వాటిని కోర్టుల్లో యాజమాన్యాలు సవాలు చేయడం.. చివరకు జీవోలు కొట్టివేయండం.. సర్వసాధారణంగా జరుగుతుండటంతో ఫీజుల నియంత్రణ అటకెక్కింది. యాజమాన్యాల అనుకూలతపైనే దృష్టి యాజమాన్యాల అనుకూల విధానాలపైనే ప్రధాన కమిటీ దృష్టి సారించిందని, అందుకే ఈ సిఫారసులు చేసిందంటూ తల్లిదండ్రుల కమిటీలు ఆరోపిస్తున్నాయి. ఒక్క సిఫారసు కూడా తల్లిదండ్రులకు అనుకూలంగా చేయలేదని తీవ్రంగా దుయ్యబట్టాయి. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను కలసి విన్నవించాయి. ఆ నివేదికను ఆమోదించవద్దని కోరాయి. ఫీజులు మరింత పెంచేలా.. పట్టణ ప్రాంతాల్లో కనీసంగా రూ.12 వేల నుంచి టాప్ స్కూళ్లలో 2.5 లక్షల వరకు ఫీజులను యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులను చదివిస్తున్న 31 లక్షల మంది తల్లిదండ్రుల్లో సాధారణ, మధ్య తరగతి వారే 80 శాతం వరకు ఉన్నారు. వారు చదివిస్తున్న పాఠశాలల్లో కనీస ఫీజు రూ.20 వేల నుంచి రూ.45 వేల వరకు ఉంది. ఈ మేరకు ఉన్న ఫీజులను తగ్గించేలా కమిటీ శాస్త్రీయ విధానాన్ని రూపొందిస్తుందని భావించినా.. అందుకు భిన్నంగా సిఫారసు చేయడంతో ఉసూరుమంటున్నారు. ఏఎఫ్ఆర్సీ తరహాలో చేయలేరట రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల ఫీజులను కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) ఖరారు చేస్తోంది. ఉన్నంతలో శాస్త్రీయ విధానమూ ఇదే. కాని అది సాధ్యం కాదని తిరుపతిరావు కమిటీ తేల్చేసింది. పైగా ఫీజుల పెంపునకు ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలుపుతూ యాజమాన్య అనుకూల విధానాన్ని సిఫారసు చేసింది. ఏటా పెంపు.. ఇదేం విధానం? కాలేజీల ఆదాయ, వ్యయాలను బట్టి ఏఎఫ్ఆర్సీ మూడేళ్లకోసారి ఫీజులను ఖరారు చేస్తోంది. మరి అలాంటపుడు పాఠశాలల్లో ఏటా ఫీజుల పెంపునకు సిఫార్సు చేయడంపై తల్లిదండ్రులు మండి పడుతున్నారు. గుజరాత్లో మూడేళ్లకోసారి స్కూల్ ఫీజులను పెంచే విధానం ఉంది. మహారాష్ట్ర రెండేళ్లకోసారి 15 శాతం వరకు ఫీజులను పెంచే విధానం ఉంది. కానీ రాష్ట్రంలో ఏటా 10 శాతం ఫీజు పెంచుకోవచ్చనే ప్రతిపాదన సరికాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని, లేదంటే ఆందోళనలు తప్పవని తల్లిదండ్రుల కమిటీల నేతలు నారాయణ, ఆశిశ్ హెచ్చరించారు. 9 నెలల అధ్యయనం.. ఫీజు పెంచుకునేందుకు సిఫారసులు ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం 2017 మార్చిలో మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీ వేసి, సిఫారసులు చేయాలని సూచించింది. దాదాపు 9 నెలలపాటు అధ్యయనం చేసిన కమిటీ.. తన నివేదికను ఇటీవల ప్రభుత్వానికి అప్పగించింది. ఫీజుల తగ్గింపు సంగతి దేవుడెరుగు.. ఎలాంటి అనుమతి అవసరం లేకుండానే ఏటా 10 శాతం వరకు ఫీజుల పెంపునకు కమిటీ సిఫారసు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. జోనల్ ఫీజుల నియంత్రణ కమిటీల ఆమోదం తీసుకొని ఇష్టమొచ్చిన తీరులో ఫీజులను పెంచుకోవచ్చని సిఫారసు చేయడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
‘ప్రైవేటు పాఠశాల’ దందా..!
జీవో 1కి తూట్లు.. అడ్డగోలుగా ఫీజుల వసూలు అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం అధిక ఫీజులపై హైకోర్టు సీరియస్ ఆదిలాబాద్ టౌన్ : తమలాగే తమ పిల్లలు కష్టపడొద్దు. చదువులకు ఎంత ఖరై్చనా ఫర్వాలేదు. వారిని మంచి చదువులు చదివించి.. ఉన్నత స్థానాల్లో నిలపాలనుకుంటున్న తల్లిదండ్రుల ఆశలను కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్థాయి బడులు సొమ్ము చేసుకుంటున్నాయి. వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నారు. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి నిబంధనలు పాటించడం లేదు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగించే విషయం. 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలంతా బడిలో చేరి ఉచితంగా చదువుకోవాలనే ఉద్దేశంతో 2009 ఆగస్టు 27న కేంద్ర ప్రభుత్వం ‘ఉచిత నిర్బంధ విద్యా బాలల హక్కు చట్టం’ రూపొందించింది. ఎంతో ఉన్నతమైన ఈ చట్టం అపహాస్యం అవుతోంది. ఈ విషయాన్ని అధికారులు మరిచిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. జిల్లాలో 869 ప్రైవేటు పాఠశాలలు.. జిల్లాలో 869 ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో లక్షా 84 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు 200 వరకు ప్రైవేటు పాఠశాలలకు అనుబంధంగా వసతి గృహాలను నడుపుతున్నారు. వీటిలో సగం కంటే పైగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. కాసుల కక్కుర్తి ధ్యేయంగా నడుపుతూ పిల్లలకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. రాజకీయ నాయకుల అండదండలతో నిర్వహిస్తున్న కొన్ని యాజమన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అటకెక్కిన జీవో నంబర్ 1 ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్ల క్రితం జారీ చేసిన జీవో నంబర్ 1 అటకెక్కింది. జీవో అమలుకు ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పేరెంట్స్ కమిటీలు యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నాయి. కమిటీలో అనుకూలమైన పేరెంట్స్‌ను నియమించుకుని ఫీ‘జులం’ చేస్తున్న పాఠశాలలే అత్యధికం. పదేళ్ల క్రితం జిల్లాకు ఒకటి రెండు మాత్రమే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉండగా ప్రస్తుతం వీధికొకటి వెలిశాయి. పాఠశాల విద్యను శాసించే స్థాయికి వీటి కార్యకలాపాలు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కేంద్రంలోని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఎల్కేజీ, యూకేజీలకు ఏడాదికి రూ.20 వేల ఫీజు వసూలు చేస్తుండటం గమనార్హం. పుస్తకాలు, యూనిఫాం, పాఠశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అదనంగా మరో రూ.10 వేలు ఖర్చవుతోంది. ఒకటి నుంచి 7వ తరగతి వరకు హాస్టల్ అయితే రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ముట్టజెప్పాల్సిందే. వీటితో పాటు పుస్తకాలు, ఇతర ఖర్చులకు రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. స్థానికంగా పేరుగాంచిన పాఠశాలల్లో ఫీజులు వింటే తల్లిదండ్రులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. అడ్మిషన్లు పేరిట యథేచ్ఛగా డొనేషన్లు వసూలు చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. తరగతిని బట్టి అడ్మిషన్ ఫీజు రూ.5 వేల నుంచి 10 వేల వరకు ఉంటోంది. వాస్తవానికి ఈ ఫీజును పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీలో చర్చించి అనుమతి తీసుకోవాల్సి ఉంది. దానిని డీఈవో దృష్టికి తీసుకెళ్లి వసూలు చేసుకోవాలనే నిబంధన ఉంది. ఎక్కడా ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో 90 శాతం పాఠశాలలకు మైదానాలు, పార్కింగ్ స్థలాలు లేవనేది అధికారులకు తెలియనిది కాదు. విద్యార్థులకు తగినన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంలోనూ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నాయి. అర్హులైన బీఈడీ, డీఈడీ ఉపాధ్యాయులు, ఎంఈడీ చేసిన ప్రధానోపాధ్యాయులను నియామించాల్సి ఉన్నా.. ఎక్కడా వీరి ఊసేలేదు. ఇటీవల లక్ష్మణచాంద మండలం కనకపూర్‌లోని అక్షర పాఠశాల వసతి గృహంలో ఉంటూ చదువుతున్న 4వ తరగతి విద్యార్థి అక్షిత్‌రెడ్డి విష జ్వరంతో మృతి చెందాడు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే మృతి చెందాడని విద్యార్థి బంధువులు ఆందోళన చేపట్టారు. 15 రోజుల క్రితం ఆదిలాబాద్ మండలం మావలలోని కృష్ణవేణి రెసిడెన్షియల్ పాఠశాల 8వ తరగతి విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందింది. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని విద్యార్థి బంధువులు ఆందోళన చేశారు. ఈ రెండు సంఘటనలు మరువక ముందే సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని సీబీఆర్ వసతి గృహ విద్యార్థులు 40 మంది కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టింపు లేని తనంగా వ్యహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యాహక్కు చట్టం ఏం చెబుతోందంటే... ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు తమ బడిలో చేర్చుకున్న పిల్లలో కనీసం 25 శాతం తగ్గకుండా ఒకటో తరగతిలో పేద పిల్లలను చేర్చుకుని ఎలిమెంటరీ వరకు ఉచిత విద్యనందించాలి. ఇందుకు అవసరమయ్యే ఖర్చును పాఠశాలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. బడిలో ప్రవేశానికి ఎంపిక విధానం (అడ్మిషన్ టెస్ట్) నిర్వహించరాదు. ఇలా ఇస్తే మొదటి తప్పుకు రూ.25 వేలు, ఆ తర్వాత ప్రతిసారీ తప్పుకు రూ.20 వేల చొప్పన జరిమానా విధించవచ్చు. అలాగే పాఠశాలల్లో క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయకూడదు. ఒక వేళ వసూలు చేస్తే దానికి పది రెట్ల జరిమానా విధించవచ్చు. బడిలో ప్రవేశం పొందిన పిల్లలను అదే తరగతిలో మళ్లీ కొనసాగించడం, బడి నుంచి తీసేయడం నిషేధం. పాఠశాల గుర్తింపు ధ్రువీకరణ పత్రం లేకుండా పాఠశాలను నిర్వహించరాదు. ∙గుర్తింపు రద్దయిన తర్వాత కూడా ఆ వ్యక్తి బడిని నిర్వహిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. బాల, బాలికలకు ప్రత్యేకంగా తగినన్ని మరుగుదొడ్లు నిర్మించాలి. అడ్మిషన్ ఫీజులు వసూలు చేయొద్దు.. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల అడ్మిషన్ ఫీజు తీసుకోవద్దు. నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రవేశం కోసం టెస్ట్‌లు నిర్వహించొద్దు. అనుమతి లేని పాఠశాలలు నడపొద్దు. అనుమతి లేకుండా నడిపితే యాజమాన్యాలపై కేసు నమోదు చేస్తాం. – సత్యనారాయణరెడ్డి, డీఈవో ఆదిలాబాద్