మరింత దోచుకోమని సిఫారసులా? | Panel for 10% hike in private schools' fee | Sakshi
Sakshi News home page

మరింత దోచుకోమని సిఫారసులా?

Published Thu, Jan 4 2018 3:12 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

Panel for 10% hike in private schools' fee - Sakshi

హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న నవీన్‌ ఓ ప్రైవేటు కంపెనీలో సాధారణ ఉద్యోగి. ఆయన కొడుకు యూకేజీ ఫీజు ఏడాదికి రూ.42 వేలు. ఆటో ఫీజు కోసం మరో రూ.15 వేలు చెల్లిస్తున్నారు. మరో ప్రైవేటు ఉద్యోగి శ్రీనివాస్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని ఓ ప్లే స్కూల్లో తన కూతురుకు రూ.30 వేలు చెల్లిస్తున్నారు.

వరంగల్‌లో ప్రైవేటు ఉద్యోగి గోపాల్‌ ఓ సాధారణ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్న తన మూడో తరగతి కూతురికి ఏటా రూ.20 వేలు చెల్లిస్తున్నారు. అదే తన మూడేళ్ల చిన్న కూతురు ప్లే స్కూల్‌కు మాత్రం రూ.25 వేలు చెల్లించాల్సి వస్తోంది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఖమ్మంలోని ఓ సాధారణ స్కూల్లో ఐదో తరగతి చదివే తన కూతురుకు ఏటా రూ.30 వేలు ఫీజు కడుతున్నారు. చిన్నవాడైన తన కొడుకుకు నర్సరీకి రూ.20 వేలు చెల్లిస్తున్నారు.


సాక్షి, హైదరాబాద్‌ ..ఇలా 31 లక్షల మంది సాధారణ, మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేటు యాజమాన్యాలు ఏటా భారీ మొత్తంలో ఫీజులను పెంచుతుండటంతో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని రాష్ట్రంలో తల్లిదండ్రుల కమిటీలు ఆందోళన చేశాయి. అయితే ఏడేళ్లుగా ఫీజుల తగ్గింపు కోసం తల్లిదండ్రుల కమిటీలు ఆందోళనలు చేయడం.. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, వాటిని కోర్టుల్లో యాజమాన్యాలు సవాలు చేయడం.. చివరకు జీవోలు కొట్టివేయండం.. సర్వసాధారణంగా జరుగుతుండటంతో ఫీజుల నియంత్రణ అటకెక్కింది. 

యాజమాన్యాల అనుకూలతపైనే దృష్టి
యాజమాన్యాల అనుకూల విధానాలపైనే ప్రధాన కమిటీ దృష్టి సారించిందని, అందుకే ఈ సిఫారసులు చేసిందంటూ తల్లిదండ్రుల కమిటీలు ఆరోపిస్తున్నాయి. ఒక్క సిఫారసు కూడా తల్లిదండ్రులకు అనుకూలంగా చేయలేదని తీవ్రంగా దుయ్యబట్టాయి. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్యను కలసి విన్నవించాయి. ఆ నివేదికను
ఆమోదించవద్దని కోరాయి.

ఫీజులు మరింత పెంచేలా..
పట్టణ ప్రాంతాల్లో కనీసంగా రూ.12 వేల నుంచి టాప్‌ స్కూళ్లలో 2.5 లక్షల వరకు ఫీజులను యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులను చదివిస్తున్న 31 లక్షల మంది తల్లిదండ్రుల్లో సాధారణ, మధ్య తరగతి వారే 80 శాతం వరకు ఉన్నారు. వారు చదివిస్తున్న పాఠశాలల్లో కనీస ఫీజు రూ.20 వేల నుంచి రూ.45 వేల వరకు ఉంది. ఈ మేరకు ఉన్న ఫీజులను తగ్గించేలా కమిటీ శాస్త్రీయ విధానాన్ని రూపొందిస్తుందని భావించినా.. అందుకు భిన్నంగా సిఫారసు చేయడంతో ఉసూరుమంటున్నారు.

ఏఎఫ్‌ఆర్‌సీ తరహాలో చేయలేరట
రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ తదితర వృత్తి విద్యా కోర్సుల ఫీజులను కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలోని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) ఖరారు చేస్తోంది. ఉన్నంతలో శాస్త్రీయ విధానమూ ఇదే. కాని అది సాధ్యం కాదని తిరుపతిరావు కమిటీ తేల్చేసింది. పైగా ఫీజుల పెంపునకు ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలుపుతూ యాజమాన్య  అనుకూల విధానాన్ని సిఫారసు చేసింది.

ఏటా పెంపు.. ఇదేం విధానం?
కాలేజీల ఆదాయ, వ్యయాలను బట్టి ఏఎఫ్‌ఆర్‌సీ మూడేళ్లకోసారి ఫీజులను ఖరారు చేస్తోంది. మరి అలాంటపుడు పాఠశాలల్లో ఏటా ఫీజుల పెంపునకు సిఫార్సు చేయడంపై తల్లిదండ్రులు మండి పడుతున్నారు. గుజరాత్‌లో మూడేళ్లకోసారి స్కూల్‌ ఫీజులను పెంచే విధానం ఉంది. మహారాష్ట్ర రెండేళ్లకోసారి 15 శాతం వరకు ఫీజులను పెంచే విధానం ఉంది. కానీ రాష్ట్రంలో ఏటా 10 శాతం ఫీజు పెంచుకోవచ్చనే ప్రతిపాదన సరికాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని, లేదంటే ఆందోళనలు తప్పవని తల్లిదండ్రుల కమిటీల నేతలు నారాయణ, ఆశిశ్‌ హెచ్చరించారు. 

9 నెలల అధ్యయనం.. ఫీజు పెంచుకునేందుకు సిఫారసులు
ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం 2017 మార్చిలో మాజీ వీసీ ప్రొఫెసర్‌ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీ వేసి, సిఫారసులు చేయాలని సూచించింది. దాదాపు 9 నెలలపాటు అధ్యయనం చేసిన కమిటీ.. తన నివేదికను ఇటీవల ప్రభుత్వానికి అప్పగించింది. ఫీజుల తగ్గింపు సంగతి దేవుడెరుగు.. ఎలాంటి అనుమతి అవసరం లేకుండానే ఏటా 10 శాతం వరకు ఫీజుల పెంపునకు కమిటీ సిఫారసు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. జోనల్‌ ఫీజుల నియంత్రణ కమిటీల ఆమోదం తీసుకొని ఇష్టమొచ్చిన తీరులో ఫీజులను పెంచుకోవచ్చని సిఫారసు చేయడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement