‘ప్రైవేటు పాఠశాల’ దందా..! | heavy feeses in private schools | Sakshi
Sakshi News home page

‘ప్రైవేటు పాఠశాల’ దందా..!

Published Sat, Jul 23 2016 5:23 PM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

మైదానం లేని ఓ పాఠశాల - Sakshi

మైదానం లేని ఓ పాఠశాల

  • జీవో 1కి తూట్లు..
  • అడ్డగోలుగా ఫీజుల వసూలు
  • అమలుకు నోచుకోని 
  • విద్యాహక్కు చట్టం
  • అధిక ఫీజులపై హైకోర్టు సీరియస్‌
  • ఆదిలాబాద్‌ టౌన్‌ : తమలాగే తమ పిల్లలు కష్టపడొద్దు. చదువులకు ఎంత ఖరై్చనా ఫర్వాలేదు. వారిని మంచి చదువులు చదివించి.. ఉన్నత స్థానాల్లో నిలపాలనుకుంటున్న తల్లిదండ్రుల ఆశలను కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ స్థాయి బడులు సొమ్ము చేసుకుంటున్నాయి. వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నారు. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి నిబంధనలు పాటించడం లేదు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగించే విషయం. 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలంతా బడిలో చేరి ఉచితంగా చదువుకోవాలనే ఉద్దేశంతో 2009 ఆగస్టు 27న కేంద్ర ప్రభుత్వం ‘ఉచిత నిర్బంధ విద్యా బాలల హక్కు చట్టం’ రూపొందించింది. ఎంతో ఉన్నతమైన ఈ చట్టం అపహాస్యం అవుతోంది. ఈ విషయాన్ని అధికారులు మరిచిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. 
     
    జిల్లాలో 869 ప్రైవేటు పాఠశాలలు..
    జిల్లాలో 869 ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో లక్షా 84 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు 200 వరకు ప్రైవేటు పాఠశాలలకు అనుబంధంగా వసతి గృహాలను నడుపుతున్నారు. వీటిలో సగం కంటే పైగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. కాసుల కక్కుర్తి ధ్యేయంగా నడుపుతూ పిల్లలకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. రాజకీయ నాయకుల అండదండలతో నిర్వహిస్తున్న కొన్ని యాజమన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. 
     
    అటకెక్కిన జీవో నంబర్‌ 1
    ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్ల క్రితం జారీ చేసిన జీవో నంబర్‌ 1 అటకెక్కింది. జీవో అమలుకు ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పేరెంట్స్‌ కమిటీలు యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నాయి. కమిటీలో అనుకూలమైన పేరెంట్స్‌ను నియమించుకుని ఫీ‘జులం’ చేస్తున్న పాఠశాలలే అత్యధికం. పదేళ్ల క్రితం జిల్లాకు ఒకటి రెండు మాత్రమే కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఉండగా ప్రస్తుతం వీధికొకటి వెలిశాయి. పాఠశాల విద్యను శాసించే స్థాయికి వీటి కార్యకలాపాలు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది.
     
    జిల్లా కేంద్రంలోని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఎల్‌కేజీ, యూకేజీలకు ఏడాదికి రూ.20 వేల ఫీజు వసూలు చేస్తుండటం గమనార్హం. పుస్తకాలు, యూనిఫాం, పాఠశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అదనంగా మరో రూ.10 వేలు ఖర్చవుతోంది. ఒకటి నుంచి 7వ తరగతి వరకు హాస్టల్‌ అయితే రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ముట్టజెప్పాల్సిందే. వీటితో పాటు పుస్తకాలు, ఇతర ఖర్చులకు రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. స్థానికంగా పేరుగాంచిన పాఠశాలల్లో ఫీజులు వింటే తల్లిదండ్రులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. అడ్మిషన్లు పేరిట యథేచ్ఛగా డొనేషన్లు వసూలు చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు.
     
    తరగతిని బట్టి అడ్మిషన్‌ ఫీజు రూ.5 వేల నుంచి 10 వేల వరకు ఉంటోంది. వాస్తవానికి ఈ ఫీజును పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీలో చర్చించి అనుమతి తీసుకోవాల్సి ఉంది. దానిని డీఈవో దృష్టికి తీసుకెళ్లి వసూలు చేసుకోవాలనే నిబంధన ఉంది. ఎక్కడా ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. ఆదిలాబాద్‌ జిల్లాలో 90 శాతం పాఠశాలలకు మైదానాలు, పార్కింగ్‌ స్థలాలు లేవనేది అధికారులకు తెలియనిది కాదు. విద్యార్థులకు తగినన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంలోనూ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నాయి. అర్హులైన బీఈడీ, డీఈడీ ఉపాధ్యాయులు, ఎంఈడీ చేసిన ప్రధానోపాధ్యాయులను నియామించాల్సి ఉన్నా.. ఎక్కడా వీరి ఊసేలేదు.
    • ఇటీవల లక్ష్మణచాంద మండలం కనకపూర్‌లోని అక్షర పాఠశాల వసతి గృహంలో ఉంటూ చదువుతున్న 4వ తరగతి విద్యార్థి అక్షిత్‌రెడ్డి విష జ్వరంతో మృతి చెందాడు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే మృతి చెందాడని విద్యార్థి బంధువులు ఆందోళన చేపట్టారు. 
    • 15 రోజుల క్రితం ఆదిలాబాద్‌ మండలం మావలలోని కృష్ణవేణి రెసిడెన్షియల్‌ పాఠశాల 8వ తరగతి విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందింది. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని విద్యార్థి బంధువులు ఆందోళన చేశారు.
    • ఈ రెండు సంఘటనలు మరువక ముందే సోమవారం ఆదిలాబాద్‌ పట్టణంలోని సీబీఆర్‌ వసతి గృహ విద్యార్థులు 40 మంది కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురయ్యారు.
    • ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టింపు లేని తనంగా వ్యహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
     
    విద్యాహక్కు చట్టం ఏం చెబుతోందంటే...
    ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలు తమ బడిలో చేర్చుకున్న పిల్లలో కనీసం 25 శాతం తగ్గకుండా ఒకటో తరగతిలో పేద పిల్లలను చేర్చుకుని ఎలిమెంటరీ వరకు ఉచిత విద్యనందించాలి. ఇందుకు అవసరమయ్యే ఖర్చును పాఠశాలకు ప్రభుత్వం చెల్లిస్తుంది.
    బడిలో ప్రవేశానికి ఎంపిక విధానం (అడ్మిషన్‌ టెస్ట్‌) నిర్వహించరాదు. ఇలా ఇస్తే మొదటి తప్పుకు రూ.25 వేలు, ఆ తర్వాత ప్రతిసారీ తప్పుకు రూ.20 వేల చొప్పన జరిమానా విధించవచ్చు. అలాగే పాఠశాలల్లో క్యాపిటేషన్‌ ఫీజు వసూలు చేయకూడదు. ఒక వేళ వసూలు చేస్తే దానికి పది రెట్ల జరిమానా విధించవచ్చు.
    • బడిలో ప్రవేశం పొందిన పిల్లలను అదే తరగతిలో మళ్లీ కొనసాగించడం, బడి నుంచి తీసేయడం నిషేధం.
    • పాఠశాల గుర్తింపు ధ్రువీకరణ పత్రం లేకుండా పాఠశాలను నిర్వహించరాదు.
    • ∙గుర్తింపు రద్దయిన తర్వాత కూడా ఆ వ్యక్తి బడిని నిర్వహిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. 
    •  బాల, బాలికలకు ప్రత్యేకంగా తగినన్ని మరుగుదొడ్లు నిర్మించాలి.
    అడ్మిషన్‌ ఫీజులు వసూలు చేయొద్దు..
    ప్రైవేట్‌ పాఠశాలలు విద్యార్థుల అడ్మిషన్‌ ఫీజు తీసుకోవద్దు. నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రవేశం కోసం టెస్ట్‌లు నిర్వహించొద్దు. అనుమతి లేని పాఠశాలలు నడపొద్దు. అనుమతి లేకుండా నడిపితే యాజమాన్యాలపై కేసు నమోదు చేస్తాం.  
    – సత్యనారాయణరెడ్డి, డీఈవో ఆదిలాబాద్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement