శ్రీకాకుళం పాతబస్టాండ్: జన్మభూమి కార్యక్రమంలో స్వీకరించిన అభ్యర్థనల డేటా ఎంట్రీలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్‌ఉప్పల్ అధికారులను ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమ డేటా ఎంట్రీ, తుపాను అప్రమత్తతపై అధికారులతో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా అత్యవసర సేవలు అందాల్సిన (హైరిస్క్) మహిళలు, పిల్లల వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరక్టర్ సంయుక్తంగా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి పేరు జాబితాలో తప్పిపోరాదని సూచించారు.
తుపానుపై అప్రమత్తం
తుపానుపై జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అధికారులు స్థానికంగా ఉండి అన్ని ఏర్పాట్లు చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఎస్.తనూజారాణి, డ్వామా పీడీ ఎ. కల్యాణ చక్రవర్తి, జెడ్పీ సీఈవో ఎం.శివరామనాయకర్, డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్ గీతాంజలి, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి ఆర్. గణపతిరావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ ఆర్.రవీంద్రనాథ్, పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు పి.నాగన్న పాల్గొన్నారు.
త్వరితగతిన ‘జన్మభూమి’ డేటా ఎంట్రీ
Published Sat, Nov 8 2014 12:50 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement