Janma bhumi programme
-
దోచుకోవడానికో ‘పథకం’
♦ నిన్న నీరు-చెట్టు అంటూ చెరువులు ♦ నేడు సాగు, మురుగునీటి కాల్వలు ♦ ఈ పనులూ జన్మభూమి కమిటీలకే.. ♦ ఉపాధి కోల్పోయిన గుత్తేదారులు ప్రభుత్వం కాల్వల మరమ్మతులపై దృష్టి సారించింది.. ఈ పనులను జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక తెదేపా నాయకులు, కార్యకర్తలకు పండగే పండగ.. నిన్నటి వరకు నీరు- చెట్టు పథకంలో చెరువుల తవ్వకాలను చేపట్టి లక్షలాది రూపాయలు గడించిన తెలుగు తమ్ముళ్లు.. ప్రస్తుతం సాగు, మురుగునీటి కాల్వల మరమ్మతు పనుల్లో నిమగ్నమౌతున్నారు.. దీంతో ఈ శాఖల్లోని గుత్తేదారులకు పనులు లేకుండా పోయాయి.. జన్మభూమి కమిటీల నుంచి సబ్ కాంట్రాక్ట్‌కు పనులు తీసుకుంటూ, అంచనాలపై 10 శాతం కమీషన్ చెల్లిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాష్ట్రంలోని నోటిఫైడ్, నాన్‌నోటిఫైడ్ కాల్వల మరమ్మతులను నీరు-చెట్టు పథకంలో చేపట్టాలని రాష్ర్ట ప్రభుత్వం మే 12వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులనూ గ్రామాల్లోని జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నది. దీంతో జలవనరులు, మురుగునీటి శాఖల ఇంజినీర్లు అంచనాలు తయారు చేశారు. ఉత్తర్వులు రావడమే తరువాయి అనే రీతిలో ఈ పనులను జన్మభూమి కమిటీలకు అప్పగించడం ప్రారంభించారు. సాధారణంగా ఏటా కాల్వల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించి వాటిని గుత్తేదారులు, సాగునీటి సంఘాలు, ఆయకట్టు పరిధిలోని రైతులకు అప్పగిస్తుంది. ఈ ఏడాది అందుకు భిన్నంగా జన్మభూమి కమిటీలకు పూర్తిగా పనులు అప్పగించారు. నీరు-చెట్టు పథకంలోని చెరువుల తవ్వకాలకు క్యూబిక్ మీటరుకు రూ. 29 చెల్లిస్తుంటే, కాల్వల మరమ్మతులకు సైట్‌లోని పరిస్థితులను బట్టి క్యూబిక్ మీటరుకు రూ. 29 కంటే అధికంగా కూడా చెల్లించవచ్చని పేర్కొన్నది. కృష్ణా జిల్లాలోని గుడివాడ డ్రైనేజి డివిజన్, గుంటూరు జిల్లాలోని తెనాలి డివిజన్లు నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ కాల్వల మరమ్మతులకు సుమా రు రూ.13కోట్లు వరకు కేటాయించారు. ఈ మేరకు జన్మభూమి కమిటీలకు ప నులు అప్పగిస్తున్నారు. చెరువుల తవ్వకాల పనుల్లో పొక్లెయిన్లు పూర్తిగా వినియోగంలో ఉండటంతో ఈ జన్మభూమి కమిటీలు పొక్లెయిన్లును ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. దీంతో వీరికి అప్పగించిన పనులు వర్షాలు కురిసేలోపు పూర్తయ్యే అవకాశాలు కన్పించటంలేదు. కృష్ణా జిల్లాలో 400కాల్వల మరమ్మతులకు రూ.8 కోట్లు కేటాయిస్తే, ఇప్పటివరకు రూ.2కోట్లు విలువైన పనులే పూర్తయ్యాయి. గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ పెద్ద ఎత్తున చెరువుల తవ్వకాలు జరుగుతుండటంతో జన్మభూమి కమిటీలు కాల్వల మరమ్మతుల పట్ల ఆసక్తిచూపడం లేదు. దీనితో రూ.1.50కోట్ల విలువైన పనులే జరిగాయి. మిగిలిన పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇంజినీర్లు చెబుతున్నారు. గతంలో కొన్నైనా దక్కేవీ.. ప్రతి ఏడాది కాల్వల మరమ్మతులకు టెండర్లు ఆహ్వానించడం ఆనవాయితీ. రూ.5 లక్షల్లోపు పనులను సాగునీటి సంఘాలు, ఆయకట్టు పరిధిలోని రైతులకు అప్పగించడం జరుగుతోంది.గుత్తేదారులు టెండర్లలో కొన్నింటిన్నైనా దక్కించుకొని పనులు చేసుకునేవారు. అయితే బాబు అధికారంలోకి వచ్చిన తరువాత జాబు వస్తుందనే ప్రచారానికి భిన్నంగా ఇక్కడి గుత్తేదారులకు పనులు లేకుండా పోయాయి. చెరువుల మరమ్మతులు, తవ్వకాల పనుల పర్యవేక్షణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక డివిజన్ ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్డ్ గుత్తేదారులు చెరువుల తవ్వకాలు, నిర్మాణ పనులు చేస్తుంటారు. ప్రస్తుతం జన్మభూమి కమిటీలకు అప్పగించడంతో స్పెషల్ డివిజన్ల్లోని గుత్తేదారులకు పనులు లేకుండా పోయియి. -
చంద్రగిరి జన్మభూమి సభలో కలకలం
చంద్రగిరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో జన్మభూమి సభలో కలకలం రేగింది. జిల్లా పరిధిలోని చంద్రగిరిలో శనివారం జరిగిన జన్మభూమి సభలో దళిత కులానికి చెందిన బాల సుబ్రమణ్యం అనే వ్యక్తి తనకు న్యాయం జరగాలంటూ ముగ్గురు చిన్నారులతో సహా ఒంటి పై కిరోసిన పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భూమిని అగ్ర కులాల వారు కబ్జా చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ బాలసుబ్రమణ్యం ఆరోపించాడు. విచారణ చేయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. -
జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్న మహిళలు
వైఎస్సార్ జిల్లా: కడప పట్టణంలోని మరియాపురంలో గురువారం జరుగుతున్న జన్మభూమి కార్యక్రమాన్ని మహిళలు అడ్డుకున్నారు. రేషన్ సరిగా ఇవ్వడం లేదని, అదే విధంగా పింఛన్లు కూడా రావటం లేదని వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులు రెడ్డి ముందు మహిళలు తమ గోడు వినిపించారు. స్థానిక టీడీపీ నాయకులు కల్పించుకుని వారం రోజుల్లో పింఛన్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే సగానికి పైగా పింఛన్లు తీసేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పింఛన్లు తొలగించిన మహిళలకు తిరిగి ఇప్పించాలని కోరుతుండటంతో.. రాష్ట్ర వ్యాప్తంగా 'జన్మభూమి' కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులకు, టీడీపీ నాయకులకు ఏం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు. -
పింఛన్ల పంపిణీలో ఎడతెగని జాప్యం...
మచిలీపట్నం : జిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ప్రహసనంగా ముగిసింది. అక్టోబరు రెండో తేదీ నుంచి జన్మభూమి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో పింఛన్లు ఐదు రెట్లు పెంపుదల చేసి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఈ కార్యక్రమం పుణ్యమా అంటూ గత ఐదారు సంవత్సరాలుగా ఏ నెలలోనూ బ్రేక్ పడని పింఛన్ల పంపిణీ ఒక నెల పాటు నిలిచిపోయింది. గత నెల రెండో తేదీన ప్రారంభమైన జన్మభూమి 11వ తేదీ వరకు జరిగి వాయిదా పడింది. హుదూద్ తుపాను తదితర కారణాలు చూపి అక్టోబరు 31 వరకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. పింఛన్ల సొమ్ము అందుబాటులో లేకపోవడం వల్లే జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేశారనే వాదన అప్పట్లో వినబడింది. అధికారులు పాలకుల అవతారమెత్తి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తటం ఈ జన్మభూమి విశేషం. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినా మౌలిక అంశంపై దృష్టిపెట్టకుండా, అభివృద్ధి పనుల నిధుల విడుదలపై ఎలాంటి హామీ ఇవ్వకుండా అధికారులు, పాలకులు దాటవేత ధోరణితో ఈ కార్యక్రమాన్ని నడపటంలో తమదైన శైలిలో వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ఏదైనా సమస్యను పరిష్కరించాలని కోరితే మన గ్రామాన్ని, మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని, అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛందంగా సహకారం అందించాలని పాలకులు కొత్త రాగం ఆలపించటం గమనార్హం. పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, పింఛన్ల పంపిణీ, పశు వైద్య శిబిరాలు, సీమంతాలు, అన్నప్రాశనలు ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు కానివారు సైతం వేదికలెక్కి ప్రభుత్వ పనితీరుపై ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చి ప్రజల సహనానికి పరీక్ష పెట్టారు. కొంతమంది అధికారులు ఓ అడుగు ముందుకేసి జన్మభూమిలో ఇచ్చిన దరఖాస్తులను నేరుగా ముఖ్యమంత్రి పరిశీలిస్తారని, వాటికి పరిష్కారం దొరుకుతుందని చెప్పటం గమనించదగ్గ అంశం. పింఛన్ల పంపిణీలో ఎడతెగని జాప్యం... జన్మభూమి కార్యక్రమంలో పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులను అధికారులు ఏడిపించినంత పనిచేశారు. జిల్లాలో 2.77 లక్షల మంది పింఛను పొందేందుకు అర్హులని జన్మభూమి కార్యక్రమంలో నిర్ధారించిన అధికారులు ఈ నెల 10వ తేదీ వరకు 2.25 లక్షల మందికి మాత్రమే సొమ్ము అందజేశారు. పింఛన్ల పంపిణీ కూడా ప్రహసనంగానే సాగిందని, ఎన్నాళ్లుగానో పింఛన్లు ఇస్తున్నా.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇస్తున్నట్లుగా ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదనే విమర్శలు వినిపించాయి. పింఛను మంజూరు పత్రాలు అందజేసే సమయంలో ముఖ్యమంత్రి, స్థానిక మంత్రి, ఎమ్మెల్యే తదితరుల ఫొటోలను ముద్రించిన ప్రత్యేక కవర్లను ఇవ్వటం గమనార్హం. పింఛన్ల సర్వేలో టీడీపీ నాయకులు, కార్యకర్తలే ప్రముఖ పాత్ర పోషించగా.. అనేకమంది అర్హులకు కూడా జాబితాల్లో చోటు దక్కకపోవడం గమనార్హం. సెంటు భూమి కూడా లేకపోయినా.. ఐదెకరాల పొలం ఉందంటూ కొంతమందికి, వయసు తేడా ఉందంటూ మరికొందరికి వివిధ రకాల కారణాలతో పింఛన్లు నిలిపివేశారు. గ్రామానికి పది మంది చొప్పున, పట్టణాల్లో వార్డుకు మరో 10, 12 మంది చొప్పున అర్హులైన వారి పింఛన్లు నిలిపివేయడం గమనార్హం. పింఛన్లు నిలిచిపోయిన వారంతా అధికారులు, కౌన్సిలర్లు, పంచాయతీ సర్పంచుల చుట్టూ నేటికీ తిరుగుతూనే ఉన్నారు. తమ గోడు వెళ్లబోసుకుంటూనే ఉన్నారు. 4,71,871 దరఖాస్తులు ఈ నెల 10 వరకు జన్మభూమిలో వివిధ సమస్యలపై 4,71,871 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో పింఛను కోసం వచ్చినవి 47,220. దరఖాస్తులు తీసుకునే సమయంలోనూ అధికారులు తమదైన శైలిలో వ్యవహరించారు. కార్యక్రమానికి మంత్రి లేదా ఎమ్మెల్యే ఇతర అధికారులు ఎవరైనా వస్తే వారి ప్రసంగాలు పూర్తయ్యేవరకు అర్జీలు స్వీకరించకుండా నిలిపివేశారు. ఉదయం తొమ్మిది గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించిన అధికారులు మంత్రులు వచ్చేవరకు కార్యక్రమాన్ని ప్రారంభించకుండా సభకు వచ్చిన ప్రజలను అలానే కూర్చోబెట్టడం అనేక ప్రాంతాల్లో జరిగింది. జన్మభూమి కార్యక్రమంలో గర్భిణులకు సీమంతం పేరుతో వారికి ఇచ్చే పూలు, గాజులు, చీరతో పాటు చంద్రబాబునాయుడు ఫొటో ముద్రించిన పత్రాలు ఇవ్వడం గమనార్హం. సీమంతం కార్యక్రమానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఏదైనా గ్రామంలో లేదా వార్డులో జన్మభూమి కార్యక్రమం జరిగితే అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రముఖుల నుంచి చందాలు వసూలు చేసి ఈ తంతు ముగించారు. పొలం పిలుస్తోంది వల్ల ప్రయోజనం ఉందా... జన్మభూమి కార్యక్రమంలో ఏర్పాటుచేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో వ్యవసాయాధికారులు రైతులతో కలసి పొలం వద్దకు వెళ్లి, పైరును పరిశీలించి అన్నదాతలకు సూచనలు, సలహాలు అందజేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయాధికారులు మొక్కుబడిగా నిర్వహించడమే తప్ప రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్న దాఖలాలే లేవు. బడి పిలుస్తోంది కార్యక్రమం కూడా ఇలాగే కొనసాగింది. 14 సంవత్సరాల్లోపు బాలబాలికలంతా తప్పనిసరిగా బడిలోనే ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా ఫలితం శూన్యంగానే మిగిలింది. ఓ పక్క జన్మభూమి జరుగుతుండగానే చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లలు, బాలకార్మికులు వారిలో పనుల్లో పాల్గొనటం గమనార్హం. సంచార జాతుల వారిని గుర్తించి వారు ఎక్కడ ఉంటే అక్కడికి సమీపంలోని పాఠశాలలోనే వారి పిల్లలను చేర్పించాల్సి ఉన్నా అటువంటి ప్రయత్నమే జరగకపోవటం గమనార్హం. జన్మభూమి సభల వద్ద వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ఏఎన్ఎంలు, వైద్యుల సమయాన్ని వృథా చేయడమే తప్ప ప్రజలకు పనికొచ్చే మందుబిళ్లలు మాత్రం ఇవ్వలేదనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. -
త్వరితగతిన ‘జన్మభూమి’ డేటా ఎంట్రీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జన్మభూమి కార్యక్రమంలో స్వీకరించిన అభ్యర్థనల డేటా ఎంట్రీలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్‌ఉప్పల్ అధికారులను ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమ డేటా ఎంట్రీ, తుపాను అప్రమత్తతపై అధికారులతో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా అత్యవసర సేవలు అందాల్సిన (హైరిస్క్) మహిళలు, పిల్లల వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరక్టర్ సంయుక్తంగా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి పేరు జాబితాలో తప్పిపోరాదని సూచించారు. తుపానుపై అప్రమత్తం తుపానుపై జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అధికారులు స్థానికంగా ఉండి అన్ని ఏర్పాట్లు చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎస్.తనూజారాణి, డ్వామా పీడీ ఎ. కల్యాణ చక్రవర్తి, జెడ్పీ సీఈవో ఎం.శివరామనాయకర్, డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్ గీతాంజలి, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి ఆర్. గణపతిరావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ ఆర్.రవీంద్రనాథ్, పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు పి.నాగన్న పాల్గొన్నారు. -
జన్మభూమి తరువాత భూసేకరణ
మంగళగిరి పరిసరాల్లో పది వేల ఎకరాలకు బౌండరీలు ఆ తరువాత క్రయ, విక్రయాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ సాక్షి, హైదరాబాద్: జన్మభూమి కార్యక్రమం పూర్తయిన వెంటనే విజయవాడ-గుంటూరు మధ్యలో నూతన రాజధానికి అవసరమైన భూమి సమీకరణపై చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జన్మభూమి-మన ఊరు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ముగియగానే మంగళగిరి పరిసర ప్రాంతాల్లో తొలి దశలో పది వేల ఎకరాల వరకు భూమిని సమీకరించనున్నారు. రాజధానికోసం ఎంపిక చేసిన విస్తీర్ణంలో బౌండరీలను నిర్ధారించడంతోపాటు ఆ ప్రాంతంలో భూ క్రయ, విక్రయాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. కర్నూలు రాజధాని సమయంలో 1954లో అద్దెలను పెంచకుండా ఆర్డినెన్స్‌ను అప్పట్లో ప్రభుత్వం తీసుకువచ్చింది. అదే తరహాలో ఇప్పుడు కూడా భూ సమీకరణ ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తులెవరూ భూములను విక్రయించడం, కొనుగోలు చేయడంపై నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకురావచ్చునని అధికార వర్గాలు తెలిపాయి. మంగళగిరి పరిసరాల్లో రిజిస్ట్రేషన్ విలువ ఎకరం రూ.6 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉందని రాజధాని కమిటీ నిర్ధారణకు వచ్చింది. వాస్తవంగా విక్రయాలు మాత్రం ఎకరం రూ.50 లక్షల నుంచి 60 లక్షలకు జరుగుతున్నాయని కమిటీ పేర్కొంది. చట్టం ప్రకారం ప్రభుత్వం భూసేకరణ చేస్తే ఎకరానికి రూ.పాతిక లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుందని, అంతకన్నా ఎక్కువ రైతులకు రాదనే అభిప్రాయానికి కమిటీ అభిప్రాయపడుతోంది. దీంతో సంప్రదింపుల ద్వారానే రాజధాని కోసం భూమిని సేకరించాలనే అభిప్రాయానికి కమిటీ వచ్చింది. ఉదాహరణకు ఒక రైతుకు ఎకరం భూమి ఉంటుంది. ఆ ఎకరాన్ని చదరపు గజాల్లో చూస్తే 4,400 చదరపు గజాలవుతుంది. అందులో 2,200 రహదారులు, డ్రైనేజీఅభివృద్ధికి పోతుంది. ఇక మిగిలిన 2,200 లలో 1100 గజాలను అభివృద్ధి చేసిన తరువాత రైతులకు ఇవ్వాలనేది ప్రతిపాదనగా అధికార వర్గాలు తెలిపాయి. 1100 గజాలు అభివృద్ధి చేసి రైతులకు ఇచ్చేవరకు ఎన్నేళ్లు పడితే అన్నేళ్ల పాటు ఏడాదికి రూ.15 వేల నుంచి పాతిక వేలను ఆ రైతులకు చెల్లించాలనేది కమిటీ అభిప్రాయమని అధికారులు తెలిపారు. దీనివల్ల రైతులకు ఆర్థికంగా ప్రయోజనం ఉండదని, అభివృద్ధి చేయడానికి రైతులు స్వచ్చందంగా ముందుకు వస్తేనే వారికి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయాన్ని రాజధాని కమిటీ వ్యక్తం చేస్తోంది.