జన్మభూమి కార్యక్రమం పూర్తయిన వెంటనే విజయవాడ-గుంటూరు మధ్యలో నూతన రాజధానికి అవసరమైన భూమి సమీకరణపై చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది
మంగళగిరి పరిసరాల్లో పది వేల ఎకరాలకు బౌండరీలు
ఆ తరువాత క్రయ, విక్రయాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్
సాక్షి, హైదరాబాద్: జన్మభూమి కార్యక్రమం పూర్తయిన వెంటనే విజయవాడ-గుంటూరు మధ్యలో నూతన రాజధానికి అవసరమైన భూమి సమీకరణపై చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జన్మభూమి-మన ఊరు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ముగియగానే మంగళగిరి పరిసర ప్రాంతాల్లో తొలి దశలో పది వేల ఎకరాల వరకు భూమిని సమీకరించనున్నారు. రాజధానికోసం ఎంపిక చేసిన విస్తీర్ణంలో బౌండరీలను నిర్ధారించడంతోపాటు ఆ ప్రాంతంలో భూ క్రయ, విక్రయాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. కర్నూలు రాజధాని సమయంలో 1954లో అద్దెలను పెంచకుండా ఆర్డినెన్స్‌ను అప్పట్లో ప్రభుత్వం తీసుకువచ్చింది.
అదే తరహాలో ఇప్పుడు కూడా భూ సమీకరణ ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తులెవరూ భూములను విక్రయించడం, కొనుగోలు చేయడంపై నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకురావచ్చునని అధికార వర్గాలు తెలిపాయి. మంగళగిరి పరిసరాల్లో రిజిస్ట్రేషన్ విలువ ఎకరం రూ.6 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉందని రాజధాని కమిటీ నిర్ధారణకు వచ్చింది. వాస్తవంగా విక్రయాలు మాత్రం ఎకరం రూ.50 లక్షల నుంచి 60 లక్షలకు జరుగుతున్నాయని కమిటీ పేర్కొంది. చట్టం ప్రకారం ప్రభుత్వం భూసేకరణ చేస్తే ఎకరానికి రూ.పాతిక లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుందని, అంతకన్నా ఎక్కువ రైతులకు రాదనే అభిప్రాయానికి కమిటీ అభిప్రాయపడుతోంది. దీంతో సంప్రదింపుల ద్వారానే రాజధాని కోసం భూమిని సేకరించాలనే అభిప్రాయానికి కమిటీ వచ్చింది. ఉదాహరణకు ఒక రైతుకు ఎకరం భూమి ఉంటుంది. ఆ ఎకరాన్ని చదరపు గజాల్లో చూస్తే 4,400 చదరపు గజాలవుతుంది.
అందులో 2,200 రహదారులు, డ్రైనేజీఅభివృద్ధికి పోతుంది. ఇక మిగిలిన 2,200 లలో 1100 గజాలను అభివృద్ధి చేసిన తరువాత రైతులకు ఇవ్వాలనేది ప్రతిపాదనగా అధికార వర్గాలు తెలిపాయి. 1100 గజాలు అభివృద్ధి చేసి రైతులకు ఇచ్చేవరకు ఎన్నేళ్లు పడితే అన్నేళ్ల పాటు ఏడాదికి రూ.15 వేల నుంచి పాతిక వేలను ఆ రైతులకు చెల్లించాలనేది కమిటీ అభిప్రాయమని అధికారులు తెలిపారు. దీనివల్ల రైతులకు ఆర్థికంగా ప్రయోజనం ఉండదని, అభివృద్ధి చేయడానికి రైతులు స్వచ్చందంగా ముందుకు వస్తేనే వారికి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయాన్ని రాజధాని కమిటీ వ్యక్తం చేస్తోంది.