land acquisation
-
గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. ఆ రైతులకు ఎకరానికి రూ.9.20లక్షలు
సాక్షి, వైఎస్సార్ కడప(చాపాడు): గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.9.20లక్షల నష్టపరిహారాన్ని కేంద్రం ఇవ్వనున్నట్లు తహసీల్దారు సుభాని తెలిపారు. మండలంలోని సిద్దారెడ్డిపల్లె పంచాయతీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పిచ్చపాడు రెవెన్యూ పొలాల పరిధిలోని రైతులతో తహసీల్దారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం భూములు సేకరిస్తోందన్నారు. భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.9.20లక్షల నష్ట పరిహారం చెల్లించేందుకు నిర్ణయించిందన్నారు. రైతులకు అభ్యంతరాలుంటే రాత పూర్వకంగా తెలియజేయాలన్నారు. రైతులు భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం రెవెన్యూ సిబ్బందికి అందించాలన్నారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఐ ప్రవీణ్, వీఆర్ఓ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాప్రయోజనాల కోసమే భూసేకరణ: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) చట్టబద్ధమైన సంస్థ అని, ప్రజాప్రయోజనార్థం నిర్మించే రహదారుల కోసమే భూ సేకరణ చేపడుతోందని హైకోర్టు స్పష్టం చేసింది. అందుకే ఆ సంస్థ దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతిస్తున్నామని పేర్కొంది. సంగారెడ్డి నుంచి నాందేడ్ వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం కోసం ఎన్హెచ్ఏఐ భూసేకరణ చేపట్టింది. ఈ ప్రక్రియలో చట్ట ప్రకారం నిబంధనలు పాటించలేదంటూ సంగారెడ్డి జిల్లా కంది గ్రామానికి చెందిన నర్సింగ్‌రావు మరికొందరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. వాదనల తర్వాత సింగిల్ జడ్జి పిటిషనర్ల అభ్యంతరాలను పరిశీలించి భూసేకరణను చేపట్టాలని తీర్పునిచ్చింది. దీనిపై ఎన్హెచ్ఏఐ రివ్యూ పిటిషన్ వేస్తూ.. మారిన అలైన్‌మెంట్‌కు అనుమతించాలని కోరింది. దీన్ని రివ్యూ కోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్హెచ్ఏఐ రెండు రిట్ అప్పీళ్లను దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కుశలశెట్టి కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. ఇక్కడ కూడా నేషనల్ హైవేస్ యాక్ట్, 1956 ప్రకారమే భూ సేకరణ చేసిందని తెలిపింది. సదరు యజమానులు తగిన పరిహారం పొందడానికి అర్హులేనన్న ధర్మాసనం.. మారిన అలైన్‌మెంట్‌కు సంబంధించి దాఖలైన రిట్ అప్పీళ్లను అనుమతిస్తున్నామని వివరించింది. -
రామ మందిరం భూ కుంభకోణం ఆరోపణలు: రాహుల్ ట్వీట్
లక్నో: అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం జరిపిన భూ కొనుగోలు వ్యవహారంలో ఆలయ ట్రస్ట్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో రామమందిర్ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో అవినీతి జరిగిందని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు ఆరోపించాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మందిర నిర్మాణం చేపట్టిన ట్రస్ట్ పై ఆరోపణలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్ధలాన్ని అధిక ధరలకు రామ మందిర్ ట్రస్ట్ కొనుగోలు చేసిందని ఎస్పీ, ఆప్‌లు ఆరోపిస్తున్నాయి. 2 కోట్ల రూపాయల విలువైన ఈ స్ధలాన్ని ఏకంగా రూ 18.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని ఆరోపించిన ఆయా పార్టీలు ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీలచే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఇది రాముడి పేరుతో మోసం చేయడమేనన్నారు. సత్యం, న్యాయం అనేవి శ్రీరాముడికి మారుపేరని అంటూ రామ మందిర స్కామ్ హ్యాష్ ట్యాగ్‌తో రాహుల్ సోమవారం ట్వీట్ చేశారు. మందిర ట్రస్ట్ పై భూ కొనుగోలు వ్యవహారంలో వచ్చిన ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేసింది. श्रीराम स्वयं न्याय हैं, सत्य हैं, धर्म हैं- उनके नाम पर धोखा अधर्म है!#राम_मंदिर_घोटाला — Rahul Gandhi (@RahulGandhi) June 14, 2021 ఇదే భూమిని అదే రోజున ఈ డీల్ జరిగిన కొద్ది నిమిషాల కిందటే కుసమ్ పాధక్ అనే వ్యక్తి రవి తివారీ, సుల్తాన్ అన్సారీలకు రూ 2 కోట్లకు విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. తివారీ, సుల్తాన్ ల నుంచి ఇదే భూమిని మందిర ట్రస్ట్ రూ 18.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకుందని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. కాగా ఈ ఆరోపణలను రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తోసిపుచ్చారు. చదవండి: Ayodhya: ఆరోపణలపై ట్రస్ట్ స్పందన -
నా భార్యకు భర్తగా కొడుకు పేరా: ఈటల ఆగ్రహం
సాక్షి, కరీంనగర్: పార్టీలు ఉంటాయ్, పోతాయ్ వ్యక్తులు ఉంటారు పోతారు, కానీ వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని మాజీమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న క్రమంలో అధికారులు వ్యవహరించిన తీరు దారుణమని పేర్కొన్నారు. ఈటల జమున వైఫ్ ఆఫ్ నితిన్ అని రాశారని గుర్తుచేశారు. అధికారులకు కొడుకు ఎవరో, భర్త తెలియదు అన్నారు. ఆదరాబాదరా అయిన అర్థవంతమైన పని చేయాలని హితవు పలికారు. ఐఏఎస్ చదువుకున్న అధికారులు, బాధ్యత గల రెవెన్యూ అధికారులు, రిపోర్ట్ చేసే అధికారులు ఎంతనీచంగా ప్రవర్తించారో అదొక్కటే ఉదాహరణ అని ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్లో మంగళవారం మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఈటల మాట్లాడారు. ‘జ్ఞానం పెట్టి రాయలే, డిక్టెషన్ చేస్తే రాసినట్టుంది. మళ్లీ చెబుతున్నా కనీసం తప్పు చేసినవని నోటీస్ ఇవ్వాలి, లేదా ఓ దరఖాస్తు వచ్చింది భూములను పరిశీలిస్తున్నాం, కొలుస్తున్నాం అని పిలవాలి. ఇప్పటికైనా పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరుతున్నా. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగంతో నోరులేని వాళ్లకు, దిక్కులేని వారిని రాజ్యం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నప్పుడు కోర్టులు రాజ్యాంగ కాపాడుతుందని భావిస్తున్నాం.’ అని తెలిపారు. ‘ప్రభుత్వం నీచంగా ప్రవర్తించిందని త్వరలోనే తెలుస్తుంది. నేను ఎవరి గురించి కామెంట్ చేయను. నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చింది టీఆర్ఎస్, సీఎం కేసీఆర్. పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదు. కేటీఆర్ సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించలేదు.. నేనే స్వాగతించాను.. 2002లో టీఆర్ఎస్లో చేరిన. 2004 నుంచి కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశా’ అని ఈటల తెలిపారు. మంత్రులు చేసిన విమర్శలపై ఈటల స్పందిస్తూ.. ‘మాకు త్యాగమే లేదు, కమిట్మెంట్ లేదు, చీమలు పెట్టిన పుట్టలో పాములుదూరినట్లు చేరానని, మేకవన్నె పులి అంటున్నరు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని తెలిపారు. ‘ఎవరి చరిత్ర ఏమిటో ప్రజాక్షేత్రంలో ఉంది. నా పై కక్ష సాధించడం సరికాదు. ఎవరి మాటలపై స్పందించను. నాతో ఎవరేం మాట్లాడినారో నాకు తెలుసు. జిల్లాకు సంబంధించిన ఓ సమస్యపై తాను మంత్రిగా గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా సీఎంను కలుద్దామని ప్రగతిభవన్‌కు వెళ్లితే అపాయింట్మెంట్ దొరకలేదు. ఆ సందర్భంలో సీఎంకు ఇంత అహంకారం ఉంటుందా అని గంగుల అన్నారు. అలాంటి వ్యక్తి నా గురించి మాట్లాడితే ఎలా? నేను ఎవరి గురించి మాట్లాడను, కామెంట్స్ చేయను’ అని స్పష్టం చేస్తూ సమావేశం ముగించారు. చదవండి: నోటీస్ ఇవ్వకుండా రాజ్‌భవన్‌పై కూడా విచారించొచ్చు సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్ డైరెక్టర్ -
తెలంగాణ కేబినేట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్
-
సీఎం కేసీఆర్ సంచలనం: ఈటల బర్తరఫ్
సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్‌పై వేటు పడింది. ఆయనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెదక్ జిల్లా కలెక్టర్ నివేదిక పంపిన నేపథ్యంలో.. ఆయన్ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించారు. ముఖ్యమంత్రి సిఫారసు మేరకు ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంటూ గవర్నర్ కార్యాలయం ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలను శనివారం ముఖ్యమంత్రికి బదలాయించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం సాయంత్రం భూ కబ్జా ఆరోపణలపై ప్రభుత్వానికి నివేదిక అందింది. ఈ నేపథ్యంలో ఈటల మంత్రివర్గం నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటారా? లేక బర్తరఫ్ చేసేంత వరకు వేచి చూస్తారా? అనే ఉత్కం ఠ నెలకొంది. అయితే ఈ సస్పెన్స్‌కు గవర్నర్ కార్యాలయం ముగింపు పలికింది. ఇప్పటికే వివాదాస్పద భూమిలో అధికారులు బోర్డులు పాతగా, కేవలం మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌తో సరిపెట్టకుం డా వివిధ చట్టాల ఉల్లంఘనను కారణంగా చూపు తూ ఆయనపై మరిన్ని చర్యలకు కూడా ప్రభుత్వం ఆదేశించే అవకాశమున్నట్లు సమాచారం. రెండోరోజూ అదే సీన్.. ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండో రోజు ఆదివారం కూడా పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి తరలివచ్చారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కుల సంఘాల నేతలు కూడా వచ్చి తమ సంఘీభావం తెలియజేశారు. ‘మేము మీ వెన్నంటి ఉంటాం’అని నియోజకవర్గంలోని కేడర్ స్పష్టం చే సినట్లు సమాచారం. వివిధ సంఘాల నేతలు మా త్రం ఏదో ఒక రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి కూ డా రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాలని కొందరు, పార్టీలో కొనసాగుతూ తాడో పేడో తేల్చుకోవాలని మరికొందరు సూచించినట్లు తెలుస్తోంది. అందరం కలిసి మాట్లాడుకుందాం.. తనను కలుస్తున్న వారందరికీ.. ‘వేచి చూద్దాం.. తొందర పడొద్దు’అంటూ ఈటల సమాధానం ఇస్తున్నారు. అందరమూ కూర్చొని మాట్లాడుకుం దామని చెబుతున్నారు. ఒకటీ రెండురోజుల్లో నియోజకవర్గ కేంద్రానికి వెళ్లేందుకు ఈటల సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. కార్యకర్తలతో సమావేశమై వారి నుంచి అభిప్రాయ సేకరణ జరపాలనే యోచనలో ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, శ్రేయోభిలా షులతోనూ భేటీ అయ్యే అవకాశముంది. పార్టీలో నిశ్శబ్దం తెలంగాణ ఉద్యమ నేతగా, మంత్రిగా ఇన్నాళ్లూ పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఈటల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై టీఆర్ఎస్లో మౌనం రాజ్యమేలుతోంది. ఎవరూ దీనిపై మాట్లాడటం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను విమర్శిస్తూ శని, ఆదివారాల్లో మంత్రులు శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వేర్వేరు ప్రెస్మీట్లు పెట్టినా ఈటల అంశం ప్రస్తావనకు రాకుండా చూసుకున్నారు. మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు మినహా పార్టీ ఇతర నేతలెవరూ ఈటల ఇంటి దరిదాపులకు వెళ్లకపోవడం గమనార్హం. కేటీఆర్‌ను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఈటల చెప్పినా, ఇతర కీలక నేతలెవరూ ఆయనను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. చదవండి: ఊహించని షాక్.. 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?' -
అంతా తప్పుడు ప్రచారం.. విచారణ చేస్కోండి: ఈటల సవాల్
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్టుగా వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, కావాలనే స్కెచ్ వేసి తనపై తప్పుడు ప్రచారం చేశారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి శామీర్‌పేటలోని తన ఇంట్లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ‘‘స్కూటర్‌పై తిరిగిన వాళ్లు వేల కోట్లకు ఎదిగారు. ఒక్క సిట్టింగ్‌లోనే వందలు, వేల కోట్లు సంపాదించే వారు ఎందరో ఉన్నారు. వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చినయ్. నేను నిప్పులాంటి వ్యక్తిని. నా చరిత్ర మీద, ఆస్తులపై విచారణ చేయండి. తప్పు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమే. సీఎస్, విజిలెన్స్ డీజీతో విచారణ చేయించడానికి సీఎం ఆదేశించినట్లు తెలిసింది. వారితోనే కాదు.. సిట్టింగ్ జడ్జితోనూ విచారణ జరిపించి నిజానిజాలు సమాజానికి చెప్పాలి..’’ అని డిమాండ్ చేశారు. కుట్రకు లొంగిపోయే వ్యక్తిని కాదు.. తాను ఏమీ లేని నాడు కొట్లాడానని, ప్రలోభాలకు గురి చేయాలని చూసినా కొట్లాడానని.. ప్రజల కోసం కొట్లాడటమే తప్ప వెన్నుపోటు తెలియదని మంత్రి ఈటల పేర్కొన్నారు. ఇప్పుడు ఆరోపణలు వచ్చిన భూముల్లో తనకు ఒక్క ఎకరం ఉన్నా షెడ్లు కూలగొట్టి తీసుకోవాలన్నారు. ‘‘రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో ఎన్నో కోట్ల రాయితీలు ఇచ్చారు. నేను ప్రభుత్వం నుంచి 5 పైసలు కూడా తీసుకోలేదు. చిల్లరమల్లర ప్రచారాలకు, కుట్రకు లొంగిపోయే వ్యక్తిని కాదు. నేను ముదిరాజ్ బిడ్డను. చావనైనా చస్తా తప్ప మాట తప్పే మనిషిని కాదు. నన్ను దొర అనడం నీచం. అణచివేతలకు, దొరతనానికి వ్యతిరేకంగా కొట్లాడిన వ్యక్తిని నేను’’ అని ఈటల పేర్కొన్నారు. తాను 1986 నుంచీ పౌల్ట్రీ వ్యాపారం చేస్తున్నానని.. 2007లో ఐదు కోట్లు పెట్టి 2,100 గజాల భూమి కొంటే వివాదంలో పడిందని, ఇప్పటికీ తనకు రాలేదని చెప్పారు. కానీ తన వ్యక్తిత్వాన్ని నాశనం చేసేలా కొందరు విషం చల్లే ప్రచారం చేశారని ఆరోపించారు. ధర్మం తాత్కాలికంగా ఓడిపోయినా.. అంతిమంగా విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. హేచరీ విస్తరించాలనుకున్నాం 2016లో జమున హేచరీస్ పేరుతో అచ్చంపల్లి, హకీంపేట గ్రామాల్లో రూ.6లక్షల చొప్పున 40 ఎకరాల భూమి కొని షెడ్లు వేశామని.. తర్వాత ఇంకో ఏడెకరాలు కొనుక్కున్నామని మంత్రి ఈటల చెప్పారు. కెనరా బ్యాంకులో రూ.100 కోట్లు రుణం తీసుకున్నామని, ఆ అప్పు ఇంకా కడుతూనే ఉన్నామని తెలిపారు. ‘‘పౌల్ట్రీ కోసం మరింత భూమి కావాల్సి వచ్చింది. కానీ మా చుట్టుపక్కల అన్నీ అసైన్డ్ భూములున్నాయి. అప్పుడు పరిశ్రమల శాఖకు అప్లికేషన్ పెడితే.. ఇవ్వలేమని చెప్పారు. టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శితో దీనిపై మాట్లాడాను. రాళ్లురప్పలతో కూడిన భూమి అది. 1994లో అసైన్ చేస్తే ఇప్పటికీ ఒక్క ఎకరం కూడా సాగు కాలేదు. ఆ భూములను ప్రభుత్వం సేకరించి ఇవ్వాలంటే ఆలస్యం అవుతుందని అధికారులు చెప్పారు. అసైనీలు ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగిస్తే.. తొందరగా తీసుకోవచ్చన్నారు. అప్పుడు రైతులతో మాట్లాడి 20–25 ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేశాం. కానీ తర్వాత మా హేచరీస్ విస్తరణ ఆలోచనను పక్కనపెట్టేశాం. ఇప్పటికీ ఆ భూములు వాళ్ల దగ్గరే ఉన్నాయి. ఎమ్మార్వో దగ్గరే కాగితాలున్నాయి. నేను భూములు ఆక్రమించుకున్నానన్న ఆరోపణలు నీచం. 2004 నాటికే రాష్ట్రంలో 10.50 లక్షల కోళ్లున్న పౌల్ట్రీకి ఎదిగిన వాడిని. ఆరు లక్షల లేయర్, 4.5 లక్షల బ్రాయిలర్ కోళ్లు ఉండేవి. 2004 అఫిడవిట్లోనే నా ఆస్తులన్నీ చూపించా. ఒక్క తరంలోనే రూ.వందల కోట్లకు ఎదిగిన వాళ్లు ఉన్నారు. వాళ్లను ఎందుకు అడగరు?’’ అని ఈటల ప్రశ్నించారు. సంచలనం: మంత్రి ఈటలపై భూ కబ్జా ఆరోపణలు -
ఇది న్యాయమేనా?!
పుట్టి మూడేళ్లయినా కాకుండానే భూసేకరణ చట్టం సమస్యలను ఎదుర్కొం టున్నది. దాన్ని మారిస్తే తప్ప పరిశ్రమలూ, ప్రాజెక్టులూ వచ్చే అవకాశం లేదని వాపోయే పాలకుల స్వరం అంతకంతకూ హెచ్చుతోంది. పర్యవసానంగానే ఆ చట్టంలోని అంశాలకు తూట్లు పొడిచేలా ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో భూసేకరణ చట్టాలు తయారవుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఆదివారం ఉభయ సభల ప్రత్యేక సమావేశం పెట్టి ఏ చర్చా లేకుండా ఆమోదించిన భూసేకరణ సవరణ బిల్లు కూడా ఆ కోవలోనిదే. తీవ్ర గందరగోళం మధ్య అసెంబ్లీలో పది నిమిషాల లోపు... మండలిలో అయిదే నిమిషాల్లో ఆ బిల్లు సునాయాసంగా గట్టెక్కింది. లక్షలాది బక్క రైతుల, బడుగుల తలరాతలను నిర్ణయించే కీలకమైన బిల్లుకు ఈ గతి పట్టడం విచారం కలిగిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టానికి కేంద్రం సూచించిన విధంగా మార్పులు చేసి తాజా సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రాల్లో పుట్టుకొస్తున్న భూసేకరణ చట్టాలకున్న నేపథ్యాన్ని ఒకసారి గమనించాలి. భూసేకరణ చట్టం–2013 దేశమంతా 2014 జనవరి 1 నుంచి అమల్లోకొచ్చింది. ఆ పన్నెండు నెలల్లో అది పెద్దగా అమలైన వైనమూ లేదు. సమస్యలొచ్చిన దాఖలా అంతకన్నా లేదు. కానీ ఆ ఏడాది చివరికొచ్చేసరికల్లా ఆచరణలో సమస్యలు తలెత్తుతున్నాయంటూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ తర్వాత దాని స్థానంలో లోక్‌సభలో బిల్లు ప్రవేశ పెట్టారు. అది ఆమోదం పొందింది. రాజ్యసభలో సాధ్యపడక మూడుసార్లు ఆ ఆర్డినెన్స్‌నే మళ్లీ మళ్లీ జారీచేశారు. చివరకు బిహార్ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన తరుణంలో ఇక భూసేకరణ చట్టం జోలికి వెళ్లదల్చుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రకటించారు. అంతటితో అది ఆగి ఉంటే వేరుగా ఉండేది. కానీ రాష్ట్రాలు వాటి ‘అవసరాలరీత్యా’ మార్పులు చేసుకోవచ్చునని కేంద్రం ప్రకటించింది. పర్యవసానంగా ఇప్పటికే గుజరాత్ అసెంబ్లీ కొత్త చట్టాన్ని తెచ్చుకుంది. మధ్యప్రదేశ్, ఒడిశాలు ఆ పనే చేయబోతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడ్డ బీజేపీ సర్కారు కూడా భూసేకరణకు చట్టం తీసుకొస్తామని చెప్పింది. యూపీ విజయం తర్వాత...రాజ్యసభలో మున్ముందు తమ బలం పెరిగే అవకాశం ఉండటం వల్లా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరో ప్రయత్నం చేయదల్చుకున్నట్టు కనబడుతోంది. భూసేకరణ చట్టం సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)పని దాదాపు స్తంభించినా దాన్ని పొడిగించాలని ఈ మధ్య నిర్ణయించడంలోని ఆంతర్యం ఇదే కావొచ్చు. సొంతంగా భూసేకరణ చట్టాలు తీసుకురావడానికి ప్రభుత్వాలు చెబుతున్న కారణం ఒక్కటే– 2013 చట్టం ప్రకారం భూమిని సేకరించడం కష్టంగా మారిందన్నదే. కానీ అందులోని నిజానిజాలేమిటో ఎవరికీ తెలియదు. పాత చట్టం రావడానికి ముందు దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో ఉద్యమాలు తలెత్తాయి. ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పలుచోట్ల పోలీసు కాల్పుల్లో పదులకొద్దీ మంది ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి సింగూరు, పోస్కో, వేదాంత వగైరా ప్రాజెక్టుల్లో భూమి కోల్పోయిన రైతులు ఉద్యమించిన తీరు చూశాకే 120 ఏళ్ల చట్టానికి ఎప్పుడు ముగింపు పలుకుతారని ఆనాటి యూపీఏ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. కొత్త చట్టం తీసుకొస్తామని ఆ ప్రభుత్వం ప్రకటించక తప్పలేదు. అలా చెప్పాక కూడా మరో అయిదారేళ్లకుగానీ భూసేకరణ చట్టం సాధ్యం కాలేదు. ఆ చట్టం విషయంలోనే ఉద్యమ సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ‘ప్రజోపయోగం’ అన్న పదానికి చట్టంలో విస్పష్టమైన నిర్వచనం లేదని, మార్కెట్ విలువకు పట్టణాల్లో అయితే రెండు రెట్లు, పల్లెల్లో అయితే నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలన్న నియమం ఉన్నా మార్కెట్ విలువను ఏ ప్రాతిపదికన లెక్కేస్తారో అందులో చెప్పలేదని వారు విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు ప్రాజెక్టులు, ఇతర ప్రజోపయోగమైన అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో సామాజిక ప్రభావ అంచనా(ఎస్ఐఏ) అవసరం లేదంటున్నది. కాలయాపనను ఇందుకు సాకుగా చెబుతోంది. నిజానికి 2013 చట్టం మూడు నెలల వ్యవధిలో ఎస్ఐఏ పూర్తికావాలని నిర్దేశిస్తోంది. లక్షలాదిమంది కుటుంబాల జీవికతో ముడిపడి ఉండే ఒక సమస్యపై మూడు నెలలపాటు అధ్యయనం చేయడం కూడా ప్రభుత్వానికి కాలయాపనలా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వెనకటి తేదీల నుంచి అమల్లోకొచ్చేలా బిల్లు రూపొందిన నేపథ్యంలో ఎస్ఐఏ అవసరమే లేకుండా చేశారన్న అభిప్రాయం కలుగుతోంది. మెరుగైన పరిహారం, పునరావాసం ఇవ్వదల్చుకున్న రాష్ట్రాలు చట్టానికి సవరణలు తీసుకురావచ్చునన్న కేంద్ర చట్టంలోని 107వ నిబంధనను అడ్డం పెట్టుకుని తాజా సవరణ బిల్లు తీసుకొచ్చారు. కేంద్ర చట్టం ద్వారా వచ్చే పరిహారానికి మించి కొత్త చట్టం ద్వారా లభించేలా చేస్తామన్న హామీ నిలిచేది కాదు. ఆ చట్టమే మార్కెట్ రేటు ఎలా నిర్ణయిస్తారన్న అంశంలో మౌనంగా ఉన్న ప్పుడు...రైతుకు కొత్త చట్టం ద్వారా అంతకంటే ఎక్కువొస్తుందని ఎలా అను కోవాలి? కలెక్టర్లు పరిహారం, పునరావాసం నిర్ణయించే సందర్భాల్లో రైతులు అభ్యంతరాలు దాఖలు చేసుకోవడానికి కేంద్ర చట్టం అవకాశం కల్పిస్తోంది. వాటిని పరిశీలించాకే భూసేకరణపై తుది నిర్ణయం తీసుకోమని నిర్దేశిస్తోంది. కొత్త బిల్లు ఆ వెసులుబాటును తొలగిస్తోంది. ‘అత్యవసర సేకరణ’ అవసరమైనప్పుడు పార్ల మెంటు ఆమోదం అవసరమని కేంద్ర చట్టం చెబితే... అందుకు బదులు ఒక పాలనా ఉత్తర్వు సరిపోతుందని తెలంగాణ బిల్లు అంటున్నది. చిత్రమేమంటే ఇంచుమించు ఈ అంశాలన్నీ కేంద్రం గతంలో తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌లో ఉన్నాయి. కోట్లాదిమందిని కూడగట్టి తెలంగాణను సాధించిన ఉద్యమ పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం ఇలాంటి సవరణలకు పూనుకోవడం, వాటిపై కనీసం చర్చకు కూడా చోటీయకపోవడం ఆశ్చర్యకరం... దురదృష్టకరం. -
భూములిస్తే రిజిస్ట్రేషన్లకు అనుమతి
చిలకలపూడి : భూసమీకరణలో భూములు ఇస్తామని అంగీకార పత్రాలు ఇస్తే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని బందరు ఆర్డీవో పి.సాయిబాబు అన్నారు. ఆయన తన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఏడీఏ ద్వారా 33 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఇందుకోసం 21 గ్రామాలను పది యూనిట్లుగా ఏర్పాటు చేసి ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లను నియమించినట్లు తెలిపారు. భూసమీకరణకు అంగీకార పత్రాలు ఇస్తామని, తాము కొనుగోలు చేసిన భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని కొంత మంది తమను కోరటం జరిగిందన్నారు. ఇందుకోసం భూసమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చే వారికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించేలా కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ చేయించి రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపిస్తామని పేర్కొన్నారు. భూసమీకరణలో గ్రామ కంఠాలు, గృహాలు కూడా పొందుపరిచారని కొంత మంది అపోహలో ఉన్నారన్నారు. గ్రామకంఠాలు, గృహాలను తాము సమీకరణలో చేర్చలేదని స్పష్టం చేశారు. అయితే గ్రామ కంఠాలు పక్కనే గృహాలు ఉండి వాటిని భూసమీకరణలో పొందుపరిచి ఉంటే వారి అభ్యంతరాలను స్వీకరించి తహసీల్దార్‌తో విచారణ చేయించి వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో బందరు తహసీల్దార్ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
గాజువాక మార్కెట్‌పై.. రాబంధువులు
రూ. 25 కోట్ల స్థలాన్ని గద్దలా తన్నుకుపోయేందుకు ప్లాన్ అభివృద్ధి పేరిట ఎమ్మెల్యే బంధువుల మంత్రాంగం మార్కెట్‌ను వేరే చోటుకు తరలించేందుకు ప్రణాళికలు వివాదాలు ఉన్నా.. తనకేం తెలీదంటున్న స్థానిక ఎమ్మెల్యే అదో పట్టణం.. అందలో ఓ పెద్ద కూడలి.. దాన్ని అనుకొని కూరగాయల మార్కెట్.. విలువైన ఆ మార్కెట్ స్థలంపై బడాబాబు కన్నుపడింది. దాన్ని కబ్జా చేసి అక్కడో బహుళ అంతస్తుల భవనం కట్టాలని ప్లాన్ చేస్తాడు. పాలకులు, అధికారులను మేనేజ్ చేసి మార్కెట్ విధ్వంసానికి కుట్ర పన్నుతాడు. ఇంతలో హీరో ప్రవేశించి విలన్‌ను, రౌడీలను చితక్కొట్టి మార్కెట్‌ను రక్షించేస్తాడు. కొన్నేళ్ల క్రితం వచ్చిన ఓ మెగా సినిమాలోని కుట్ర ఎపిసోడ్ ఇప్పుడు గాజువాకలో వాస్తవరూపం దాలుస్తోంది. పారిశ్రామికంగా ఎంతో ఎదిగిన గాజువాకలో స్థలాలకు ఉన్న గిరాకీని.. ప్రధాన కూడలిలో ఉన్న మార్కెట్ స్థలం విలువను చూసి.. దాన్ని ఎలాగైనా కొట్టేయాలని పెద్దలు పన్నాగం పన్నారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువులే దీన్ని కబళించేందుకు పావులు కదుపుతున్నారు. అధికార, అర్థ బలాన్ని ఉపయోగించి పాతిక కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసే కుట్రకు తెరలేపారు. ఆ కుట్ర ఎపిసోడ్ ఏమిటో చూద్దాం.. విశాఖపట్నం: కొత్త గాజువాక జంక్షన్‌ను అనుకొని కణితి రోడ్డు సర్వే నంబర్ 75/6లో సుమారు 70 సెంట్ల స్థలంలో కూరగాయల మార్కెట్ కొనసాగుతోంది. ఈ స్థలాన్ని ఎన్నో దశాబ్దాల క్రితం సంత కోసం కేటాయించారు. కాలక్రమంలో అది రోజువారీ ప్రధాన మార్కెట్‌గా మారింది. సంత కాస్త మార్కెట్‌గా విస్తరించడం.. షాపుల సంఖ్య బాగా పెరగడంతో ఆ స్థలం తమదని పేర్కొంటూ కసిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ అనే వ్యక్తి మార్కెట్లోకి ప్రవేశించారు. అప్పటికే అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులు సదరు కసిరెడ్డితో ఒప్పందం చేసుకుని కొనసాగుతున్నారు. అయితే కొన్నాళ్లకు రెవెన్యూ అధికారులు దీన్ని ప్రభుత్వ స్థలంగా నిర్ధారించారు. ప్రైవేటు ఒప్పందాన్ని రద్దు చేసి మార్కెట్‌ను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కొనసాగించాలని ఆదేశిస్తూ ఆర్సీ నంబర్ 5668/2001 ఎఫ్3 27/3/2001 ప్రొసీడింగ్స్ ద్వారా గాజువాక మున్సిపాలిటీకి ఆ భూమిని బదలాయించారు. ఈ ప్రొసీడింగ్స్‌ను వ్యతిరేకిస్తూ సదరు ప్రైవేట్ వ్యక్తి 7256/2001 నంబరుతో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు దాన్ని ప్రభుత్వ భూమిగానే పరిగణించి కేసును కొట్టేసింది. 2005 నవంబర్‌లో గాజువాక మున్సిపాలిటీ జీవీఎంసీలో విలీనం కావడంతో మార్కెట్ స్థలం కూడా జీవీఎంసీకి దఖలు పడింది. ఇదంతా గతం.. వర్తమానంలోకి వస్తే.. గత పది పదిహేనేళ్లలో పారిశ్రామికంగా గాజువాక ఎంతో అభివృద్ధి చెందింది. అందుకు తగినట్లే ఇక్కబి భూములకు ఎక్కడాలేని గిరాకీ ఏర్పడింది. ధరలూ ఆకాశాన్నంటాయి. ఈ తరుణంలో కీలకమైన కొత్త గాజువాక జంక్షన్‌ను అనుకునే ఉన్న ప్రధాన మార్కెట్ స్థలం ప్రస్తుత తెలుగుదేశం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువులను ఆకర్షించింది. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం సుమారు పాతిక కోట్ల రూపాయల విలువైన ఆ భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్‌ను వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల గాజువాక హౌస్ కమిటీ భూముల క్రమబద్ధీకరణ అంశం తెరపైకి రావడంతో ఆ కుటుంబానికి చెందిన మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ నేతృత్వంలో రాజకీయాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ మార్కెట్‌ను ఎక్కడికి తరలించాలనే విషయమై చర్చ జోరుగా సాగుతున్నట్టు తెలిసింది. మల్టీలెవల్ మార్కెట్ చేస్తాం:ఎమ్మెల్యే పల్లా గాజువాక పట్టణం బాగా అభివృద్ధి చెందడంతో కూరగాయల మార్కెట్ స్థలం బాగా ఇరుకైంది. అందుకే దాని స్థానంలో మల్టీ లెవల్ మార్కెట్ కట్టాలని భావిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పారు. అది ఇక్కడే కట్టాలా.. మరో చోట నిర్మించాలా.. అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆ స్థలంపై వివాదాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. తమ బంధువు పల్లా రామాయమ్మ మార్కెట్ స్థలంలో 70 సెంట్లు తమదేనంటూ కోర్టుకు వెళ్లారని, అ కేసు విషయం ఏమైందో కూడా తనకు పెద్దగా తెలియదని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. కబ్జా కుట్రను అధికారులు అడ్డుకోవాలి గాజువాకలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో కబ్జా కుట్రలు ఎక్కువయ్యాయి. జీవీఎంసీ అధికారులు వెంటనే అప్రమత్తమై మార్కెట్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. వాస్తవానికి ఈ మార్కెట్‌ను వేరే ప్రాంతానికి తరలించడం సాధ్యం కాదు. గతంలో ఎ.వి.భానోజీరావు ఇచ్చిన డాక్యుమెంట్లో ఆ స్థలాన్ని మార్కెట్‌గానే పరిగణించారు. అందువల్ల కోర్టులో కూడా ప్రైవేట్ వ్యక్తులకు టైటిల్ నిర్ధారణ కాలేదు. ఒకవేళ టైటిల్ ప్రూవ్ అయినా కూడా మార్కెట్ తరలింపు సాధ్యం కాదు. -ఎ.జె.స్టాలిన్, సీపీఐ జిల్లా కార్యదర్శి, న్యాయవాది -
పేద రైతుకు పరిహారంపైనా...!
కడప అర్బన్: గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు కింద భూమి కోల్పోయిన పేద రైతుకు పరిహారం ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగిని మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వైఎస్సార్ జిల్లాలోని గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు కింద గుర్రంగుంపు తండా వద్ద ఉన్న ఇస్లావత్ కిశోర్‌నాయక్, అతడి అమ్మమ్మల పేరిట ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకుంది. పరిహారం కింద ప్రభుత్వం వారికి రూ.4.22 లక్షలు విడుదల చేసింది. ఆ డబ్బును తీసుకునేందుకు ప్రాజెక్టు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే వై ప్రమీలమ్మను వారు సంప్రదించారు. దీంతో పరిహారం ఇచ్చేందుకు ఆమె లంచం డిమాండ్ చేశారు. పట్టణంలోని శంకరాపురంలో ఉన్న జీఎన్ఎస్ఎస్ కార్యాలయంలో శంకర్‌నాయక్ నుంచి రూ.4 వేలు తీసుకుంటున్న ప్రమీలమ్మను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
భూసేకరణపై వినూత్న నిరసన
ప్రకాశం బ్యారేజీపై కూరగాయలు పంచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రైతులతో కలసి రాస్తారోకో,166 జీవో కాపీ దహనం ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను ప్రతిఘటించి తీరతామని స్పష్టీకరణ న్యాయం కోసం రైతుల తరఫున కోర్టుకు వెళతామని పునరుద్ఘాటన తాడేపల్లి (గుంటూరు) : లక్షా 66 వేల జీవోలు తెచ్చినా ప్రతిఘటించి తీరతాం.. మూడు పంటలు పండే భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాం.. అన్నదాతలకు అండగా ఉంటాం.. భూ సమీకరణ, భూ సేకరణ.. ఏదైనా అడ్డుకుంటాం.. చట్టం కాని ఆర్డినెన్స్‌తో, 166 జీవోతో సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే సహించం.. వైఎస్సార్సీపీతో నడిచి వచ్చే రాజకీయ పార్టీలతో కలసి, రైతుల పక్షాన పోరాటాలు చేస్తాం.. రాజధాని కోసం ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్స్ ప్రయోగించిన నేపథ్యంలో ఆ ప్రాంత రైతులకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఇచ్చిన భరోసా ఇది. భూ సేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఆర్కే నేతృత్వంలో సీతానగరం ప్రకాశం బ్యారేజి వద్ద శుక్రవారం రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్కే కూరగాయలు పంచి తన నిరసన వ్యక్తం చేశారు. రైతులు తమ పంట పొలాల నుంచి స్వచ్ఛందంగా తెచ్చిన కూరగాయలను భారీ స్థాయిలో పంచిపెట్టారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. 166 జీవో కాపీని దహనం చేశారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పూర్తిగా రైతులను మోసం చేసే విధంగా భూ సమీకరణ, భూ సేకరణ ప్రక్రియలు నిర్వహిస్తోందని విమర్శించారు. బహుళ పంటలు పండే భూములను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోబోనివ్వమని చెప్పారు. భూసేకరణను తీవ్రంగా ప్రతిఘటించి తీరతామన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాతలకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ప్రాంతాల రైతులు, రైతుకూలీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
జెడ్పీలో.. రణం
► భూసేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించిన వైఎస్సార్ సీపీ ► జెడ్పీ సమావేశాన్ని బహిష్కరించిన ఆ పార్టీ సభ్యులు ► ల్యాండ్ పూలింగ్‌కు మాత్రమే వ్యతిరేకమని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టీకరణ ► ఇష్టంలేని రైతుల వద్ద నుంచి భూములు తీసుకోవడం దారుణం ► కౌలు రైతులు, రైతుల కూలీలకు ఏం న్యాయం చేస్తున్నారో చెప్పలేదు ► రాజధాని ప్రాంత రైతులకు ఇప్పటికీ రుణమాఫీ చేయలేకపోయారు ► భూసేకరణ ఆర్డినెన్స్, నూతన జీవోను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని పట్టు ► తిరస్కరించిన మంత్రి ప్రత్తిపాటి,జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ ► రైతుల పక్షాన పోరాటం చేస్తామని, జీవో కాపీలను చింపివేసి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయిన వైఎస్సార్ సీపీ సభ్యులు పాత గుంటూరు : భూ సేకరణ ఆర్డినెన్స్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. ఇందుకు గుంటూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వేదికగా చేసుకుంది. ఆ సమావేశాన్ని బహిష్కరించింది. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి ఇంకా వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ, భూ సేకరణలపైనే చర్చ సాగింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మాట్లాడుతూ తాము రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, ల్యాండ్ పూలింగ్ విధానానికి మాత్రమేనని స్పష్టం చేశారు. ఇష్టం ఉన్న రైతులు మాత్రమే భూములు ఇచ్చారని, ఇష్టం లేని రైతుల వద్ద నుంచి ప్రభుత్వం భూములు తీసుకోవాలని చూడడం దారుణమన్నారు. ల్యాండ్‌పూలింగ్‌లో నష్టపోతామని భావించి రైతులు కోర్టును ఆశ్రయిస్తే వారిని బెదిరించేందుకు ప్రభుత్వం 166 జీవోను విడుదల చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు 33,400 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పుకోవడం కాదని, పాలకుల బెదిరింపులకు భయపడి ఇచ్చారనేది కౌలు చెక్కుల పంపిణీలో తేటతెల్లమైందన్నారు. రాజధాని ప్రాంతంలోని రైతు కూలీలకు, వ్యవసాయ వృత్తుల వారికి ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తుందో ఇప్పటివరకు ప్రకటన చేయలేదన్నారు. ఏ స్థితిలో రైతులకు నష్టం జరిగినా వారి తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్స్ ప్రయోగించడం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనా అని ఆర్కే ప్రశ్నించారు. శాసనసభలో ల్యాండ్‌పూలింగ్ విధానంపై ఓటింగ్ నిర్వహించాలని ైవె ఎస్సార్ సీపీ పట్టుపట్టినా, భయపడిన సీఎం చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ విధానాన్నే ఎంపిక చేసుకున్నారన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసివేయండి, తాము రాజధానికి సహకరిస్తామని ఆయన స్పష్టచేశారు. రాజధాని ప్రాంత రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించినా ఇప్పటికీ మాఫీ చేయకపోవడాన్ని ప్రశ్నించారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పుకుంటున్న ప్రాంతంలో రాజధాని నిర్మించుకుంటే బాగుంటుందన్నారు. సర్వసభ్య సమావేశంలో భూసేకరణ ఆర్డినెన్స్, నూతన జీవోను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. దీనిని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్లు వ్యతిరేకించారు. దీంతో వైఎస్సార్ సీపీ సభ్యులంతా 166 జీవో కాపీలను చింపిచేసి సమావేశాన్ని బహిష్కరించారు. చిరునవ్వుల మధ్యే చర్చ .... మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సర్వసభ్య సమావేశంలో భూ సేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని కోరగా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తాము రైతులకు న్యాయం చేస్తున్నామనీ, ల్యాండ్ పూలింగ్‌లో రైతులు స్వచ్ఛందంగా 33,400 ఎకరాలు ఇచ్చారనీ, ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. దీంతో మంగళగిరి ఎమ్మెల్యే చిరునవ్వుతో మంత్రి పదవి కోసం పాట్లు ఎందుకన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, రాజేంద్రప్రసాద్‌ల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. మంత్రి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచంలో కెల్లా సుందరమైన రాజధానిని నిర్మించాలని కృషి చేస్తున్నారన్నారు. దీనిపై చర్చ జరుగుతుండగానే ఎమ్మెల్యే ఆర్కే మరోసారి భూ సేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేక తీర్మానం చేయాలని డిమాండ్ చేయడంతో మంత్రి పుల్లారావు సున్నితంగా తిరస్కరించారు. దీంతో వైఎస్సార్ సీపీ సభ్యులంతా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
జన్మభూమి తరువాత భూసేకరణ
మంగళగిరి పరిసరాల్లో పది వేల ఎకరాలకు బౌండరీలు ఆ తరువాత క్రయ, విక్రయాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ సాక్షి, హైదరాబాద్: జన్మభూమి కార్యక్రమం పూర్తయిన వెంటనే విజయవాడ-గుంటూరు మధ్యలో నూతన రాజధానికి అవసరమైన భూమి సమీకరణపై చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జన్మభూమి-మన ఊరు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ముగియగానే మంగళగిరి పరిసర ప్రాంతాల్లో తొలి దశలో పది వేల ఎకరాల వరకు భూమిని సమీకరించనున్నారు. రాజధానికోసం ఎంపిక చేసిన విస్తీర్ణంలో బౌండరీలను నిర్ధారించడంతోపాటు ఆ ప్రాంతంలో భూ క్రయ, విక్రయాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. కర్నూలు రాజధాని సమయంలో 1954లో అద్దెలను పెంచకుండా ఆర్డినెన్స్‌ను అప్పట్లో ప్రభుత్వం తీసుకువచ్చింది. అదే తరహాలో ఇప్పుడు కూడా భూ సమీకరణ ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తులెవరూ భూములను విక్రయించడం, కొనుగోలు చేయడంపై నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకురావచ్చునని అధికార వర్గాలు తెలిపాయి. మంగళగిరి పరిసరాల్లో రిజిస్ట్రేషన్ విలువ ఎకరం రూ.6 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉందని రాజధాని కమిటీ నిర్ధారణకు వచ్చింది. వాస్తవంగా విక్రయాలు మాత్రం ఎకరం రూ.50 లక్షల నుంచి 60 లక్షలకు జరుగుతున్నాయని కమిటీ పేర్కొంది. చట్టం ప్రకారం ప్రభుత్వం భూసేకరణ చేస్తే ఎకరానికి రూ.పాతిక లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుందని, అంతకన్నా ఎక్కువ రైతులకు రాదనే అభిప్రాయానికి కమిటీ అభిప్రాయపడుతోంది. దీంతో సంప్రదింపుల ద్వారానే రాజధాని కోసం భూమిని సేకరించాలనే అభిప్రాయానికి కమిటీ వచ్చింది. ఉదాహరణకు ఒక రైతుకు ఎకరం భూమి ఉంటుంది. ఆ ఎకరాన్ని చదరపు గజాల్లో చూస్తే 4,400 చదరపు గజాలవుతుంది. అందులో 2,200 రహదారులు, డ్రైనేజీఅభివృద్ధికి పోతుంది. ఇక మిగిలిన 2,200 లలో 1100 గజాలను అభివృద్ధి చేసిన తరువాత రైతులకు ఇవ్వాలనేది ప్రతిపాదనగా అధికార వర్గాలు తెలిపాయి. 1100 గజాలు అభివృద్ధి చేసి రైతులకు ఇచ్చేవరకు ఎన్నేళ్లు పడితే అన్నేళ్ల పాటు ఏడాదికి రూ.15 వేల నుంచి పాతిక వేలను ఆ రైతులకు చెల్లించాలనేది కమిటీ అభిప్రాయమని అధికారులు తెలిపారు. దీనివల్ల రైతులకు ఆర్థికంగా ప్రయోజనం ఉండదని, అభివృద్ధి చేయడానికి రైతులు స్వచ్చందంగా ముందుకు వస్తేనే వారికి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయాన్ని రాజధాని కమిటీ వ్యక్తం చేస్తోంది. -
మెదక్, సిద్దిపేటలో పరిశ్రమలు: కేసీఆర్
హైదరాబాద్: సర్పంచ్ల నుంచి ఐఏఎస్ హోదా ఉండే ఉద్యోగులందరికి మర్రి చెన్నారెడ్డి మావనవనరుల విభాగంలోనే శిక్షణ ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నారు. బుధవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరులు విభాగం కార్యాలయాన్ని కేసీఆర్ సందర్శించడమే కాకుండా పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూసేకరణ కోసం ఐదుగురితో మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ అన్నారు. మెదక్, సిద్దిపేటలో పరిశ్రమలు స్థాపించేందుకు నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ మీడియాకు వెల్లడించారు. కేసీఆర్‌తో ఆస్ట్రేలియా ప్రతినిధులు భేటీ అయిన సంగతి తెలిసిందే. పరిశ్రమలను స్థాపించేందుకు ఆస్ట్రేలియా ప్రతినిధులు ఉత్సాహం చూపినట్టు కేసీఆర్ వెల్డడించారు.