జెడ్పీలో.. రణం
► భూసేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించిన వైఎస్సార్ సీపీ
► జెడ్పీ సమావేశాన్ని బహిష్కరించిన ఆ పార్టీ సభ్యులు
► ల్యాండ్ పూలింగ్‌కు మాత్రమే వ్యతిరేకమని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టీకరణ
► ఇష్టంలేని రైతుల వద్ద నుంచి భూములు తీసుకోవడం దారుణం
► కౌలు రైతులు, రైతుల కూలీలకు ఏం న్యాయం చేస్తున్నారో చెప్పలేదు
► రాజధాని ప్రాంత రైతులకు ఇప్పటికీ రుణమాఫీ చేయలేకపోయారు
► భూసేకరణ ఆర్డినెన్స్, నూతన జీవోను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని పట్టు
► తిరస్కరించిన మంత్రి ప్రత్తిపాటి,జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్
► రైతుల పక్షాన పోరాటం చేస్తామని, జీవో కాపీలను చింపివేసి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయిన వైఎస్సార్ సీపీ సభ్యులు
పాత గుంటూరు : భూ సేకరణ ఆర్డినెన్స్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. ఇందుకు గుంటూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వేదికగా చేసుకుంది. ఆ సమావేశాన్ని బహిష్కరించింది. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి ఇంకా వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ, భూ సేకరణలపైనే చర్చ సాగింది.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మాట్లాడుతూ తాము రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, ల్యాండ్ పూలింగ్ విధానానికి మాత్రమేనని స్పష్టం చేశారు. ఇష్టం ఉన్న రైతులు మాత్రమే భూములు ఇచ్చారని, ఇష్టం లేని రైతుల వద్ద నుంచి ప్రభుత్వం భూములు తీసుకోవాలని చూడడం దారుణమన్నారు. ల్యాండ్‌పూలింగ్‌లో నష్టపోతామని భావించి రైతులు కోర్టును ఆశ్రయిస్తే వారిని బెదిరించేందుకు ప్రభుత్వం 166 జీవోను విడుదల చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు 33,400 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పుకోవడం కాదని, పాలకుల బెదిరింపులకు భయపడి ఇచ్చారనేది కౌలు చెక్కుల పంపిణీలో తేటతెల్లమైందన్నారు. రాజధాని ప్రాంతంలోని రైతు కూలీలకు, వ్యవసాయ వృత్తుల వారికి ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తుందో ఇప్పటివరకు ప్రకటన చేయలేదన్నారు. ఏ స్థితిలో రైతులకు నష్టం జరిగినా వారి తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్స్ ప్రయోగించడం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనా అని ఆర్కే ప్రశ్నించారు.
శాసనసభలో ల్యాండ్‌పూలింగ్ విధానంపై ఓటింగ్ నిర్వహించాలని ైవె ఎస్సార్ సీపీ పట్టుపట్టినా, భయపడిన సీఎం చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ విధానాన్నే ఎంపిక చేసుకున్నారన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసివేయండి, తాము రాజధానికి సహకరిస్తామని ఆయన స్పష్టచేశారు. రాజధాని ప్రాంత రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించినా ఇప్పటికీ మాఫీ చేయకపోవడాన్ని ప్రశ్నించారు.
రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పుకుంటున్న ప్రాంతంలో రాజధాని నిర్మించుకుంటే బాగుంటుందన్నారు. సర్వసభ్య సమావేశంలో భూసేకరణ ఆర్డినెన్స్, నూతన జీవోను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. దీనిని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్‌లు వ్యతిరేకించారు. దీంతో వైఎస్సార్ సీపీ సభ్యులంతా 166 జీవో కాపీలను చింపిచేసి సమావేశాన్ని బహిష్కరించారు.
చిరునవ్వుల మధ్యే చర్చ ....
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సర్వసభ్య సమావేశంలో భూ సేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని కోరగా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తాము రైతులకు న్యాయం చేస్తున్నామనీ, ల్యాండ్ పూలింగ్‌లో రైతులు స్వచ్ఛందంగా 33,400 ఎకరాలు ఇచ్చారనీ, ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. దీంతో మంగళగిరి ఎమ్మెల్యే చిరునవ్వుతో మంత్రి పదవి కోసం పాట్లు ఎందుకన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, రాజేంద్రప్రసాద్‌ల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. మంత్రి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచంలో కెల్లా సుందరమైన రాజధానిని నిర్మించాలని కృషి చేస్తున్నారన్నారు. దీనిపై చర్చ జరుగుతుండగానే ఎమ్మెల్యే ఆర్కే మరోసారి భూ సేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేక తీర్మానం చేయాలని డిమాండ్ చేయడంతో మంత్రి పుల్లారావు సున్నితంగా తిరస్కరించారు. దీంతో వైఎస్సార్ సీపీ సభ్యులంతా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.