ప్రకాశం బ్యారేజీపై కూరగాయలు
పంచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
రైతులతో కలసి రాస్తారోకో,166 జీవో కాపీ దహనం
ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను ప్రతిఘటించి తీరతామని స్పష్టీకరణ
న్యాయం కోసం రైతుల తరఫున కోర్టుకు వెళతామని పునరుద్ఘాటన
తాడేపల్లి (గుంటూరు) : లక్షా 66 వేల జీవోలు తెచ్చినా ప్రతిఘటించి తీరతాం.. మూడు పంటలు పండే భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాం.. అన్నదాతలకు అండగా ఉంటాం.. భూ సమీకరణ, భూ సేకరణ.. ఏదైనా అడ్డుకుంటాం.. చట్టం కాని ఆర్డినెన్స్‌తో, 166 జీవోతో సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే సహించం.. వైఎస్సార్‌సీపీతో నడిచి వచ్చే రాజకీయ పార్టీలతో కలసి, రైతుల పక్షాన పోరాటాలు చేస్తాం.. రాజధాని కోసం ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్స్ ప్రయోగించిన నేపథ్యంలో ఆ ప్రాంత రైతులకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఇచ్చిన భరోసా ఇది.
భూ సేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఆర్కే నేతృత్వంలో సీతానగరం ప్రకాశం బ్యారేజి వద్ద శుక్రవారం రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్కే కూరగాయలు పంచి తన నిరసన వ్యక్తం చేశారు. రైతులు తమ పంట పొలాల నుంచి స్వచ్ఛందంగా తెచ్చిన కూరగాయలను భారీ స్థాయిలో పంచిపెట్టారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. 166 జీవో కాపీని దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పూర్తిగా రైతులను మోసం చేసే విధంగా భూ సమీకరణ, భూ సేకరణ ప్రక్రియలు నిర్వహిస్తోందని విమర్శించారు. బహుళ పంటలు పండే భూములను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోబోనివ్వమని చెప్పారు. భూసేకరణను తీవ్రంగా ప్రతిఘటించి తీరతామన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాతలకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ప్రాంతాల రైతులు, రైతుకూలీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
భూసేకరణపై వినూత్న నిరసన
Published Sat, May 16 2015 5:08 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement