చిలకలూరిపేట ‘సాక్షి’ విలేకరిపై దాడి
♦ కుడి భుజం, ఎడమకాలిపై గాయాలు
♦ పెద్దోళ్లతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని బెదిరించిన దుండగులు
యడ్లపాడు: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ‘సాక్షి’ విలేకరిగా పనిచేస్తున్న మానుకొండ సురేంద్రనాథ్‌పై గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు దాడిచేసి గాయపర్చారు. రాత్రి 7.30 గంటల సమయంలో సురేంద్రనాథ్ విధులు ముగించుకుని స్వగ్రామమైన యడ్లపాడుకు వెళుతూ గ్రామశివారులో కాలకృత్యాలు తీర్చుకునే నిమిత్తం వాహనం ఆపాడు. వెనుక నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు పదునైన ఆయుధంతో ఆయనపై దాడిచేశారు. దీంతో సురేంద్ర కుడి భుజం, ఎడమకాలిపై గాయాలయ్యాయి. పెద్దవాళ్లతో పెట్టుకుంటే పరిణామాలు ఇలానే ఉంటాయని బెదిరించిన దుండగులు.. సురేంద్ర సెల్‌ఫోన్‌లోని మెమొరీకార్డు తీసుకునివెళ్లారు.
అనంతరం సురేంద్ర తన మిత్రుడు రోశయ్యకు ఫోన్ చేసి వివరాలు తెలపడంతో వారు అతడిని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం యడ్లపాడు పోలీసుస్టేషన్‌లో సురేంద్ర ఫిర్యాదు చేశారు. గతంలో తాను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన భార్య చేస్తున్న అవినీతిపై కథనాలు రాసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఘటన సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఇతర నాయకులు యడ్లపాడు ఆస్పత్రికి చేరుకుని సురేంద్రనాథ్‌ను పరామర్శించారు. చిలకలూరిపేట రూరల్ సీఐ దిలీప్‌కుమార్, యడ్లపాడు ఎస్సై ఉమామహేశ్వరరావు ఆసుపత్రికి వెళ్లి దాడి వివరాలను తెలుసుకున్నారు.