పురం.. నేటికీ రణం! | today ysrcp strikes for water | Sakshi
Sakshi News home page

పురం.. నేటికీ రణం!

Published Wed, Apr 19 2017 12:11 AM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM

పురం.. నేటికీ రణం! - Sakshi

పురం.. నేటికీ రణం!

- హిందూపురంలో తగ్గని నీటి కష్టాలు
- పట్టించుకోని పాలకులు, అధికారులు
- నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా


హిందూపురంలో తాగునీటి సమస్య పరిష్కారానికి పాలకులు విఫలమయ్యారు. వేసవి ఆరంభం నుంచి నీటి గండం ముంచుకొస్తోదంటూ పలు దఫాలుగా ప్రతిపక్షం హెచ్చరిస్తున్నా.. ప్రజాప్రతినిధుల్లో చలనం లేకుండా పోయింది. మున్సిపాలిటీ పరిధిలో రోజురోజుకూ ఎక్కువవుతున్న తాగునీటి ఎద్దడి నివారణలో ఎమ్మెల్యే బాలకృష్ణ, మున్సిపాలిటీ పాలక వర్గం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అన్నివార్డులకు ట్యాంకర్ల ద్వారా ఉచిత నీటిని అందిస్తున్నామని మున్సిపల్‌ పాలకులు చెబుతున్నా వాస్తవంగా ఒక రోజు తాగునీటి కోసం హిందూపురం వాసులు రూ. వందల్లోనే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.  ఇంతదారుణమైన తాగునీటి ఎద్దడిని ఈ 30 ఏళ్లలో ఎన్నడూ చూడలేదంటూ స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకుల వైఫలాల్యను ఇంతకాలం ఎండగడుతూ ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ ఎండగడుతూ వచ్చింది. అయినా ఎమ్మెల్యే బాలయ్యలో గాని, మున్సిపల్‌ పాలక వర్గ సభ్యులకు గాని చీమకుట్టినట్లైన లేకపోవడంతో ప్రజలను కలుపుకుని బుధవారం మహాధర్నాకు పిలుపునిచ్చింది.
- హిందూపురం అర్బన్‌

ఒక లక్ష 60వేల జనాభా ఉన్న హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజావసరాలకు రోజుకు దాదాపు పది మిలియన్‌ లీటర్ల నీరు అవసరం. అయితే మున్సిపాలిటీకి ప్రధాన నీటి వనరుగా ఉన్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా రోజుకు మూడు మిలియన్‌ లీటర్ల నీరు కూడా సక్రమంగా అందడం లేదు.  ఇక స్థానికంగా ఉన్న బోరు బావుల నుంచి రెండు మిలియన్‌ లీటర్ల కంటే తక్కువే నీరు లభ్యమవుతోంది. ఇది కూడా రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది.

ప్రజల తరుఫున వైఎస్సార్‌ సీపీ పోరాటాలు
వేసవి ప్రారంభం కాక ముందు నుంచే హిందూపురంను నీటి కష్టాలు వెన్నాడుతున్నాయి. ఇదే విషయంపై ఎప్పటికప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ ఆందోళనలు చేపడుతూ.. సమస్య తీవ్రతను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చింది. పలు దఫాలుగా జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లోనూ నీటి సమస్యపై వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు ప్రస్తావిస్తూ వచ్చారు. అయినా పాలకవర్గంలో చలనం లేకుండా పోయింది. తాగునీటి కష్టాలు తీర్చాలంటూ పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులకు వైఎస్సార్‌ సీపీ నాయకులు వినతిపత్రాలు ఇచ్చారు. రాజకీయ విద్వేషాలతో అవన్నీ బుట్టదాఖలు చేస్తూ వచ్చారు.

కదిలివచ్చిన ప్రజానీకం..
పురం తాగునీటి కష్టాలపై వైఎస్సార్‌ సీపీ సాగిస్తున్న పోరాటాలను ఆది నుంచి గమనిస్తూ వచ్చిన హిందూపురం వాసులు నెమ్మదిగా ఆ పోరాటాలకు మద్దతు పలుకుతూ వచ్చారు. వేసవి ఆరంభం నుంచి ఖాళీ బిందెలతో రోడ్లపైకి చేరుకోవడం మొదలు పెట్టారు. కాలనీలకు కాలనీలు.. వార్డులకు వార్డులు.. తాగునీటి కోసం ఉద్యమ బాట పట్టాయి. ఈ ఏడాది మార్చి 15న ముద్దిరెడ్డిపల్లిలో వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ నాగభూషణరెడ్డి ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై గంటల తరబడి బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళనను సద్దుమణిగించేందుకు చర్చలకు దిగివచ్చిన అధికార, పాలక వర్గ సభ్యులు.. ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీటి కష్టాలు తీరుస్తామంటూ హామీనిచ్చారు. రోజులు గడుస్తున్నా... నేటికీ ట్యాంకర్లు ఆ ప్రాంతంలో కనిపించడం లేదు.  

మున్సిపల్‌ కార్యాలయం ముట్టడించినా..
తాగునీటి సమస్య తీర్చాలంటూ ప్రజల తరుఫున ముందు నుంచి వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌ చేస్తుండడం మున్సిపల్‌ పాలకవర్గానికి సవాల్‌గా మారింది. సమస్య పరిష్కారం కంటే రాజకీయ విద్వేషాలకే పెద్దపీట వేస్తూ వచ్చిన పాలక వర్గ సభ్యులు తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. ఇదే సమయంలో ఈ నెల 1న డీబీకాలనీ మహిళలు సహనం కోల్పోయారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్‌, కౌన్సిలర్‌ నాగభూషణరెడ్డి నేతృత్వంలో బిందెలతో నేరుగా మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నెల 4న ఆటోనగర్‌ వాసులు మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకుని చైర్‌పర్సన్‌ ఆర్‌.లక్ష్మి, అధికారులను నిలదీశారు. తిరిగి ఈ నెల 12న వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు శివ, ఆసీఫ్‌వుల్లా, నాయకులు బాలాజీ, రామాంజిల ఆధ్వర్యంలో ఆర్టీసీ కాలనీ వాసులు ధర్నా చేశారు. 15న కొట్నూరు ప్రజలు ప్రధాన రహదారిపై బిందెలతో బైఠాయించి గంటల తరబడి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. 17న సామాజిక హక్కుల వేదిక నాయకులు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇలా.. ప్రతి గళం తాగునీటి కోసమే నినదించింది.

నేడు వైఎస్సార్‌సీపీ మహాధర్నా
తాగునీటి సమస్యపై అన్ని వార్డుల ప్రజలను కలుపుకుని బుధవారం మహాధర్నా చేపట్టనున్నట్లు వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ మంగళవారం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రజాసమస్యలు ఏమాత్రం పట్టడం లేదని, ఆరు నెలలుగా ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని గుర్తు చేశారు. సినిమా షూటింగ్‌లు, హైదరాబాద్‌కే పరిమితమైన ఆయన ప్రజాసమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement