- హాస్టల్ సమస్యలపై కదలిక
- యుద్ధ ప్రాతిపదికన భవనానికి మరమ్మతులు
- వైఎస్సార్‌సీపీ నేతల సందర్శన, సాక్షి కథనాలతో పరిస్థితుల్లో మార్పు
- 10న వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ముట్టడి తాత్కాలిక వాయిదా
గుంటూరు ఎడ్యుకేషన్ : సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. గుంటూరు జిల్లా కేంద్రంలో శిథిల భవనంలో కొనసాగుతున్న ఎస్సీ బాలుర హాస్టల్‌కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించారు. గత నెల 28వ తేదీన గుంటూరు లాడ్జి సెంటర్లోని మహిమా గార్డెన్స్ ప్రాంగణంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ కాలేజ్ బాయ్స్ హాస్టల్‌ను సందర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అక్కడి విద్యార్థులు అనుభవిస్తున్న కష్టాలను వెలుగులోకి తెచ్చారు. దీంతోపాటు హాస్టల్ దుస్థితిపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలతో జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది.
భవనానికి మరమ్మతులు..
హాస్టల్‌లో నెలకొన్న సమస్యలు ఈనెల 10వ తేదీ లోపు పరిష్కరించకుంటే జిల్లా సంక్షేమ భవన్‌ను ముట్టడిస్తామని వైఎస్సార్‌సీపీ నేతలు విధించిన అల్టిమేటంతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. జేసీ–2 ముంగా వెంకటేశ్వరరావు హాస్టల్‌ను పరిశీలించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు హాస్టల్ నిద్ర ప్రారంభించారు. జిల్లా అధికారులు హాçస్టళ్లలో రాత్రి బస చేయాలని ఆదేశించారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్‌ను కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై చర్చించారు.
ఈ పరిణామాలతో ఉక్కిరి బిక్కిరైన అధికారులు హాస్టళ్లలో సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టారు. ప్రభుత్వంలో వచ్చిన కదలిక, హాస్టల్ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఈనెల 10వ తేదీన చేపట్టిన సంక్షేమ భవన్ ముట్టడిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తాత్కాలికంగా వాయిదా వేశారు.