సాక్షి, అమరావతి: చంద్రబాబు శవ రాజకీయాలను తన కుమారుడు లోకేశ్‌కు అప్పగించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున విమర్శించారు. గుంటూరులో రమ్య మృతదేహాన్ని తరలించకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడం దారుణమన్నారు. దళిత యువతి రమ్య హత్య గురించి తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి చర్యలు తీసుకున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్ కోసం టీడీపీ నాయకులు మృతురాలు ఇంటివద్ద వీరంగం చేశారన్నారు. అక్కడ కూడా లోకేష్ రాజకీయం వదల్లేదని చెప్పారు. రమ్య ఇంటిదగ్గర ధర్నా ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఎస్సీ అమ్మాయి చనిపోతే అక్కడ పేలాలు ఏరుకోవాలని చూస్తారా? అంటూ నిలదీశారు.
బాధితులకు సాయం చేయకపోగా ధర్నాలు చేయించి రాజకీయం చేస్తారా? అని ప్రశ్నించారు. లోకేశ్ అసభ్యంగా మాట్లాడారని, వైఎస్సార్‌సీపీ నా కొడుకులు అని కామెంట్ చేశాడని చెప్పారు. తమకు విచక్షణ ఉంది కాబట్టే ఏమీ చేయకుండా వదిలేశామన్నారు. సీఎం జగన్‌పైనా లోకేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. లోకేశ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, పద్ధతి మార్చుకోవాలని సూచించారు. లేకపోతే బుద్ధిచెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డను సీఎం జగన్ తన కుటుంబసభ్యులుగానే చూస్తారన్నారు. అందుకే వారి రక్షణ కోసం దిశ వంటి చట్టం తీసుకొచ్చి, పలు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మరోవైపు టీడీపీ తరఫున వచ్చిన అడ్వకేట్ శ్రావణ్‌కుమార్ దిశ చట్టం గురించి మాట్లాడితే, దానికి తాను సమాధానం చెప్పానని, దాన్ని కూడా ఏబీఎన్ చానల్ వక్రీకరించిందని ఆయన మండిపడ్డారు.
లోకేశ్‌పై పోలీసులకు మేరుగ ఫిర్యాదు
గుంటూరు ఈస్ట్: ప్రేమోన్మాది దాడిలో హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య నివాసం వద్ద సోమవారం టీడీపీ నాయకుడు లోకేశ్ తనను, దళితులను నిందించారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మంగళవారం గుంటూరు ఈస్ట్ డీఎస్పీ సీతారామయ్యకు ఫిర్యాదు చేశారు. లోకేశ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ అంబేడ్కర్ భావాజాలంతో ముందుకు నడిచే తనకు లోకేశ్ దుర్భాషలు మనోవేదనను కలిగించాయని చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు షేక్ మహ్మద్ ముస్తఫా, గిరిధర్, నగర మేయర్ కావటి శివనాగమనోహర్‌నాయుడు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాల్‌పురం రాము ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment