సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్టుగా వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, కావాలనే స్కెచ్ వేసి తనపై తప్పుడు ప్రచారం చేశారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి శామీర్‌పేటలోని తన ఇంట్లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ‘‘స్కూటర్‌పై తిరిగిన వాళ్లు వేల కోట్లకు ఎదిగారు. ఒక్క సిట్టింగ్‌లోనే వందలు, వేల కోట్లు సంపాదించే వారు ఎందరో ఉన్నారు. వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చినయ్. నేను నిప్పులాంటి వ్యక్తిని. నా చరిత్ర మీద, ఆస్తులపై విచారణ చేయండి. తప్పు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమే. సీఎస్, విజిలెన్స్ డీజీతో విచారణ చేయించడానికి సీఎం ఆదేశించినట్లు తెలిసింది. వారితోనే కాదు.. సిట్టింగ్ జడ్జితోనూ విచారణ జరిపించి నిజానిజాలు సమాజానికి చెప్పాలి..’’ అని డిమాండ్ చేశారు.
కుట్రకు లొంగిపోయే వ్యక్తిని కాదు..
తాను ఏమీ లేని నాడు కొట్లాడానని, ప్రలోభాలకు గురి చేయాలని చూసినా కొట్లాడానని.. ప్రజల కోసం కొట్లాడటమే తప్ప వెన్నుపోటు తెలియదని మంత్రి ఈటల పేర్కొన్నారు. ఇప్పుడు ఆరోపణలు వచ్చిన భూముల్లో తనకు ఒక్క ఎకరం ఉన్నా షెడ్లు కూలగొట్టి తీసుకోవాలన్నారు. ‘‘రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో ఎన్నో కోట్ల రాయితీలు ఇచ్చారు. నేను ప్రభుత్వం నుంచి 5 పైసలు కూడా తీసుకోలేదు. చిల్లరమల్లర ప్రచారాలకు, కుట్రకు లొంగిపోయే వ్యక్తిని కాదు. నేను ముదిరాజ్ బిడ్డను. చావనైనా చస్తా తప్ప మాట తప్పే మనిషిని కాదు. నన్ను దొర అనడం నీచం. అణచివేతలకు, దొరతనానికి వ్యతిరేకంగా కొట్లాడిన వ్యక్తిని నేను’’ అని ఈటల పేర్కొన్నారు. తాను 1986 నుంచీ పౌల్ట్రీ వ్యాపారం చేస్తున్నానని.. 2007లో ఐదు కోట్లు పెట్టి 2,100 గజాల భూమి కొంటే వివాదంలో పడిందని, ఇప్పటికీ తనకు రాలేదని చెప్పారు. కానీ తన వ్యక్తిత్వాన్ని నాశనం చేసేలా కొందరు విషం చల్లే ప్రచారం చేశారని ఆరోపించారు. ధర్మం తాత్కాలికంగా ఓడిపోయినా.. అంతిమంగా విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు.
హేచరీ విస్తరించాలనుకున్నాం
2016లో జమున హేచరీస్ పేరుతో అచ్చంపల్లి, హకీంపేట గ్రామాల్లో రూ.6లక్షల చొప్పున 40 ఎకరాల భూమి కొని షెడ్లు వేశామని.. తర్వాత ఇంకో ఏడెకరాలు కొనుక్కున్నామని మంత్రి ఈటల చెప్పారు. కెనరా బ్యాంకులో రూ.100 కోట్లు రుణం తీసుకున్నామని, ఆ అప్పు ఇంకా కడుతూనే ఉన్నామని తెలిపారు. ‘‘పౌల్ట్రీ కోసం మరింత భూమి కావాల్సి వచ్చింది. కానీ మా చుట్టుపక్కల అన్నీ అసైన్డ్ భూములున్నాయి. అప్పుడు పరిశ్రమల శాఖకు అప్లికేషన్ పెడితే.. ఇవ్వలేమని చెప్పారు. టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శితో దీనిపై మాట్లాడాను. రాళ్లురప్పలతో కూడిన భూమి అది. 1994లో అసైన్ చేస్తే ఇప్పటికీ ఒక్క ఎకరం కూడా సాగు కాలేదు.
ఆ భూములను ప్రభుత్వం సేకరించి ఇవ్వాలంటే ఆలస్యం అవుతుందని అధికారులు చెప్పారు. అసైనీలు ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగిస్తే.. తొందరగా తీసుకోవచ్చన్నారు. అప్పుడు రైతులతో మాట్లాడి 20–25 ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేశాం. కానీ తర్వాత మా హేచరీస్ విస్తరణ ఆలోచనను పక్కనపెట్టేశాం. ఇప్పటికీ ఆ భూములు వాళ్ల దగ్గరే ఉన్నాయి. ఎమ్మార్వో దగ్గరే కాగితాలున్నాయి. నేను భూములు ఆక్రమించుకున్నానన్న ఆరోపణలు నీచం. 2004 నాటికే రాష్ట్రంలో 10.50 లక్షల కోళ్లున్న పౌల్ట్రీకి ఎదిగిన వాడిని. ఆరు లక్షల లేయర్, 4.5 లక్షల బ్రాయిలర్ కోళ్లు ఉండేవి. 2004 అఫిడవిట్లోనే నా ఆస్తులన్నీ చూపించా. ఒక్క తరంలోనే రూ.వందల కోట్లకు ఎదిగిన వాళ్లు ఉన్నారు. వాళ్లను ఎందుకు అడగరు?’’ అని ఈటల ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment