మహిళలకు ఇచ్చే గౌరవమిదేనా?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ దృశ్యమిది. కిటికీ గోడ అంచున ఒకామె కూర్చొన్నారు చూశారా? ఆమె జిల్లా ప్రథమ పౌరురాలైన జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి. మన ప్రజాప్రతినిధులు ఆమెకిచ్చే గౌరవమిదే. అలాగని అదేమి పా ర్టీ సమావేశం కాదు. అధికారికంగా జరిగిన ప్రెస్‌మీట్. కానీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ వేదికపై ఆశీనులయ్యారు. అదే వేదికను అధికారికంగా పంచుకోవాల్సిన జెడ్పీ చైర్‌పర్సన్ సీటు లేక ఓ మూల కిటికీ గోడపై కూర్చోవల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంకో విశేషమేమిటంటే ఇదే వేదిక పై సీటు లేక మరో మహిళా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కూడా వేదిక దిగువన ఉన్న కుర్చీలో కూర్చొన్నారు. ఇదీ, మన మహిళా ప్రజాప్రతినిధులకిచ్చే గౌరవం.
అట్టడుగు వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించి, గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో రిజర్వేషన్లు ప్రకటిం చారు. ఆ క్రమంలోనే ఎస్టీ రిజర్వుడు కేట గిరీలో శోభా స్వాతిరాణి జెడ్పీ చైర్‌పర్సన్ అయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం అధికారిక సమావేశంలో తొలుత ఆమె ఆశీనులు కా వాలి. టీడీపీ ప్రజాప్రతినిధులు ఆ అవకాశమివ్వలేదు. జెడ్పీ చైర్‌పర్సన్‌కు కనీసం సీటు కేటాయించలేదు. ఇదే వేదికపై టీడీ పీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ కూర్చొన్నారు. కౌన్సిలర్ హోదా గల జగదీష్‌కు ఈ సమావేశంలో కూర్చొనే ప్రొటోకాల్ లేదు. విశేషమేమిటంటే వేదికపై మం త్రి పుల్లారావు ఎడమ వైపున తొలుత ఎ మ్మెల్యేలు కె.ఎ.నాయుడు, బొబ్బిలి చిరంజీవులు కూర్చొన్నారు.
కానీ, జగదీష్ వేదికపైకి వచ్చినప్పుడు బొబ్బిలి చిరంజీవులను ఇటు పిలిచి మధ్యలో కూర్చొన్నారు. ఇది మరింత చర్చకు దారితీసింది. ఇక, సీటు లేక జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి చాలాసేపు నిలుచోవలసి వచ్చింది. ఆ తర్వాత కిటికీ గోడపై కూర్చోవల్సిన దుస్థితి ఎదురైంది. జెడ్పీ చైర్‌పర్సన్‌ను గౌరవించాలన్న ఆలోచన ఏ ఒక్క ప్రజాప్రతినిధికీ రాలేదు. సరికదా కిటికీ గోడపై ఆమె ఇబ్బందికరంగా కూర్చున్నా దయచూపే వారు కరువయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్ పరిస్థితి ఇలా ఉంటే ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఏకంగా వేదిక దిగువన ఉన్న కుర్చీలో కూర్చోవాల్సి వచ్చింది.