కడప అర్బన్: గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు కింద భూమి కోల్పోయిన పేద రైతుకు పరిహారం ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగిని మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వైఎస్సార్ జిల్లాలోని గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు కింద గుర్రంగుంపు తండా వద్ద ఉన్న ఇస్లావత్ కిశోర్‌నాయక్, అతడి అమ్మమ్మల పేరిట ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకుంది. పరిహారం కింద ప్రభుత్వం వారికి రూ.4.22 లక్షలు విడుదల చేసింది.
ఆ డబ్బును తీసుకునేందుకు ప్రాజెక్టు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే వై ప్రమీలమ్మను వారు సంప్రదించారు. దీంతో పరిహారం ఇచ్చేందుకు ఆమె లంచం డిమాండ్ చేశారు. పట్టణంలోని శంకరాపురంలో ఉన్న జీఎన్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో శంకర్‌నాయక్ నుంచి రూ.4 వేలు తీసుకుంటున్న ప్రమీలమ్మను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.