లక్నో: అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం జరిపిన భూ కొనుగోలు వ్యవహారంలో ఆలయ ట్రస్ట్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో రామమందిర్ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో అవినీతి జరిగిందని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు ఆరోపించాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మందిర నిర్మాణం చేపట్టిన ట్రస్ట్ పై ఆరోపణలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్ధలాన్ని అధిక ధరలకు రామ మందిర్ ట్రస్ట్ కొనుగోలు చేసిందని ఎస్పీ, ఆప్‌లు ఆరోపిస్తున్నాయి. 2 కోట్ల రూపాయల విలువైన ఈ స్ధలాన్ని ఏకంగా రూ 18.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని ఆరోపించిన ఆయా పార్టీలు ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీలచే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఇది రాముడి పేరుతో మోసం చేయడమేనన్నారు. సత్యం, న్యాయం అనేవి శ్రీరాముడికి మారుపేరని అంటూ రామ మందిర స్కామ్ హ్యాష్ ట్యాగ్‌తో రాహుల్ సోమవారం ట్వీట్ చేశారు. మందిర ట్రస్ట్ పై భూ కొనుగోలు వ్యవహారంలో వచ్చిన ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేసింది.
श्रीराम स्वयं न्याय हैं, सत्य हैं, धर्म हैं-
— Rahul Gandhi (@RahulGandhi) June 14, 2021
उनके नाम पर धोखा अधर्म है!#राम_मंदिर_घोटाला
ఇదే భూమిని అదే రోజున ఈ డీల్ జరిగిన కొద్ది నిమిషాల కిందటే కుసమ్ పాధక్ అనే వ్యక్తి రవి తివారీ, సుల్తాన్ అన్సారీలకు రూ 2 కోట్లకు విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. తివారీ, సుల్తాన్ ల నుంచి ఇదే భూమిని మందిర ట్రస్ట్ రూ 18.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకుందని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. కాగా ఈ ఆరోపణలను రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment