రూ. 25 కోట్ల స్థలాన్ని గద్దలా తన్నుకుపోయేందుకు ప్లాన్
అభివృద్ధి పేరిట ఎమ్మెల్యే బంధువుల మంత్రాంగం
మార్కెట్‌ను వేరే చోటుకు తరలించేందుకు ప్రణాళికలు
వివాదాలు ఉన్నా.. తనకేం తెలీదంటున్న స్థానిక ఎమ్మెల్యే
అదో పట్టణం.. అందలో ఓ పెద్ద కూడలి.. దాన్ని అనుకొని కూరగాయల మార్కెట్.. విలువైన ఆ మార్కెట్ స్థలంపై బడాబాబు కన్నుపడింది. దాన్ని కబ్జా చేసి అక్కడో బహుళ అంతస్తుల భవనం కట్టాలని ప్లాన్ చేస్తాడు. పాలకులు, అధికారులను మేనేజ్ చేసి మార్కెట్ విధ్వంసానికి కుట్ర పన్నుతాడు. ఇంతలో హీరో ప్రవేశించి విలన్‌ను, రౌడీలను చితక్కొట్టి మార్కెట్‌ను రక్షించేస్తాడు. కొన్నేళ్ల క్రితం వచ్చిన ఓ మెగా సినిమాలోని కుట్ర ఎపిసోడ్ ఇప్పుడు గాజువాకలో వాస్తవరూపం దాలుస్తోంది. పారిశ్రామికంగా ఎంతో ఎదిగిన గాజువాకలో స్థలాలకు ఉన్న గిరాకీని.. ప్రధాన కూడలిలో ఉన్న మార్కెట్ స్థలం విలువను చూసి.. దాన్ని ఎలాగైనా కొట్టేయాలని పెద్దలు పన్నాగం పన్నారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువులే దీన్ని కబళించేందుకు పావులు కదుపుతున్నారు. అధికార, అర్థ బలాన్ని ఉపయోగించి పాతిక కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసే కుట్రకు తెరలేపారు. ఆ కుట్ర ఎపిసోడ్ ఏమిటో చూద్దాం..
విశాఖపట్నం: కొత్త గాజువాక జంక్షన్‌ను అనుకొని కణితి రోడ్డు సర్వే నంబర్ 75/6లో సుమారు 70 సెంట్ల స్థలంలో కూరగాయల మార్కెట్ కొనసాగుతోంది. ఈ స్థలాన్ని ఎన్నో దశాబ్దాల క్రితం సంత కోసం కేటాయించారు. కాలక్రమంలో అది రోజువారీ ప్రధాన మార్కెట్‌గా మారింది. సంత కాస్త మార్కెట్‌గా విస్తరించడం.. షాపుల సంఖ్య బాగా పెరగడంతో ఆ స్థలం తమదని పేర్కొంటూ కసిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ అనే వ్యక్తి మార్కెట్‌లోకి ప్రవేశించారు. అప్పటికే అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులు సదరు కసిరెడ్డితో ఒప్పందం చేసుకుని కొనసాగుతున్నారు. అయితే కొన్నాళ్లకు రెవెన్యూ అధికారులు దీన్ని ప్రభుత్వ స్థలంగా నిర్ధారించారు. ప్రైవేటు ఒప్పందాన్ని రద్దు చేసి మార్కెట్‌ను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కొనసాగించాలని ఆదేశిస్తూ ఆర్సీ నంబర్ 5668/2001 ఎఫ్3 27/3/2001 ప్రొసీడింగ్స్ ద్వారా గాజువాక మున్సిపాలిటీకి ఆ భూమిని బదలాయించారు. ఈ ప్రొసీడింగ్స్‌ను వ్యతిరేకిస్తూ సదరు ప్రైవేట్ వ్యక్తి 7256/2001 నంబరుతో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు దాన్ని ప్రభుత్వ భూమిగానే పరిగణించి కేసును కొట్టేసింది. 2005 నవంబర్‌లో గాజువాక మున్సిపాలిటీ జీవీఎంసీలో విలీనం కావడంతో మార్కెట్ స్థలం కూడా జీవీఎంసీకి దఖలు పడింది. ఇదంతా గతం..
వర్తమానంలోకి వస్తే..
గత పది పదిహేనేళ్లలో పారిశ్రామికంగా గాజువాక ఎంతో అభివృద్ధి చెందింది. అందుకు తగినట్లే ఇక్కబి భూములకు ఎక్కడాలేని గిరాకీ ఏర్పడింది. ధరలూ ఆకాశాన్నంటాయి. ఈ తరుణంలో కీలకమైన కొత్త గాజువాక జంక్షన్‌ను అనుకునే ఉన్న ప్రధాన మార్కెట్ స్థలం ప్రస్తుత తెలుగుదేశం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువులను ఆకర్షించింది. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం సుమారు పాతిక కోట్ల రూపాయల విలువైన ఆ భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్‌ను వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల గాజువాక హౌస్ కమిటీ భూముల క్రమబద్ధీకరణ అంశం తెరపైకి రావడంతో ఆ కుటుంబానికి చెందిన మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ నేతృత్వంలో రాజకీయాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ మార్కెట్‌ను ఎక్కడికి తరలించాలనే విషయమై చర్చ జోరుగా సాగుతున్నట్టు తెలిసింది.
మల్టీలెవల్ మార్కెట్ చేస్తాం:ఎమ్మెల్యే పల్లా
గాజువాక పట్టణం బాగా అభివృద్ధి చెందడంతో కూరగాయల మార్కెట్ స్థలం బాగా ఇరుకైంది. అందుకే దాని స్థానంలో మల్టీ లెవల్ మార్కెట్ కట్టాలని భావిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పారు. అది ఇక్కడే కట్టాలా.. మరో చోట నిర్మించాలా.. అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆ స్థలంపై వివాదాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. తమ బంధువు పల్లా రామాయమ్మ మార్కెట్ స్థలంలో 70 సెంట్లు తమదేనంటూ కోర్టుకు వెళ్లారని, అ కేసు విషయం ఏమైందో కూడా తనకు పెద్దగా తెలియదని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
కబ్జా కుట్రను అధికారులు అడ్డుకోవాలి
గాజువాకలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో కబ్జా కుట్రలు ఎక్కువయ్యాయి. జీవీఎంసీ అధికారులు వెంటనే అప్రమత్తమై మార్కెట్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. వాస్తవానికి ఈ మార్కెట్‌ను వేరే ప్రాంతానికి తరలించడం సాధ్యం కాదు. గతంలో ఎ.వి.భానోజీరావు ఇచ్చిన డాక్యుమెంట్‌లో ఆ స్థలాన్ని మార్కెట్‌గానే పరిగణించారు. అందువల్ల కోర్టులో కూడా ప్రైవేట్ వ్యక్తులకు టైటిల్ నిర్ధారణ కాలేదు. ఒకవేళ టైటిల్ ప్రూవ్ అయినా కూడా మార్కెట్ తరలింపు సాధ్యం కాదు.
-ఎ.జె.స్టాలిన్, సీపీఐ జిల్లా కార్యదర్శి, న్యాయవాది
గాజువాక మార్కెట్‌పై.. రాబంధువులు
Published Fri, Jul 15 2016 2:06 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM
Advertisement
Advertisement