దోచుకోవడానికో ‘పథకం’ | Schemes for robbery | Sakshi
Sakshi News home page

దోచుకోవడానికో ‘పథకం’

Published Wed, Jul 8 2015 4:19 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

దోచుకోవడానికో ‘పథకం’ - Sakshi

దోచుకోవడానికో ‘పథకం’

♦ నిన్న నీరు-చెట్టు అంటూ చెరువులు
♦ నేడు సాగు, మురుగునీటి కాల్వలు
♦ ఈ పనులూ జన్మభూమి కమిటీలకే..
♦ ఉపాధి కోల్పోయిన గుత్తేదారులు
 
 ప్రభుత్వం కాల్వల మరమ్మతులపై దృష్టి సారించింది.. ఈ పనులను జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక తెదేపా నాయకులు, కార్యకర్తలకు పండగే పండగ.. నిన్నటి వరకు నీరు- చెట్టు పథకంలో చెరువుల తవ్వకాలను చేపట్టి లక్షలాది రూపాయలు గడించిన తెలుగు తమ్ముళ్లు.. ప్రస్తుతం సాగు, మురుగునీటి కాల్వల మరమ్మతు పనుల్లో నిమగ్నమౌతున్నారు.. దీంతో ఈ శాఖల్లోని గుత్తేదారులకు పనులు లేకుండా పోయాయి.. జన్మభూమి కమిటీల నుంచి సబ్ కాంట్రాక్ట్‌కు పనులు తీసుకుంటూ, అంచనాలపై 10 శాతం కమీషన్ చెల్లిస్తున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాష్ట్రంలోని నోటిఫైడ్, నాన్‌నోటిఫైడ్ కాల్వల మరమ్మతులను నీరు-చెట్టు పథకంలో చేపట్టాలని రాష్ర్ట ప్రభుత్వం మే 12వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులనూ గ్రామాల్లోని జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నది. దీంతో జలవనరులు, మురుగునీటి శాఖల ఇంజినీర్లు అంచనాలు తయారు చేశారు. ఉత్తర్వులు రావడమే తరువాయి అనే రీతిలో ఈ పనులను జన్మభూమి కమిటీలకు అప్పగించడం ప్రారంభించారు. సాధారణంగా ఏటా కాల్వల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించి వాటిని గుత్తేదారులు, సాగునీటి సంఘాలు, ఆయకట్టు పరిధిలోని రైతులకు అప్పగిస్తుంది.

ఈ ఏడాది అందుకు భిన్నంగా జన్మభూమి కమిటీలకు పూర్తిగా పనులు అప్పగించారు. నీరు-చెట్టు పథకంలోని చెరువుల తవ్వకాలకు క్యూబిక్ మీటరుకు రూ. 29 చెల్లిస్తుంటే, కాల్వల మరమ్మతులకు సైట్‌లోని పరిస్థితులను బట్టి క్యూబిక్ మీటరుకు రూ. 29 కంటే అధికంగా కూడా చెల్లించవచ్చని పేర్కొన్నది. కృష్ణా జిల్లాలోని గుడివాడ డ్రైనేజి డివిజన్, గుంటూరు జిల్లాలోని తెనాలి డివిజన్లు నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ కాల్వల మరమ్మతులకు సుమా రు రూ.13కోట్లు వరకు కేటాయించారు. ఈ మేరకు జన్మభూమి కమిటీలకు ప నులు అప్పగిస్తున్నారు.

చెరువుల తవ్వకాల పనుల్లో పొక్లెయిన్లు పూర్తిగా వినియోగంలో ఉండటంతో ఈ జన్మభూమి కమిటీలు పొక్లెయిన్లును ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. దీంతో వీరికి అప్పగించిన పనులు వర్షాలు కురిసేలోపు పూర్తయ్యే అవకాశాలు కన్పించటంలేదు. కృష్ణా జిల్లాలో 400కాల్వల మరమ్మతులకు రూ.8 కోట్లు కేటాయిస్తే, ఇప్పటివరకు రూ.2కోట్లు విలువైన పనులే పూర్తయ్యాయి. గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ పెద్ద ఎత్తున చెరువుల తవ్వకాలు జరుగుతుండటంతో జన్మభూమి కమిటీలు కాల్వల మరమ్మతుల పట్ల ఆసక్తిచూపడం లేదు. దీనితో రూ.1.50కోట్ల విలువైన పనులే జరిగాయి. మిగిలిన పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇంజినీర్లు చెబుతున్నారు.

 గతంలో కొన్నైనా దక్కేవీ..
 ప్రతి ఏడాది కాల్వల మరమ్మతులకు టెండర్లు ఆహ్వానించడం ఆనవాయితీ. రూ.5 లక్షల్లోపు పనులను సాగునీటి సంఘాలు, ఆయకట్టు పరిధిలోని రైతులకు అప్పగించడం జరుగుతోంది.గుత్తేదారులు టెండర్లలో కొన్నింటిన్నైనా దక్కించుకొని పనులు చేసుకునేవారు. అయితే బాబు అధికారంలోకి వచ్చిన తరువాత జాబు వస్తుందనే ప్రచారానికి భిన్నంగా ఇక్కడి గుత్తేదారులకు పనులు లేకుండా పోయాయి. చెరువుల మరమ్మతులు, తవ్వకాల పనుల పర్యవేక్షణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక డివిజన్  ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్డ్ గుత్తేదారులు చెరువుల తవ్వకాలు, నిర్మాణ పనులు చేస్తుంటారు. ప్రస్తుతం జన్మభూమి కమిటీలకు అప్పగించడంతో స్పెషల్ డివిజన్‌ల్లోని గుత్తేదారులకు పనులు లేకుండా పోయియి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement