పింఛన్ల పంపిణీలో ఎడతెగని జాప్యం...
మచిలీపట్నం : జిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ప్రహసనంగా ముగిసింది. అక్టోబరు రెండో తేదీ నుంచి జన్మభూమి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో పింఛన్లు ఐదు రెట్లు పెంపుదల చేసి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఈ కార్యక్రమం పుణ్యమా అంటూ గత ఐదారు సంవత్సరాలుగా ఏ నెలలోనూ బ్రేక్ పడని పింఛన్ల పంపిణీ ఒక నెల పాటు నిలిచిపోయింది.
గత నెల రెండో తేదీన ప్రారంభమైన జన్మభూమి 11వ తేదీ వరకు జరిగి వాయిదా పడింది. హుదూద్ తుపాను తదితర కారణాలు చూపి అక్టోబరు 31 వరకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. పింఛన్ల సొమ్ము అందుబాటులో లేకపోవడం వల్లే జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేశారనే వాదన అప్పట్లో వినబడింది.
అధికారులు పాలకుల అవతారమెత్తి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తటం ఈ జన్మభూమి విశేషం. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినా మౌలిక అంశంపై దృష్టిపెట్టకుండా, అభివృద్ధి పనుల నిధుల విడుదలపై ఎలాంటి హామీ ఇవ్వకుండా అధికారులు, పాలకులు దాటవేత ధోరణితో ఈ కార్యక్రమాన్ని నడపటంలో తమదైన శైలిలో వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజలు ఏదైనా సమస్యను పరిష్కరించాలని కోరితే మన గ్రామాన్ని, మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని, అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛందంగా సహకారం అందించాలని పాలకులు కొత్త రాగం ఆలపించటం గమనార్హం. పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, పింఛన్ల పంపిణీ, పశు వైద్య శిబిరాలు, సీమంతాలు, అన్నప్రాశనలు ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు.
ప్రజాప్రతినిధులు కానివారు సైతం వేదికలెక్కి ప్రభుత్వ పనితీరుపై ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చి ప్రజల సహనానికి పరీక్ష పెట్టారు. కొంతమంది అధికారులు ఓ అడుగు ముందుకేసి జన్మభూమిలో ఇచ్చిన దరఖాస్తులను నేరుగా ముఖ్యమంత్రి పరిశీలిస్తారని, వాటికి పరిష్కారం దొరుకుతుందని చెప్పటం గమనించదగ్గ అంశం.
పింఛన్ల పంపిణీలో ఎడతెగని జాప్యం...
జన్మభూమి కార్యక్రమంలో పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులను అధికారులు ఏడిపించినంత పనిచేశారు. జిల్లాలో 2.77 లక్షల మంది పింఛను పొందేందుకు అర్హులని జన్మభూమి కార్యక్రమంలో నిర్ధారించిన అధికారులు ఈ నెల 10వ తేదీ వరకు 2.25 లక్షల మందికి మాత్రమే సొమ్ము అందజేశారు.
పింఛన్ల పంపిణీ కూడా ప్రహసనంగానే సాగిందని, ఎన్నాళ్లుగానో పింఛన్లు ఇస్తున్నా.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇస్తున్నట్లుగా ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదనే విమర్శలు వినిపించాయి.
పింఛను మంజూరు పత్రాలు అందజేసే సమయంలో ముఖ్యమంత్రి, స్థానిక మంత్రి, ఎమ్మెల్యే తదితరుల ఫొటోలను ముద్రించిన ప్రత్యేక కవర్లను ఇవ్వటం గమనార్హం.
పింఛన్ల సర్వేలో టీడీపీ నాయకులు, కార్యకర్తలే ప్రముఖ పాత్ర పోషించగా.. అనేకమంది అర్హులకు కూడా జాబితాల్లో చోటు దక్కకపోవడం గమనార్హం.
సెంటు భూమి కూడా లేకపోయినా.. ఐదెకరాల పొలం ఉందంటూ కొంతమందికి, వయసు తేడా ఉందంటూ మరికొందరికి వివిధ రకాల కారణాలతో పింఛన్లు నిలిపివేశారు.
గ్రామానికి పది మంది చొప్పున, పట్టణాల్లో వార్డుకు మరో 10, 12 మంది చొప్పున అర్హులైన వారి పింఛన్లు నిలిపివేయడం గమనార్హం.
పింఛన్లు నిలిచిపోయిన వారంతా అధికారులు, కౌన్సిలర్లు, పంచాయతీ సర్పంచుల చుట్టూ నేటికీ తిరుగుతూనే ఉన్నారు. తమ గోడు వెళ్లబోసుకుంటూనే ఉన్నారు.
4,71,871 దరఖాస్తులు
ఈ నెల 10 వరకు జన్మభూమిలో వివిధ సమస్యలపై 4,71,871 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో పింఛను కోసం వచ్చినవి 47,220.
దరఖాస్తులు తీసుకునే సమయంలోనూ అధికారులు తమదైన శైలిలో వ్యవహరించారు. కార్యక్రమానికి మంత్రి లేదా ఎమ్మెల్యే ఇతర అధికారులు ఎవరైనా వస్తే వారి ప్రసంగాలు పూర్తయ్యేవరకు అర్జీలు స్వీకరించకుండా నిలిపివేశారు.
ఉదయం తొమ్మిది గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించిన అధికారులు మంత్రులు వచ్చేవరకు కార్యక్రమాన్ని ప్రారంభించకుండా సభకు వచ్చిన ప్రజలను అలానే కూర్చోబెట్టడం అనేక ప్రాంతాల్లో జరిగింది.
జన్మభూమి కార్యక్రమంలో గర్భిణులకు సీమంతం పేరుతో వారికి ఇచ్చే పూలు, గాజులు, చీరతో పాటు చంద్రబాబునాయుడు ఫొటో ముద్రించిన పత్రాలు ఇవ్వడం గమనార్హం.
సీమంతం కార్యక్రమానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఏదైనా గ్రామంలో లేదా వార్డులో జన్మభూమి కార్యక్రమం జరిగితే అంగన్‌వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రముఖుల నుంచి చందాలు వసూలు చేసి ఈ తంతు ముగించారు.
పొలం పిలుస్తోంది వల్ల ప్రయోజనం ఉందా...
జన్మభూమి కార్యక్రమంలో ఏర్పాటుచేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో వ్యవసాయాధికారులు రైతులతో కలసి పొలం వద్దకు వెళ్లి, పైరును పరిశీలించి అన్నదాతలకు సూచనలు, సలహాలు అందజేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయాధికారులు మొక్కుబడిగా నిర్వహించడమే తప్ప రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్న దాఖలాలే లేవు.
బడి పిలుస్తోంది కార్యక్రమం కూడా ఇలాగే కొనసాగింది. 14 సంవత్సరాల్లోపు బాలబాలికలంతా తప్పనిసరిగా బడిలోనే ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా ఫలితం శూన్యంగానే మిగిలింది.
ఓ పక్క జన్మభూమి జరుగుతుండగానే చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లలు, బాలకార్మికులు వారిలో పనుల్లో పాల్గొనటం గమనార్హం.
సంచార జాతుల వారిని గుర్తించి వారు ఎక్కడ ఉంటే అక్కడికి సమీపంలోని పాఠశాలలోనే వారి పిల్లలను చేర్పించాల్సి ఉన్నా అటువంటి ప్రయత్నమే జరగకపోవటం గమనార్హం.
జన్మభూమి సభల వద్ద వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ఏఎన్‌ఎంలు, వైద్యుల సమయాన్ని వృథా చేయడమే తప్ప ప్రజలకు పనికొచ్చే మందుబిళ్లలు మాత్రం ఇవ్వలేదనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది.