కటకట!
♦ ఆర్థిక ఇబ్బందుల్లో జిల్లా పరిషత్, వీఎంసీ
♦ జెడ్పీకి గుదిబండగా మారిన పింఛన్లు
♦ కార్పొరేషన్‌కు పెనుభారంగా మారిన అప్పులు
♦ ప్రభుత్వ ఖర్చులూ స్థానిక సంస్థలపైనే..
♦ సర్కారు నుంచి సాయం నిల్
♦ ఆదుకునే ఆలోచన చేయని టీడీపీ ప్రభుత్వం
సాక్షి, విజయవాడ : జిల్లాలోని స్థానిక సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన ఖర్చులను కూడా స్థానిక సంస్థలపై మోపడంతో అవి నిధులు లేక అల్లాడుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా పరిషత్, విజయవాడ నగర పాలకసంస్థల పరిస్థితి దారుణంగా ఉంది. అయినా చేయూతనిచ్చేందుకు టీడీపీ సర్కారు ముందుకురావడం లేదు. కనీసం బకాయిలను కూడా ఇవ్వడంలేదు. దీంతో జిల్లాతోపాటు విజయవాడ నగరంలో అభివృద్ధి పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే...’ అన్నట్లుగా నిలిచిపోయాయి.
జెడ్పీ ఆదాయ వనరులపై వేటు
జిల్లా, మండల పరిషత్‌లలో పనిచేసి రిటైరైన ఉద్యోగులకు పింఛన్లను జిల్లా పరిషత్ కార్యాలయమే ఇవ్వాల్సి వస్తోంది. వాస్తవంగా రాష్ట్రంలోని రెండు, మూడు జిల్లాలు మినహా అన్ని ప్రాంతాల్లో ఈ పింఛన్లను ప్రభుత్వమే భరిస్తోంది. అయితే, మన జిల్లాలో మాత్రం జడ్పీపై భారం మోపుతున్నారు. జిల్లా పరిషత్ ఆదాయం రూ.13 కోట్లు కాగా, ఇందులో సుమారు రూ.5.50 కోట్లు పింఛన్లకే కేటాయించాల్సి వస్తోంది. గతంలో ఇసుక సీనరేజీ కింద జెడ్పీకి ఏటా రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. ఇసుక సీనరేజీని ప్రభుత్వం రద్దు చేయడంతో జెడ్పీ ఈ ఆదాయం కోల్పోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. నోట్ల రద్దు ప్రభావం వల్ల మరో రూ.50 లక్షల వరకు ఆదాయం తగ్గిపోయింది.
భారంగా మారిన గెస్ట్‌హౌస్‌ల నిర్వహణ
విజయవాడ, నూజీవీడు, గుడివాడ, కైకలూరు, మచిలీపట్నంలలో ఉన్న గెస్ట్‌హౌస్‌లు నిర్వహణ జిల్లా పరిషత్‌కు భారంగా మారింది. కరెంటు బిల్లులు, ఇతర చార్జీలు ఎక్కువగానే ఉంటున్నాయి. మహిళా, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు జెడ్పీ తన వాటా చెల్లించాల్సి వస్తోంది. దీంతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. రోడ్లు దెబ్బతిన్నాయని, తాగునీరు అందడం లేదని ప్రజలు ఫిర్యాదు చేసుకున్నా... ఏమీ చేయలేని దుస్థితి ఏర్పడింది.
అప్పుల కుప్పగా కార్పొరేషన్ !
విజయవాడ నగరపాలక సంస్థ అప్పుల కుప్పగా మారింది. వచ్చే ఆదాయానికి చెల్లింపులకు పొంతన లేకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. ముఖ్యంగా గతంలో కార్పొరేషన్ నిర్వహణ కోసం చేసిన అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కలిపి గుదిబండగా మారాయి. నగరపాలక సంస్థ వివిధ ఆర్థిక సంస్థలకు రూ.345 కోట్ల వరకు అప్పు ఉంది. కార్పొరేషన్‌కు ఏడాదికి సుమారు ఐదారు వందల కోట్లు ఆదాయం వస్తోంది. ఇందులో సుమారు రూ.28 కోట్లు బకాయిల వాయిదాలు, వడ్డీలకు చెల్లించాల్సి వస్తోంది. సిబ్బంది జీతాలకు ఏటా రూ.140 కోట్లు వరకు చెల్లించాల్సి ఉంది. వీటితోపాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ రంగాలకు కేటాయించాల్సిన నిధులు, కార్యాలయాల నిర్వహణ వ్యయం కూడా ఎక్కువగానే ఉంటోంది. దీంతో నగరంలో అభివృద్ధికి ఏడాకి కనీసం రూ.50కోట్లు కంటే ఎక్కువ ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం తన వద్ద పెట్టుకుంటోంది. తక్షణమే కార్పొరేషన్‌కు ఇవ్వడం లేదు. దీంతో నగరంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ప్రజలకు రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడం కార్పొరేషన్‌కు భారంగా మారుతోంది.
010 పద్దు వస్తేనే...
నగరపాలక సంస్థ సిబ్బందికి జీతాలను 010 పద్దు కింద రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తే కార్పొరేషన్‌పై రూ.140 కోట్ల భారం తగ్గుతుంది. ఇందుకోసం ఉద్యోగులు ఉద్యమాలు కూడా నిర్వహించారు. అప్పట్లో 010 పద్దు కింద జీతాలు చెల్లిస్తామని చెప్పిన నేతలు... ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడంలేదు.
ప్రజాప్రతినిధుల జోక్యం అవసరం...
జిల్లా, మండల పరిషత్ రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే పింఛన్లు ఇస్తే జెడ్పీపై భారం తగ్గుతుంది. విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యోగులకు కూడా 010 పద్దు కింద వేతనాలు చెల్లిస్తే ఆర్థికంగా ఉపశమనం లభిస్తుంది. అయితే, ఇందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రభుత్వం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. కానీ, విజయవాడ, బందరు లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు నారా లోకేష్, యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుంటే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మరోవైపు జెడ్పీ, కార్పొరేషన్ కూడా తమ ఆస్తులను ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రభుత్వంపై పూర్తిగా ఆధారపడకుండా ఆర్థిక వనరులు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం జెడ్పీ, కార్పొరేషన్ సొమ్మును దుబారా చేయకపోవడం ఉత్తమం.