హైకోర్టు ఆదేశించినా పింఛన్లు ఇవ్వరా?
మండల పరిషత్‌ను ముట్టడించిన
కొట్టిశ, మగ్గూరు బాధిత లబ్ధిదారులు
వంగర: హైకోర్టు ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారుల పింఛన్లు పునరుద్ధరించాల్సిందేనని, లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని బాధిత లబ్ధిదారులు మండల పరిషత్ అధికారులను హెచ్చరించారు. వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కార్యదర్శి ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ ఆధ్వర్యంలో సోమవారం మండల పరిధి కొట్టిశ, మగ్గూరు గ్రామాలకు చెందిన 70 మంది పింఛను బాధితులు మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. రెండు గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులు, తమకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయిండంతో వారికి నాలుగు వారాల్లో పింఛన్లు పునరుద్ధరించాలని నవంబర్ 22న తీర్పు వెలువరించిందని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు మజ్జి కళావతి, గంటా రామ్మోహన్‌నాయుడు, పాలవలస కృష్ణమూర్తి వెల్లడించారు. అయినా అధికార పార్టీ ఒత్తిళ్లకు అధికారులు హైకోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరిస్తున్నార ంటూ సూపరింటెండెంట్ జి.కాశీవిశ్వనాథంను నిలదీశారు. అనంతరం ఆయన చుట్టూ బైఠాయించడంతో గందరగోళం నెలకొంది. దీంతో ఆయన స్పందించి, వెంటనే అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.
వైఎస్‌ఆర్ సీపీ లబ్ధిదారులపై కక్షసాధింపు
గ్రామాల్లో వైఎస్‌ఆర్ సీపీ అభిమానులు, లబ్ధిదారులను టీడీపీ వర్గీయులు టార్గెట్ చేస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కార్యదర్శి ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు గ్రామాలతోపాటు అన్ని గ్రామాల్లో ఇలా అర్హుల పింఛన్లు తొలగించారని ఆరోపించారు. కార్యక్రమంలో కొట్టిశ ఎంపీటీసీ కలమటి వెంకటి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు దత్తి సత్యంనాయుడు, గొట్టాపు సత్యన్నారాయణ,నల్ల సింహాచలం పాల్గొన్నారు.