భద్రత ఉపసంహరణ అన్యాయం
రాజకీయ దురుద్దేశాలతో నిర్ణయం
భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వండి
హైకోర్టులో వై.ఎస్.విజయమ్మ పిటిషన్
హైదరాబాద్: 2004 నుంచి ఉన్న భద్రతను గత నెల 22న ఉపసంహరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ హైకోర్టును ఆశ్రయించారు. తనకున్న 2+2 భద్రతను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆమె బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఏపీ ప్రభుత్వ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్రస్థాయి భద్రతా సమీక్ష కమిటీ, వైఎస్సార్ కడప జిల్లా ఎస్‌పీ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. భద్రత ఉపసంహరణ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. ఉపసంహరణకు ముందు ఎటువంటి నోటీసు కూడా జారీ చేయలేదు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. నాకున్న ప్రాణహానిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా భద్రతను ఉపసంహరించడం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా సామాన్యుల సమస్యలను తీర్చేందుకు ఇరు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంటుంది. నాకున్న ప్రాణహానిని వివరిస్తూ గత నెల 31న ఇంటెలిజెన్స్ అదనపు డీజీకి వినతిపత్రం సమర్పించి, భద్రతను పునరుద్దరించాలని కోరడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. 2004 నుంచి ఉన్న భద్రతను అధికారలోకొచ్చిన మూడు నెలల్లో తొలగించడం వెనుక స్పష్టమైన రాజకీయ దురుద్దేశాలున్నాయి’ అని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వెంటనే తనకు భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు.
ఎస్‌పీ ఉత్తర్వులను రద్దు చేయండి: షర్మిల, అనిల్‌కుమార్ పిటిషన్లు
తమకున్న భద్రతను ఉపసంహరిస్తూ కడప జిల్లా ఎస్‌పీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్‌కుమార్ కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తమకున్న ప్రాణహానిని పట్టించుకోకుండా రాష్ట్ర భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు భద్రతను ఉపసంహరిస్తున్నట్లు పేర్కొంటూ జిల్లా ఎస్‌పీ గత నెల 11న ఉత్తర్వులు జారీ చేశారని, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని వారిద్దరూ కోర్టును కోరారు. విజయమ్మ, షర్మిల, అనిల్ కుమార్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన ఈ మూడు పిటిషన్లు గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.