మొద్దు నిద్ర వదిలించేందుకు...ధర్నాయుధం | YSRCP to hold protests against TDP govt todayPensions | Sakshi
Sakshi News home page

మొద్దు నిద్ర వదిలించేందుకు...ధర్నాయుధం

Published Wed, Nov 5 2014 3:32 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

మొద్దు నిద్ర వదిలించేందుకు...ధర్నాయుధం - Sakshi

మొద్దు నిద్ర వదిలించేందుకు...ధర్నాయుధం

 సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని టీడీపీ నాయకులు అటు రైతులు, ఇటు డ్వాక్రా సంఘాల మహిళల్ని నమ్మబలికారు. ఓట్లు వేశాక కమిటీలు, నిబంధనలు, సర్వేలు, ఆన్‌లైన్ పేరుతో కాలం వెల్లదీస్తోంది. దీంటో అటు రుణమాఫీ జరగక, ఇటు రుణాలు రీషెడ్యూల్ అవక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడిందన్న చందాన సర్కార్ నిర్లక్ష్య వైఖరితో అవస్థలు పడుతున్న రైతులపై హుదూద్ తుపాను పిడుగై పడింది. పంటల ను తుడిచిపెట్టేసింది. బీమా నోచుకోని పరిస్థితి నెల కొంది. రుణాలు రీషెడ్యూల్ కాకపోవడంతో రైతులకు బీమా చేసుకోలేదు. ప్రభుత్వం అందుకు తగ్గ సహాయ సహకారాలు అందించలేదు.
 
 దీంతో రెంటికీ చెడ్డ రేవడిలా రైతుల పరిస్థితి తయారైంది.  జిల్లాలో 3.20 లక్షల మంది రైతులు సుమారు రూ.1157 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. చంద్రబాబు ప్రకటించిన ప్రకారం ఈ మొత్తమంతా రైతులకు మాఫీకావాల్సి ఉంది.కానీ సర్కార్ రోజురోజుకు ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆధార్ కార్డు లేదని 45వేల మంది రైతులను రుణమాఫీ జాబితా నుంచి తొలగించేసింది. ఏదో రకంగా లబ్ధిదారుల కుదించేలా పావులు కదుపుతోంది. అలాగే కుటుంబంలో ఒకరికే అంటూ మెలిక పెట్టింది. దీంతో ఉమ్మడి   కుటుంబంలో కొనసాగుతున్న రైతులంతా నష్టపోయే   పరిస్థితి ఏర్పడింది. ఇన్నీ కొర్రీలు పెట్టినా మాఫీ చేసిందా అంటే అదీ లేదు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తోంది. దీంతో రైతులు వడ్డీ భారాన్ని మోయాల్సి వస్తోంది. వాటిని తీర్చుకోలేక నిలువునా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది.
 
 డ్వాక్రా సంఘాలదీ అదే పరిస్థితి ...
  జిల్లాలో 40 వేల డ్వాక్రా సంఘాలు రూ. 391 కోట్ల మేర రుణాలు తీసుకున్నాయి. మాఫీ విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తూ వచ్చింది. మాఫీ అవుతుందన్న ఆశతో దాదాపు అన్ని సంఘాలూ వాయిదాలు చెల్లించడం మానేశాయి. దీంతో 12 నుంచి 14 శాతం మేర బ్యాంకులు వడ్డీ వేస్తున్నాయి. ఒక్కో సంఘం వడ్డీ రూపంలోనే రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సిన దుస్థితి చోటు చేసుకుంది.  బకాయిలు  చెల్లించినా మాఫీ వర్తిస్తుందని, చెల్లింపులు చేయకపోతే కొత్తగా రుణాలురావని, అదనపు వడ్డీ పడుతుందని ఐకేపీ అధికారుల చేత  గట్టిగా ఒత్తిడి చేయించి  కష్టకాలంలో ముక్కు పిండి వసూలు చేయిస్తోంది.  ఇప్పుడా మహిళలంతా లబోదిబోమంటున్నారు.
 
 పింఛన్లలో రాజకీయ కోత
 పింఛనుదారులను సర్కార్ ఏడిపిస్తోంది. అభాగ్యుల నోటి కాడ కూడును లాగేస్తోంది. ఎన్నికల్లో తమకు సహకరించలేదని, తమ పార్టీ వెంట నడవ లేదన్న అక్కసుతో అర్హులైన వారిని పింఛన్లను తొలగించేస్తోంది. బతికున్నోళ్లను చనిపోయినట్టు, భర్తల డెత్ సర్టిఫికేట్ లేదని వితంతవులను, వయస్సు ను గుర్తించే ధ్రువీకరణ పత్రం లేదని వృద్ధుల పింఛన్లును తీసేస్తోంది. ఈ విషయంలో టీడీపీ నాయకులు అంతా తామై అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో 61వేల మంది పింఛన్లను తీసేసి వారి ఉసురు పోసుకుంటున్నారు.
 
 తుపాను ఎన్యుమరేషన్‌లోనూ అంతే
 హుదూద్ తుఫాన్ బీభత్సంతో జిల్లాలో ప్రతీ ఒక్కరూ ఏదొక రూపంలో నష్టపోయారు. ఇళ్లు, పంటలు దాదాపు నష్టపోయాయి. కానీ, ఎన్యుమరేషన్‌లో వాస్తవాలను గుర్తించడం లేదు. రాజకీయ కోణంలోనే  నష్టపోయిన వారి జాబితాలను తయారు చేస్తున్నారు. విపక్షాలకు చెందిన వారినైతే లెక్కలోకి తీసుకోకుండా, అధికార పక్షానికి చెందిన వారికైతే పెద్ద పీట వేస్తూ ఎన్యుమరేషన్ చేస్తున్నారు. ఇప్పటికీ జిల్లా అంతటా బాధితులు గగ్గోలు పెడుతున్నారు. చివరకు కూలిపోయిన ఇళ్లను, నష్టపోయిన పంటను కూడా చూడడం లేదని, జాబితాలోకి ఎక్కించడం లేదని ఆందోళన చేస్తున్నారు. అధికారుల వద్దకొచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు.
 
 ఇక, ప్రకటించిన పరిహారం కూడా కంటి తుడుపే. జీవితాన్నిచ్చే కొబ్బరి చెట్టు ఒక్కింటికీ రూ.500ఇస్తామని చేతులు దులుపుకొంది. టేకు చెట్టుకెంత అనేదానిపై ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు. మత్స్యకారుల పరిహారం విషయంలోనూ శీతకన్ను వేసింది. 357బోట్లు, వలలు పోయాయి. మరో 351బోట్లు, వలలు దెబ్బతిన్నాయి. ఇంకో 320బోట్లు, వలలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అనేక చేపల చెరువులు ధ్వంస మయ్యాయి. కానీ  నష్టానికి, పరిహారానికి పొంతన లేకుండా ప్రకటనలు చేస్తోంది. దీంతో మత్స్యకారులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఇక పంట నష్టం విషయానికొస్తే 50శాతం, ఆపై నష్టం జరిగితేనే లెక్కలోకి తీసుకుంటామని ఇప్పటికే సర్కార్ ప్రకటించేసింది. దీంతో లక్షలాది మంది రైతులు అన్యాయానికి గురవుతున్నారు.
 
  ఇక, 15,303ఇళ్లకు నష్టం జరిగినట్టు గుర్తించారు. అయినప్పటికీ ఎన్యుమరేషన్‌లో లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఇళ్లు కూలిపోయిన బాధితులు తలదాచుకునే పునరావాస ఏర్పాట్లు కనీసం చేయలేదు. దీంతో వారంతా నరకయాతన అనుభవిస్తున్నారు.ఇక తుపాను ధాటికి ప్రైవేటు ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. వాటికీ ఇంతవరకు అతీగతి లేదు. ఆ దిశగా ఎన్యుమరేషన్ జరగడం లేదు. పరిహారంలో   క్లారిటీ లేదు. రుణమాఫీ,  పింఛన్ల కోత, హుదూద్ తుపాను బాధితుల పరిహారం విషయంలో ప్రజలకు అండగా ఉంటూ, సర్కార్ దమననీతిని నిరసి స్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు బుధవారం జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేపట్టనున్నాయి. ప్రజల మద్దతుతో విజయవంతం చేసేందుకు సన్నద్ధమయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement