17 నాటికి డేటా ఎంట్రీ పూర్తి | CS Shantikumari instructions to district collectors | Sakshi
Sakshi News home page

17 నాటికి డేటా ఎంట్రీ పూర్తి

Published Thu, Jan 4 2024 4:46 AM | Last Updated on Thu, Jan 4 2024 8:48 AM

CS Shantikumari instructions to district collectors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాపాలనలో ప్రజల నుంచి స్వీకరిస్తున్న అభయహస్తం దరఖాస్తుల మొత్తం డేటా ఎంట్రీ ఈనెల 17వ తేదీ నాటికి పూర్తి చేయా లని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహ ణ, దరఖాస్తుల డేటా ఎంట్రీపై జిల్లా కలెక్టర్లతో బుధవారం టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గామ పంచాయతీలు, మున్సిపల్‌ వార్డుల్లో  గ్రామ సభలను ఏవిధమైన ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్లను సీఎస్‌ అభినందించారు.

ఈనెల 6 వ తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి 17 నాటికి పూర్తి చేయాలన్నారు. మండల రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ డేటా ఎంట్రీ చేపట్టాలని, ప్రజాపాలన కార్యక్రమం సూపర్‌వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు.

నేడు టీవోటీలకు శిక్షణ
డేటా ఎంట్రీకి జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర స్థాయిలో ట్రైనీ ఆఫ్‌ ట్రైనర్‌ (టీవోటీ)లకు 4వ తేదీన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ టీవోటీలు జిల్లా స్థాయిలో డేటా ఎంట్రీ ఏవిధంగా చేయా లన్న దానిపై 5న శిక్షణ ఇస్తారని చెప్పారు. డేటా ఎంట్రీ సందర్భంగా దరఖాస్తుదా రుల వివరాల నమోదులో ఆధార్‌ నంబర్, తెల్ల రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకుగాను జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న డీటీపీ ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని, అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్లను నియమించుకోవాలని సీఎస్‌ శాంతికుమారి సూచించారు. 

2వ తేదీ నాటికి 57 లక్షల దరఖాస్తులు
మంగళవారం నాటికి దాదాపు 57 లక్షల దరఖాస్తులు అందాయని సీఎస్‌ తెలిపారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున దరఖాస్తు ఇవ్వని వారు, మరోసారి తిరిగి దరఖాస్తులు ఇవ్వడానికి అవకాశం ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలపాలని కూడా సీఎస్‌ స్పష్టం చేశారు. టెలి కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, జీహెచ్‌ ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్, పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ హనుమంతరావు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement