పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధిత యువతీయువకులు , ఇన్‌సెట్‌లో సతీష్
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్) : డాటా ఎంట్రీ పేరుతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని మోసం చేసిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నగరంలోని ఆర్యనగర్‌కు చెందిన సతీష్‌కుమార్ శెట్టి వినాయక్‌నగర్‌లో గత డిసెంబర్ 13న ఎస్‌కేఎస్ అనే కంపెనీని ఆరంభించాడు. కంపెనీలో బిజ్‌నెస్ ప్రాసెసింగ్, అవుట్‌సోర్సింగ్, ఐటీ సొల్యూషన్ ఆఫ్ లైన్ వర్కింగ్ పని ఉంటుందని యువతకు గాలం వేశాడు. దీంతో నిరుద్యోగులు ఆకర్షితులయ్యారు. వీరే కాదు నిజామాబాద్‌కు చెందిన కొందరు యువకులు హైదరాబాద్‌లో మంచి కంపెనీలలో ఉద్యోగాలు చేసేవారు సైతం అక్కడ మానేసి ఇంటి వద్దనే డబ్బులు మిగులుతాయన్న ఆశకు పోయి ఎస్‌కేఎస్ కంపెనీలో చేరారు. డాటా ఎంట్రీ ఉద్యోగానికి ఒక్కొక్కరి నుంచి రూ.15 నుంచి రూ.20వేలు సతీష్ వసూలు చేశాడు. ఇలా దాదాపు 60 నుంచి 65 మంది యువత బలయ్యారు. అంటే సుమారు రూ.12లక్షలు వసూలు చేశాడు.
నెల తర్వాత డాటా ఎంట్రీ పూర్తిచేశాక జీతం డబ్బులు ఇస్తానని చెప్పడంతో వారు నమ్మి డబ్బులు పెట్టి పనిలో జాయిన్ అయ్యారు. వీరేకాకుండా తన కంపెనీలో పనిచేసేందుకు మరో 60 మందిని నియమించుకున్నాడు. 15 రోజుల శిక్షణాకాలంలో నిత్యం ఒక్కొక్కరికి రూ. 200లు ఉపకార వేతనం చెల్లిస్తామని సతీష్ చెప్పాడు. ఇదిలా ఉండగా శిక్షణ పూర్తి చేసుకున్నవారు తమకు స్టయిఫండ్ డబ్బులు ఇవ్వాలని తరుచుగా సతీష్‌ను అడిగారు. దీంతో డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే ఐపీ పెడుతానని వారిని బెదిరించాడు. దాంతో పనిచేసే వారికి సతీష్ ప్రవర్తనపై అనుమానం కలిగింది. గురువారం ఉదయం సతీష్ కంపనీకి రాకపోవటంతో అనుమానం వచ్చిన వారు ఆయనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దాంతో బాధితులు జరిగిన మోసంపై నాల్గోటౌన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్‌కేఎస్ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు. సతీష్ కోసం ఫోన్ చేయగా స్పందించలేదు. పోలీసులు ఆర్యనగర్‌లో సతీష్ ఉంటున్న నివాసాన్ని కనుగొని అక్కడ అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమ డబ్బులు ఇప్పించాలని, న్యాయం చేయాలని ఎస్‌ఐ శంకర్‌ను కోరారు.
అన్ని మాయ మాటలే..
ఎస్‌కేఎస్ కంపెనీ పేరుతో కార్యాలయాన్ని స్థాపించిన సతీష్ తనది మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ అని కొందరితో, రాయసీమ అని మరికొందరితో చెప్పాడు. అలంపూర్‌లో ట్రస్ట్ ఉందని, ట్రస్ట్‌కు సహాయంగా మీవంతు సహాకారం అందించాలని చెప్పాడు. కంపెనీలో చేరినవారిని నుంచి రూ.100 నుంచి 200 వరకు విరాళాలు సేకరించాడు. తాను క్రెవన్స్ కంపెనీలో రెండు తెలుగు రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూటర్‌నంటూ నమ్మించాడు. తాము మళ్లీ ఉద్యోగం కోసం ఎక్కడ వెతకాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment