కాజీపేట అర్బన్: ఆధునిక యుగంలో పెరుగుతున్న టెక్నాలజీతో పాటు మోసాలు పెరుగుతున్నాయి. ఇందుకు నిదర్శనం డాటా ఎంట్రీ ఉద్యోగాలంటూ.. ఆన్‌లైన్‌లో జీతాలంటూ మోసం చేసి ఓ మాయగాడు రూ.19 లక్షలతో ఉడాయించాడు. హన్మకొండ నక్కలగుట్టలో ఇన్‌ఫోటెక్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ పేరిట డాటా ఎంట్రీ జాబ్స్ అంటూ సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏడాది క్రితం ప్రారంభించాడు వరంగల్‌కు చెందిన ఓ మాయగాడు. ముందుస్తుగా మూడువేల రూపాయాలు చెల్లించి మా సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఓ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తానని, తద్వారా ఇంట్లో నుంచే డాటా ఎంట్రీ పనులు చేస్తూ వారానికి 10వేలకు పైగా సంపాదించవచ్చని నిరుద్యోగులకు వల వేశాడు. మాయగాడి మాటాలకు ఆకర్షితులైన హన్మకొండ కొత్తూరు జెండాకు చెందిన ఇద్దరు నిరుద్యోగ యువకులు తాము డాటా ఎంట్రీ వర్క్స్ చేస్తామంటూ ఓ మధ్యవర్తి ద్వారా సదరు మాయగాడికి పరిచయమయ్యారు. ఇద్దరు యువకులను సదరు మాయగాడు కొంత మొత్తం పెట్టుబడి పెట్టమని తనకు అమెరికా, లండన్, జపాన్‌లతో పాటు వివిధ దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయని వారితో ఎంఓయూ కుదుర్చుకున్నానని నమ్మించాడు. మాయగాడి మాటలకు ఆకర్షితులైన ఇద్దరు మిత్రులు రూ.7లక్షలు అప్పజెప్పారు. తర్వాత వారు దాదాపు 40 మందికి డాటా ఎంట్రీ జాబ్స్ ఇప్పించారు.
రెండు నెలలకు బయటపడిన మోసం...
వారం వారం ఆన్‌లైన్ ద్వారా అకౌంట్‌లో డాటా ఎంట్రీకి సంబంధించిన నగదు వస్తాయని నమ్మించాడు. కానీ రెండు నెలలు గడిచినా ఎలాంటి నగదు అకౌంట్‌లో పడలేదు. అనుమానం వచ్చి ఆరా తీసిన సదరు యువకులు మాయగాడు మోసం చేశాడని పసిగట్టారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. తమ డబ్బులతో పాటు 40మందికి సైతం అకౌంట్‌లో డబ్బులు రాకపోవడాన్ని పసిగట్టి మోసం చేశాడని నిర్ధారించుకున్నారు.
సొత్తుతో పరారీ..
డాటా ఎంట్రీ జాబ్స్ పేరిట నిరుద్యోగుల నుంచి రూ.19లక్షలు వసూల్ చేసిన మాయగాడు రాత్రికి రాత్రే మకాం మార్చేశాడు. అతడి సెల్‌ఫోన్ ఆధారంగా కలకత్తాలో ఉన్నట్లు బాధితులు తెలుసుకున్నారు. కాగా సదరు మాయగాడు తనతో పాటు ఓ మహిళను వెంట తీసుకుని పారిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం అతడి సెల్‌ఫోన్ పని చేస్తుండకపోవడంతో బాధితులు భోరుమంటున్నారు.
పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగులు
ఇంట్లో ఉండే సంపాదించుకోండని, తీరిక సమయాల్లో డాటా ఎంట్రీ పనుల ద్వారా వారం వారం డబ్బులు అంటూ పలువురిని మోసగించి ఇద్దరు యువకుల వద్ద నుంచి రూ.7లక్షలు, మరో 40 మంది నిరుద్యోగులకు సంబంధించిన రూ.12లక్షలతో సదరు మాయగాడు పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు, తమకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment