సంగారెడ్డి మున్సిపాలిటీ: సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన వివరాలను ఈ నెల 8లోగా కంప్యూటర్‌లో ఎంట్రీ చేయాలని జాయింట్ కలెక్టర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మం దిరంలో ఏర్పాటు చేసిన సంబంధిత అధికారుల సమీక్ష సమావేశంలో జేసీ మాట్లాడుతూ, జిల్లాలోని 46 మండలాలకు గాను జహీరాబాద్, కల్హేర్, కోహీర్, నారాయణఖేడ్, న్యాల్‌కల్ మండలాల్లో డాటా ఎంట్రీ మందకొడిగా సాగుతుండటం పట్ల జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
8వ తేదీలోగా డాటా ఎంట్రీ పూర్తి చేయాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అవసరమైతే డాటా ఎంట్రీ ఆపరేటర్‌లను పెంచుకోవడంతో పాటు అధిక సమయాన్ని కేటాయించి పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాషాతో పాటు వివిధ మండలాలకు చెందిన తహశీల్దార్‌లు పాల్గొన్నారు.
డాటా ఎంట్రీని పరిశీలించిన జేసీ
సంగారెడ్డి రూరల్: కంది శివారులోని డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ శరత్ శుక్రవారం పరిశీలించారు. జిల్లాలో 8 లక్షల 65 వేల నివాసాల్లో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సర్వే వివరాలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయాలని ఆదేశించారు. సర్వే వివరాలు అత్యంత ప్రాధాన్యత కలిగినవని, అందుకు డాటా ఎంట్రీలో అప్రమత్తత అవసరమని సూచించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు భోజన సౌకర్యం కల్పించాలన్నారు. జేసీతోపాటు తహశీల్దార్ రాధాబాయి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.