పని ఒత్తిడి కాదు.. రాజకీయ ఒత్తిడే!
శ్రీకాకుళం పాతబస్టాండ్: తొలగింపునకు గురైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల స్థానంలో తాము సూచించిన వారినే నియమించాలని జిల్లా మంత్రి, ప్రభు త్వ విప్‌ల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తుండటంతో గృహనిర్మాణ సంస్థ అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. ఎవరికి వారు తాము చెప్పిన వారికే పోస్టింగులు ఇవ్వాలని పట్టుపడుతుండటంతో ఏం చేయాలో అర్థంకాక గత 40 రోజులుగా నియామక ప్రక్రియ జోలికే అధికారులు వెళ్లడం లేదు. జాప్యం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే.. పని ఒత్తిడి సాకుగా చూపి తప్పించుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ పథకంలో ఇళ్ల నిర్మాణాలనుకూడా చేర్చి పేదలకు పెద్ద ఎత్తున ఇళ్లు మంజూ రు చేశారు. దాంతో గృహ నిర్మాణ సంస్థకు పని భారం పెరిగి అదనపు ఉద్యోగులను నియమిం చారు.
అవుట్ సోర్సింగ్ విధానంలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగులను నియమించారు. ఆవిధంగా అవుట్ సోర్సింగ్ విధానంలోనే జిల్లాలో 97 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు పని చేసేవారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ వీరిని తొలగిస్తూ ఆగస్టు లో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఉద్యోగులు ఉద్యమాలు చేశారు. అధికారులు కూడా.. తొలగింపు వల్ల పనులు కుంటుపడతాయని, సిబ్బంది అవసరం ఉందంటూ ప్రభుత్వానికి నివేదికలు పంపారు. దాంతో దిగివచ్చిన ప్రభుత్వం మండలానికి ఇద్దరు చొప్పున వర్క్ ఇన్‌స్పెక్టర్లను నియమించాలని ఆగస్టు నెలాఖరులో ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలో 38 మం డలాల్లో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 76 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు అవసరమవుతారు. ఇప్పటికే 22 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నందున మిగిలిన 54 మందిని అవుట్ సో ర్సింగ్ పద్ధతిలో నియమించాల్సి ఉంది. విద్యార్హతలతోపాటు గుణగణాలు, గతంలో పని చేసి న వారి పనితీరు ఆధారంగా ఈ నియామకాలు జరపాల్సి ఉండగా.. అవన్నీ పక్కన పెట్టి తాము చెప్పిన వారికే పోస్టులు కట్టబెట్టాలని రాజకీ య ఒత్తిళ్లు పెరగడం.. ఎవరికి వారు తమ మాటే నెగ్గాలని భీష్మించుకోవడంతో గృహనిర్మాణ సంస్థ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై గృహనిర్మాణ సంస్థ పీడీ పి.ఆర్.నర్సింగరావు వద్ద ప్రస్తావించగా పని ఒత్తిడి వల్ల సకాలంలో నియామకాలు చేయలేకపోయామన్నారు. రాజకీయ ఒతి ్తళ్లు లేవని, మరో పది రోజుల్లో నిబంధనల ప్ర కారం నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.