ఎంట్రీ.. ఎంత కష్టమో! | Comprehensive family survey data entry program | Sakshi
Sakshi News home page

ఎంట్రీ.. ఎంత కష్టమో!

Published Sun, Aug 31 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

Comprehensive family survey data entry program

నీలగిరి : సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ కార్యక్రమం చుక్కలు చూపిస్తోంది. ఈ నెల 19వ తేదీన (ఒక్క రోజు) ఇంటింటికీ తిరిగి సేకరించిన కుటుంబ వివరాలను కంప్యూటరీకరించడంలో సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 5వ తేదీ నాటికి మొత్తం కుటుంబ వివరాలు కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాల్సి ఉంది. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం  గడువు కంటే ముందుగానే ఈ డాటా మొత్తాన్ని ఈ నెల 28వ తేదీలోగా పూర్తిచేయాలని నిర్ణయించారు.
 
 కానీ అనేకచోట్ల కావాల్సిన కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడం, డాటా ఎంట్రీ ఆపరేటర్ల కొరతతో ఆలస్యమవుతోంది. దీంతోపాటు తీవ్రమైన విద్యుత్ కోతల కారణంగా సిబ్బంది అనుకున్నంత స్థాయిలో వివరాలు నమోదు చేయలేకపోతున్నారు. పలుచోట్ల కాలేజీల్లో పాతపడిన కంప్యూటర్లను వాడుతుండడం వల్ల డాటా ఎంట్రీ ముందుకు సాగడం లేదు. ప్రధానంగా సర్వే అప్పుడు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేయలేదు. దీంతో ఎంట్రీ సిబ్బంది మళ్లీ ఆయా కుటుంబాలకు ఫోన్‌లు చేసి వివరాలు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో అధికారులు నిర్ణయించిన ప్రకారం ఒక్కో ఆపరేటర్ రోజుకు 60 ఫారాలు కంప్యూటర్‌లో ఎంట్రీ చేయాల్సి ఉండగా..20 నుంచి 30 ఫారాలకు మించి దాటట్లేదు.
 
 గడువులోగా పూర్తయ్యేనా..?
 జిల్లా వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 11,69,690 కుటుంబాల వివరాలు సేకరించారు. దీంట్లో శనివారం సాయంత్రం వరకు అధికారుల ఇచ్చిన సమచారం మేరకు 4,06,394 కుటుంబాల వివరాలను మాత్రమే కంప్యూటర్లలో నమోదు చేశారు. ఇంకా 7,63,296 కుటుంబాల వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం విధించిన గడువు మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. గడువు సమీపిస్తుండడంతో అధికారుల్లో గుబులు రేకెత్తుతోంది. ఎంట్రీ కార్యక్రమం వేగవంతం చేయాలని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా డివిజన్ అధికారులను ఆదేశించినప్పటికీ పూర్తిస్థాయిలో అధికారులు దృష్టి సారించలేకపోతున్నారు.
 
  నల్లగొండ డివిజన్‌లో 2,39,459 కుటుంబాలు సర్వే చేశారు. వీటిల్లో కేవలం 1,07,966 కుటుంబాలకు చెందిన వివరాలను మాత్రమే కంప్యూటర్లలో ఎంట్రీ చేశారు. నల్లగొండ మున్సిపాలిటీలో 53 వేల కుటుంబాలు కాగా ఇప్పటివరకు కేవలం 4 వేల కుటుంబాల వివరాలు మాత్రమే కంప్యూటర్‌లో నమోదు చేశారు. కంప్యూటర్లలో సాంకేతికలోపాలు తలెత్తడం వల్ల ఎంట్రీ ఆలస్యంగా జరుగుతోంది. చర్లపల్లి సమీపంలోని నిట్స్ కాలేజీలో మరో సెంటర్‌ను పెట్టారు. ఇక్కడ 20 కంప్యూటర్ల ద్వారా 40మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ చేస్తున్నారు.
 
 
  భువనగిరి డివిజన్‌లోని సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ చాలా ఆలస్యంగా జరుగుతోంది. ప్రధానంగా సర్వర్ డౌన్ సమస్య అన్నిచోట్లా ఉంది. సర్వర్లు డౌన్ అయితే రెండు గంటల వరకు ఓపెన్ కావడంలేదు. భువనగిరిలోని ఆరోర,  వాత్సల్య, శారద, కేబీఆర్  ఇంజినీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్‌లు, బీబీనగర్‌లోని పాలిటెక్నిక్ కళాశాల, బొమ్మలరామారం మండలం చీకటి మామిడి ప్రొగ్రేస్, భూదాన్‌పోచంపల్లి దేశ్‌ముఖిలోని సెయింట్ మేరి ఇంజినీరింగ్ కళాశాలలో పాత కంప్యూటర్ల వాడకం వ ల్ల సమస్య ఎక్కువగా ఉంది.
 
 దీంతో డాటా ఎంట్రీ చేస్తున్నప్పటికీ ఆప్‌లోడ్ కావడంలేదు. భువనగిరిలో వాత్సల్య, శారదా కళాశాలల్లో పాత కంప్యూటర్లతో డాటా ఎంట్రీ అపరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోజుకు 20 ఫారాలకు మించి ఎంట్రీ చేయడం కష్టంగా ఉంది.  ఇంజినీరింగ్ కళాశాలలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో కరెంట్ కోతలు ఇబ్బందిపెడుతున్నాయి. కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడంతో ఆపరేటర్లు నిరసన తెలిపారు.  మునుగోడు మండలానికి సంబంధించి డాటా ఎంట్రీ చాలా ఆలస్యంగా జరుగుతోంది. ఎన్యుమరేటర్లు పూర్తిస్థాయిలో సర్వే ఫారాలు నింపకపోవడంతో వీఆర్వోలు వివరాలు సేకరించి, ఇచ్చాక డాటా ఎంట్రీ చేస్తున్నారు.
 
  దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా 180 కంప్యూటర్లు, దేవరకొండ నగర పంచాయతీలో 20 వార్డులకు 20 కంప్యూటర్లు ఉపయోగించి డాటా ఎంట్రీ చేస్తున్నారు. కంప్యూటర్ల కొరత, రాత్రి వేళ డాటా ఎంట్రీ చేయడం కోసం ఆపరేటర్లు హాజరవడం లేదు. ఒక్కో ఎంట్రీకి 5 రూపాయలు మాత్రమే ఇస్తుండడంతో ఒక్కో ఆపరేటర్ రోజుకు 50 నుంచి 70 ఫారాలు ఎంట్రీ చేస్తుండగా అతనికి కేవలం రూ.300 కూడా గిట్టుబాటు కావడం లేదు. దీంతో ఆపరేటర్లు ఒక రోజు వచ్చిన వారు మరుసటి రోజు రావడానికి సుముఖత చూపడం లేదు. దీంతో ఆపరేటర్ల కొరత ఎక్కువగా ఉంది.
 
  కోదాడ మున్సిపాలిటీ పరిధిలో సమగ్ర సర్వే ద్వారా మున్సిపల్ అధికారులు మొత్తం 21వేల కుటుంబాలను గుర్తించారు. ఈ వివరాలన్నింటినీ ఐదు రోజులుగా పట్టణ పరిధిలోని క్రాంతి కళాశాల, మండల పరిధిలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటరీకరిస్తున్నారు. అయితే నెట్ నెమ్మదిగా ఉండడంతో పనివేగంగా జరగడం లేదు.
 
  మిర్యాలగూడ  మున్సిపల్ కార్యాలయంలో 14, ఆర్డీఓ కార్యాలయంలో 6 కంప్యూటర్లు ద్వారా డాటా ఎంట్రీ చేస్తున్నారు. 40 మంది ఆపరేటర్లు రెండు షిఫ్ట్‌లుగా పనిచేస్తున్నారు. అనుభవం లేని కంప్యూటర్ ఆపరేటర్ల వల్ల ఇప్పటివరకు కేవలం 2,300 కుటుం బాల వివరాలు మాత్రమే నమోదు చేశారు. శనివారం మ రో 20 కంప్యూటర్లను తెప్పించారు. కానీ డాటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత ఉంది.
 
  సూర్యాపేట మండలం బాలెంల గ్రామ సమీపంలోని అరవిందాక్ష ఇంజినీరింగ్ కళాశాలలో తుంగతుర్తి, తిరుమలగిరి, సూర్యాపేట అర్బన్ కుటుంబాలకు సంబంధించిన వివరాలను కంప్యూటరీకరిస్తున్నారు. ఇందుకు 90 కంప్యూటర్లు అవసరం ఉండగా 52 కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. ఎంట్రీ ఆపరేటర్లను 52 మందిని, 52 మంది నోడల్ ఆఫీసర్లను నియమించారు. వీరు గంటకు ఆరు నుంచి పది కుటుంబాల సర్వే వివరాలను ఎంట్రీ చేస్తున్నారు. విద్యుత్ సమస్య కొంత ఉన్నప్పటికీ ఇన్వర్టర్లు ఉండడంతో కంప్యూటరీకరణ చేయడం పట్ల ఇబ్బంది కలగడం లేదు. కానీ కంప్యూటర్లు సరిపడా లేకపోవడం,  సర్వర్ల సమస్య, ఆపరేటర్లకు అవగాహన లేకపోవడం వల్ల ఎంట్రీ ఆలస్యమవుతోంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement