సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సన్నద్ధం
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ విడుదల
రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం పూర్తి
జిల్లాల్లో కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఈ సర్వేపై రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వం.. సర్వే ఉద్దేశం, లక్ష్యం తదితర అంశాలను వివరిస్తూ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను విడుదల చేసింది.
జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగే ఈ సర్వేకు సంబంధించిన పూర్తిస్థాయి సూచనలను అందులో పొందుపర్చింది. సర్వే రెండు భాగాలుగా సాగుతుంది. మొదటి విభాగం (పార్ట్–1) లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. రెండో విభాగం(పార్ట్–2)లో కుటుంబ వివరాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుంటాయి. ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు కాగా.. మిగతా 19 ఉప ప్రశ్నలు.
ఎంపిక బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియలో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకం. జిల్లాస్థాయి, మండల స్థాయి నోడల్ అధికారుల నియామకం మొదలు, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల గుర్తింపు ప్రక్రియ అంతా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. అదేవిధంగా ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు బ్లాకుల కేటాయింపు బాధ్యత కూడా కలెక్టర్లదే. కిందిస్థాయి అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు సర్వే నిర్వహించాల్సిన తీరు, సమాచార గోప్యత తదితరాలకు సంబంధించిన శిక్షణ కలెక్టర్లే ఇస్తారు.
ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లుగా ప్రభుత్వ ఉద్యోగులనే ఎంపిక చేయాలి. అవసరం ఉన్న చోట మాత్రం సీఆర్‌పీ (కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్), గెస్ట్ టీచర్ల సేవలు వినియోగించుకోవచ్చు. సెన్సెస్ డైరెక్టర్ నుంచి ఎన్యుమరేషన్ బ్యాక్ (ఈబీ) మ్యాపులు తీసుకుని ఆ మేరకు బ్లాకుల విభజన చేయాలి. ఒక ఎన్యుమరేషన్ బ్లాక్‌లో 175 వరకు కుటుంబాలుంటాయి. అంతకంటే ఎక్కువ కుటుంబాలు ఉంటే బ్లాకుల విభజన చేయాలి.
ఎన్యుమరేటర్లు సర్వే పూర్తి చేసిన తర్వాత ఆ సమాచారంలోని 10 శాతం కుటుంబాలను ర్యాండమ్ పద్ధతిలో ఎంపిక చేసి వాటిని సూపర్‌వైజర్లు మరోమారు తనిఖీ చేయాలి. ఎన్యుమరేటర్ పనితీరును ఈ రకంగా అంచనా వేయాలి. జిల్లా నోడల్ అధికారిగా అధనపు కలెక్టర్‌ను నియమించాలి. సర్వే నిర్వహణలో భాగంగా రోజువారీ పురోగతిని ప్రణాళిక శాఖకు ప్రతిరోజు సాయంత్రం 6గంటల లోపు పంపాలి.
Comments
Please login to add a commentAdd a comment