15 రోజుల్లోగా సమగ్ర సర్వే డేటా ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: సమగ్ర ఇంటింటి సర్వే పత్రాల్లోని సమాచారాన్ని కంప్యూటర్లలో నిక్షిప్తం చేసే బాధ్యతను ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారులకు అప్పగించింది. ఈ కంప్యూటర్లలో ప్రతి గ్రామంలో వచ్చిన సర్వే పత్రాలన్నింటినీ డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కంప్యూటర్లలో నమోదు చేయించిన తరువాత ఆ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. ఆ సమాచారం మొత్తం నేరుగా రాష్ట్రస్థాయిలోని వెబ్‌కు చేరుతుంది. ఒకసారి గ్రామ రెవెన్యూ అధికారి గ్రీన్‌సిగ్నల్(ఓకే బటన్ క్లిక్ చేయడం) తరువాత ఆ డేటాలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేకుండా.. లాక్ అయిపోతుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
ప్రతి జిల్లాలోనూ 1,500 నుంచి 2,000 కంప్యూటర్లను అధికార యంత్రాంగం సమకూర్చింది. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఉద్యోగులను దీనికి వినియోగిస్తారని, సరిపోని పక్షంలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించు కుంటారు. పక్షం రోజుల్లోగా ఈ డేటా మొత్తం పూర్తి చేయాలని అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి అధికారులకు, సిబ్బందికి ఆదేశిం చారు. ఎన్యూమన్యూరేటర్లు సర్వే పత్రాల్లో నమోదు చేసిన ప్రతి అంశాన్నీ... ఆన్‌లైన్ ఫారాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు నమోదు చేస్తారు.
ఈ ప్రక్రియలో వీఆర్వోలు ఆ సర్వే పత్రాలను చదువుతుంటే.. డేటా ఎంట్రీ ఆపరేటర్లు కంప్యూటర్లలో ఫీడ్ చేస్తారు. ఇవన్నీ మండల కేంద్రాల్లో చేపట్టనున్నారు. ఒక జిల్లాలో అధికంగా మండలాలుండి, గ్రామాలెక్కువగా ఉంటే.. ఎక్కువ సెంటర్లను ఏర్పాటుచేసి నమోదు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. ఈ సమాచారం మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిగా విభజిస్తారు. రాష్ట్ర అధికారులకు మొత్తం సమాచారం అందుబాటులోకి వస్తే...మండలస్థాయి అధికారులకు మండల వివరాలు, గ్రామస్థాయికి వచ్చేసరికి ఆ గ్రామ సమాచారం మాత్రమే అందుబాటులో ఉండేలా.. విధానాన్ని రూపొందించనున్నారు.
ఆర్థికస్తోమత అంచనాకు..
ప్రస్తుతం నిర్వహించిన సర్వేలోని అంశాల ఆధారంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారిని గుర్తించడానికి ప్రధానంగా ఈ డేటాను వినియోగించనున్నట్లు సమాచారం. భూ వివరాల సేకరణ ద్వారా ఒక రైతుకు వచ్చే వార్షిక ఆదాయం ఎంత అన్నది.. ప్రస్తుతం ఉన్న ప్రామాణికాల ఆధారంగా వార్షిక ఆదాయాన్ని గణి స్తారు.
దీని ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులా.. కాదా? అన్న విషయాన్ని తేల్చనున్నారు. శుక్రవారం నుంచి ఈ కంప్యూటీరకరణను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రధానంగా ఎస్సీల్లో నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత, తరువాత గిరిజనులు, బీసీలకు ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.
కంప్యూటరీకరణ బాధ్యత వీఆర్వోలదే!
Published Fri, Aug 22 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM
Advertisement
Advertisement