వీఆర్వోకు టీడీపీ నాయకుడి హెచ్చరిక
ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరుడినంటూ బెదిరింపులు
పోలీసులను ఆశ్రయించిన వీఆర్వో
శింగనమల: ‘నేను టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి కుడి భుజం. ఎమ్మెల్యే చెప్పి ఉంటేనే ఆ ఇసుక తోలుతున్నాం. అడ్డుకుంటే ఇక నీ ఇష్టం...’ అంటూ ఓ టీడీపీ నాయకుడు... వీఆర్వోను బెదిరించాడు. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బాధిత వీఆర్వో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇందుకు సంబంధించిన వివరాలు... అనంతపురం జిల్లా శింగనమల మండలం సలకంచెర్వు–కొరివిపల్లి మార్గంలోని చీలేపల్లి వంక నుంచి కొన్ని రోజులుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించి టీడీపీ నాయకులు నిల్వ చేసిన ఇసుక డంప్‌లను సీజ్ చేశారు. వాటి పర్యవేక్షణ బాధ్యతను రాచేపల్లి వీఆర్వో నాగేంద్రకు అప్పగించారు.
అయితే, సీజ్ చేసిన ఇసుకను దౌర్జన్యంగా తరలించడానికి ఈ నెల 12న టీడీపీ నాయకులు జేసీబీ, టిప్పరుతో రాగా, వీఆర్వో అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వీఆర్వోకు నార్పల మండలానికి చెందిన టీడీపీ నాయకుడు నరసింహ యాదవ్ ఫోన్ చేసి రెచ్చిపోయాడు. ‘ఎమ్మెల్యే చెప్పి ఉంటేనే ఇసుక తోలుతున్నాం. సీఐకి కూడా ముందే చెప్పాం. సీజ్ చేసిన ఇసుకను తరలించి తీరుతాం.
ఎమ్మెల్యే చెప్పినా లెక్క లేదా? రాత్రికి వచ్చి ఇసుక తరలిస్తాం..’ అని బెదిరించాడు. ‘సీజ్ చేసిన ఇసుకను తరలించడం తప్పు కదా అన్నా’ అని వీఆర్వో చెప్పగా... ‘ఎలా తప్పవుతుంది..? ఈ మాటలన్నీ రికార్డు చేసుకున్నా నాకేమీ ఇబ్బంది లేదు...’ అంటూ నరసింహ యాదవ్ రెచ్చిపోయాడు.
ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో భయాందోళనలకు గురైన వీఆర్వో నాగేంద్ర మండల పోలీసులకు ఫిర్యాదు చేయగా, నరసింహ యాదవ్‌పై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment