
తనయ పదవి.. తల్లి పెత్తనం
నియోజకవర్గంలో వింత పోకడ
బుక్కరాయసముద్రం మండల అధికారులతో ఎమ్మెల్యే తల్లి సమీక్ష
టీడీపీ నాయకులు చెప్పిన పనులు చేయాలంటూ హుకుం
చర్చనీయాంశంగా మారిన అనధికారిక సమావేశం
సాక్షి అనంతపురం జిల్లా: శింగనమల నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి ఒకరైతే.. పెత్తనం మరొకరు చెలాయిస్తున్నారు. నియోజకవర్గ అభివృది, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించడం.. అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం సహజం. అయితే ఇక్కడ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ స్థానాన్ని ఆమె తల్లి బండారు లీలావతి ఆక్రమించారు. అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్నారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తల్లి లీలావతి శుక్రవారం బుక్కరాయసముద్రం మండల అధికారులతో సమావేశం నిర్వహించారు.
మండల పరిషత్ అధికారితో పాటు ఇంజినీర్లు, ఇతర అధికారులు, ఎమ్మెల్యే వర్గీయులైన టీడీపీ నాయకులను పిలిపించారు. అందరినీ దగ్గర ఉండి అధికారులకు పరిచయం చేయించారు. అంతటితో ఆగకుండా ‘మండలంలో మా నాయకులు, కార్యకర్తలు మీ ఆఫీసులకు వస్తుంటారు. వారికి పనులు చేయడంతో పాటు వారు చెప్పిన వారికి మాత్రమే మీరు ప్రభుత్వం తరఫున సేవలందించాల’ని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఎలాంటి పదవీ లేకున్నా అధికారులతో సమావేశాలు నిర్వహించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment