ఆన్‌లైన్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల డేటా ఎంట్రీ
ఆన్‌లైన్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల డేటా ఎంట్రీ
Published Thu, Dec 29 2016 9:24 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
కర్నూలు : పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల భర్తీ కోసం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలు ముగియడంతో ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ ఆదేశాల మేరకు స్థానిక ఏపీఎస్పీ మైదానంలో పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల డేటా ఎంట్రీ కొనసాగుతోంది. పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో 494 మహిళ, పురుష కానిస్టేబుల్ పోస్టులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 14,576 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. సివిల్ ఏఆర్ కానిస్టేబుల్, జైలు వార్డెన్ నియామక దేహదారుఢ్య పరీక్షలు కూడా డిసెంబర్ 20తో ముగిశాయి. ఇందులో 221 పోస్టులకు సుమారు 40,032 దరఖాస్తులు రాగా 11,762 మంది దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. డిసెంబర్ 20తో కార్యక్రమం ముగిసింది. అయితే స్క్రీనింగ్ టెస్టులో ఫెయిలై సందేహాలతో అప్పీల్ చేసుకునే అభ్యర్థులకు రెండవసారి అవకాశం కల్పిస్తూ డిసెంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు.
స్క్రీనింగ్ టెస్టు ప్రక్రియ పూర్తి కావడంతో దరఖాస్తుదారుల డేటా ఎంట్రీ, ఆన్‌లైన్‌లో పొందుపరిచే కార్యక్రమం మొదలెట్టారు. ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించి 220 వివరాలు పొందుపరుస్తున్నారు. జనవరి 22న కానిస్టేబుల్ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించనున్నందునా వారంలోగా ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి అబ్దుల్ సలాం నేతృత్వంలో డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగుతోంది.
కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ విధుల్లో పోలీసు కార్యాలయ సిబ్బంది గత రెండు నెలలుగా ఊపిరి సలపని విధంగా ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసు సిబ్బంది బిల్లుల తయారీలో పూర్తి జాప్యం జరుగుతోంది. సకాలంలో బిల్లులు ట్రెజరీకి చేరకపోవడంతో అందవలసిన సౌకర్యాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనవరి 3 నుంచి రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ఎస్‌ఐ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కర్నూలులోనే నిర్వహిస్తున్నారు. ఎస్‌ఐ అభ్యర్థుల స్క్రీనింగ్ టెస్టుకు కూడా డీపీఓ సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నారు.
జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తూ కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్న కానిస్టేబుళ్లను కూడా జిల్లా కేంద్రానికి రప్పించి డేటా ఎంట్రీకి వినియోగించుకుంటున్నారు. ఆరు జిల్లాలకు సంబంధించిన కానిస్టేబుల్ అభ్యర్థుల డేటా ఎంట్రీని జిల్లాల వారీగా కంప్యూటర్లు ఏర్పాటు చేసి నమోదు చేస్తున్నారు.
Advertisement
Advertisement