physical test
-
డిసెంబర్లో ‘కానిస్టేబుల్’ దేహదారుఢ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు డిసెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర పోలీసు నియామక మండలి (ఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది. 2023, జనవరి 21న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4.59 లక్షల మంది హాజరుకాగా వారిలో 95,208 మంది అర్హత సాధించారు. న్యాయపరమైన అంశాలతో దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ వివాదాలు పరిష్కారం కావడంతో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎల్పీఆర్బీ నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిలో 92,507 మంది దేహదారుఢ్య పరీక్షల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశారని, మిగిలిన వారూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తులు నవంబర్ 11–21 వరకు slprb.ap.gov.in లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పూర్తి వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్లు 9441450639, 9100203323ను సంప్రదించాలని సూచించింది. -
Telangana: గర్భిణీ పోలీసు అభ్యర్థులకు గుడ్‌న్యూస్! నేరుగా మెయిన్స్‌కు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో గర్భవతులు.. కోర్టు ఆదేశాల ప్రకారం ఫిజికల్ ఈవెంట్స్ నుంచి ప్రస్తుతానికి మినహాయింపు తీసుకునే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం గర్భవతులుగా ఉన్నవారు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాకుండా నేరుగా తుది రాత పరీక్ష రాసేందుకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అయితే వారంతా తుది రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన నెల రోజుల లోపు ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొని అర్హత సాధిస్తామంటూ.. టీఎస్ఎల్పీఆర్బీకి రాతపూర్వకంగా అండర్‌టేకింగ్ ఇవ్వాలని సూచించారు. అండర్‌టేకింగ్ ఇవ్వని వారిని తుది పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. దేహదారుఢ్య పరీక్షలు పూర్తైన వెంటనే తుది రాత పరీక్ష దేహదారుఢ్య పరీక్షలు ముగిసిన వెంటనే తుది రాత పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు తుది రాత పరీక్షకు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ ప్రక్రియ ఇప్పటికే 70 శాతం పూర్తయిందని, మరో 8 నుంచి 9 రోజుల్లో వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. పెరిగిన ‘అర్హత’శాతం: ఫిజికల్ ఈవెంట్స్‌లో ఇప్పటివరకు హాజరైన మొత్తం అభ్యర్థుల్లో 54 శాతం మంది వాటిని విజయవంతంగా పూర్తి చేసినట్టు బోర్డు పేర్కొంది. గత రిక్రూట్మెంట్ సందర్భంగా నిర్వహించిన ఫిజికల్ ఈవెంట్స్‌లో 52 శాతం మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించగా, ఈసారి ఆ సంఖ్య పెరిగింది. గతంతో పోలిస్తే ఫిజికల్ ఈవెంట్స్‌ను మరింత సరళతరం చేయడమే ఇందుకు కారణమని శ్రీనివాసరావు తెలిపారు. గతంలో పురుషులకు ఐదు ఫిజికల్ ఈవెంట్స్, మహిళలకు మూడు ఉండగా..ఈసారి అందరికీ మూడు (రన్నింగ్, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్)మాత్రమే ఉన్నాయి. గతంలో పురుషులకు ఛాతీ కొలతలను సైతం తీసేవారు. ఈసారి కేవలం ఎత్తు కొలత డిజిటల్ మీటర్ల ద్వారా తీస్తున్నారు. 70% మందికి పరీక్షలు పూర్తి ఈ నెల 8 నుంచి అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గత 18 పనిదినాల్లో 70 శాతం మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో ఈవెంట్స్ పూర్తి కాగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్ల గొండ, సిద్దిపేటల్లో ఇంకా కొనసాగుతోంది. -
పరుగుకు వేళాయెరా! పోలీసు అభ్యర్థులకు త్వరలో తీపి కబురు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శారీరక పరీక్షలు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న పోలీసు అభ్యర్థులకు త్వరలో తీపి కబురు అందనుంది. పార్ట్–2 శారీరక పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. నవంబరు 25 నాటికి రాష్ట్రంలో వివిధ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల పరిధిలో ఉన్న మైదానాలను శారీరక పరీక్షల కోసం సిద్ధం చేయాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ కమిషనర్లను, మహబూబ్‌నగర్, నల్లగొండ, సంగారెడ్డితోపాటు ఆదిలాబాద్ ఎస్పీలను అప్రమత్తం చేసింది. గతంలో 2018లో నిర్వహించిన తరహాలోనే ఈసారి కూడా అవే మైదానాల్లో నిర్వహించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆసక్తి చూపిస్తోంది. దాదాపు మూడు లక్షల మంది కోసం..! ఈ ఏడాది 16,614 పోలీసు కొలువుల భర్తీ ప్రక్రియను టీఎస్ఎల్ పీఆర్బీ చేపట్టింది. ఇందులో ఎస్సై/తత్సమాన పోస్టులు 587, కానిస్టేబుల్ పోస్టులు 16,027 ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు 2,25,668 మంది హాజరవగా, 1,05,603 మంది అర్హత సాధించారు. ఆగస్టు 28న నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు 6,03,851 మంది పరీక్ష రాయగా.. 1,90,589 మంది అర్హత సాధించారు. ప్రస్తుతం ఎస్సై, కానిస్టేబుళ్లకు కలిపి 2.96 లక్షల మందికిపైగా అభ్యర్థులు పార్ట్–2 కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అక్టోబరు 27 నుంచి నవంబరు 10 వరకు పార్ట్–2 ఈవెంట్ల కోసం టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే పనిలో ఉన్నారు. వీరికి శారీరక పరీక్షలు నిర్వహించే చోట సిబ్బందితోపాటు మౌలిక సదుపాయాలు, ప్రతీ మైదానంలో 50 ఎంబీపీఎస్ సదుపాయంతో ఇంటర్నెట్ వైఫై సదుపాయం కల్పించే పరికరాలను ఇన్స్టాల్ చేసుకోవాలనీ, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు కూడా సిద్ధం చేసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. నవంబరు 25 తరువాతే.. ప్రస్తుతం ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులంతా పార్ట్–2 శారీరక పరీక్షల్లో శ్రమించేందుకు సాధన ముమ్మరం చేశారు. నవంబరు 25 వరకు మైదానాలు సిద్ధం చేసి, తమకు సమాచారం అందించాలన్న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాలను గమనిస్తే.. ఆ తరువాత ఎప్పుడైనా శారీరక పరీక్షలు నిర్వహించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
‘పరుగు’లోనే ఆగిన గుండె
రేగోడ్ (మెదక్)/సంగారెడ్డి మున్సిపాలిటీ: పోలీసు ఉద్యోగంలో చేరాలనుకున్న ఓ గిరిజన విద్యార్థి గుండెపోటుతో దుర్మరణం పాలైన ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా రేగోడ్ మండలం పెద్దతండాకు చెందిన రంజానాయక్, చాందీబాయి దంపతుల రెండో కుమారుడు మహిపాల్ (20) సంగారెడ్డిలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుకుంటూ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగం రెండు మార్కులతో చేజారిపోయింది. గతంలో ఆర్మీ సెలక్షన్‌కు సైతం వెళ్లాడు. ఇదిలా ఉంటే ఎప్పటిలాగే ఆదివారం ఉదయం సంగారెడ్డిలో ఉన్న గ్రౌండ్లో రన్నింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. 108 అంబులెన్స్ వచ్చేసరికే మహిపాల్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త వినగానే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పెద్దతండాకు తీసుకొచ్చారు. మహిపాల్ కుటుంబీకులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఎస్ఐ రాత పరీక్ష వాయిదా పడేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో నిర్వహించబోయే సబ్–ఇన్స్పెక్టర్ రాత పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. మొన్నటిదాకా సాధారణ నిరుద్యోగులు మాత్రమే ఈ విషయంపై పలుమార్లు డీజీపీకి వినతిపత్రాలు సమర్పించారు. ఇపుడు ఇదే విషయంపై సొంత డిపార్ట్మెంట్లోనే తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే డిపార్ట్మెంట్లో ఉన్న పలువురు కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఎస్.ఐ పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. శారీరక పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న వీరంతా ఏప్రిల్ 20న నిర్వహించబోయే రాతపరీక్షలో మంచి మార్కులు సాధించి ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. కానీ ఇదే సమయంలో ఎన్నికలు రావడం, వెంటనే విధులకు రావాలని డీజీపీ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో పరీక్ష రాసే అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. తక్కువ సమయం ఉందంటున్నా.. తెలంగాణలో ఎన్నికలు రావడం, ఇదే సమయంలో ఎస్.ఐ అభ్యర్థులకు రాతపరీక్షలు నిర్వహిస్తుండటం సమస్యకు కారణమవుతోంది. వాస్తవానికి తెలంగాణ 33 జిల్లాల్లో పలు బెటాలియన్లు, పోలీస్స్టేషన్లలో పనిచేస్తోన్న హోంగార్డులు, కానిస్టేబుళ్లలో 30 ఏళ్లలోపు వారు వేలల్లో ఉన్నారు. వీరంతా ఎస్.ఐ ఉద్యోగానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. అసలే వారాంతపు సెలవులు కూడా దొరకని ఉద్యోగం కావడంతో పగలంతా కష్టపడి, ఏరాత్రికో ఇంటికి చేరుకుని దొరికిన సమయంలో చదువుకుంటున్నారు. అయితే, తమ భవిష్యత్తుకు ఇదే ఆఖరు అవకాశమనుకున్న ఇంకొందరు పంచాయతీ ఎన్నికల తరువాత నుంచి విధులకు హాజరుకావడం లేదు. వీరికి ఇప్పటికే ఉన్నతాధికారులు పలుమార్లు నోటీసులు పంపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరికీ సెలవులు ఇవ్వడంలేదని, సిబ్బంది తక్కువగా ఉన్న కారణంగా వెంటనే రిపోర్టు చేయాలని చెబుతున్నారు. ఇదే విషయమై వారి తల్లిదండ్రులకు ఫోన్లో కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. ఏప్రిల్ 1వ తేదీలోగా విధుల్లో చేరాలంటూ వారందరికీ నోటీసుల్లో స్పష్టంచేశారు. సొంత డిపార్ట్మెంటే కరుణించకపోతే ఎలా? డిపార్ట్మెంట్లో చాలామంది హోంగార్డులు, కానిస్టేబుళ్లు ఈసారి ఎలాగైనా ఎస్.ఐ పోస్టు సాధించాలన్న కసితో చదువుతున్నారు. అలాంటిది ప్రిపరేషన్ కోసం సెలవులు ఇవ్వకపోతే ఎలా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పీజీలు, పీహెచ్డీ చేసిన వారు కూడా కానిస్టేబుళ్లు, హోంగార్డులుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగమన్న భరోసాతో జీతం తక్కువైనా పనిచేస్తున్నారు. లేకలేక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు సొంత డిపార్ట్మెంట్ నుంచి సహకారం లేకపోవడం వారిని తీవ్ర వేదనకు గురిచేస్తోంది. మరోవైపు ఏప్రిల్ 14 ఆర్మ్డ్ రిజర్వ్డ్ (ఏఆర్) కానిస్టేబుళ్లకు పదోన్నతికి సంబంధించిన శిక్షణ కూడా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో తమకు చదువుకునేందుకు సమయం లేదని ఏప్రిల్ 11న ఎన్నికలు అప్పటివరకు బందోబస్తు, 14న పదోన్నతి శిక్షణ, 20, 21న ఎస్.ఐ రాతపరీక్షలు ఉండటంతో తమకు తక్కువ సమయం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి కూడా పరీక్షను కనీసం నెలరోజులపాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వయోపరిమితి దాటిపోతున్న నేపథ్యంలో ఎస్.ఐ కావాలని కలలు కంటున్న సిబ్బంది ఆకాంక్షలకు అనుగుణంగా పరీక్షను వాయిదా వేయాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును కోరుతున్నారు. వాయిదాకు బోర్డు ససేమిరా.. ఈ నేపథ్యంలో పోలీసు నియామక బోర్డు మాత్రం పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. ఇప్పటికే శారీరక పరీక్షలను దాదాపుగా పూర్తి చేసిన బోర్డు 2.16 లక్షల మందికి ఫలితాలను ప్రకటించింది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి జాప్యం ఉండదని ఇప్పటికే పలుమార్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. -
22 నుంచి ఎయిర్‌ఫోర్స్ నియామకాలు
సాక్షి, సిద్దిపేట: ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్లు ఈనెల 22 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు ఎయిర్‌ఫోర్స్ అసిస్టెంట్ కమాండర్ నరేంద్ర కుమార్కర్ తెలిపారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో స్థానిక డీఆర్వో చంద్రశేఖర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన అభ్యర్థులకు సిద్దిపేటలోనే నియామకాలు జరుగుతాయని చెప్పారు. దేహదారుఢ్య, రాతపరీక్ష పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. 22, 23 తేదీల్లో 15 జిల్లాల నుంచి వచ్చిన వారికి, 24, 25 తేదీల్లో మిగిలిన 16 జిల్లాల వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే వారు ఉదయం 5 గంటల వరకు చేరుకోవాలన్నారు. 21న ముందస్తుగా ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఇంటర్ బైపీసీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన పురుషులు మాత్రమే అర్హులని వివరించారు. అభ్యర్థులు 1998 జూలై 14 నుంచి 2002 జూన్ 28 మధ్య జన్మించిన వారై ఉండాలన్నారు. 152 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలని తెలిపారు. డిసెంబర్ 22, 23 తేదీల్లో: ఈ నెల 22, 23 తేదీల్లో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, జయశంకర్ భూపాల్పల్లి, మహబూబాబాద్, హైదరాబాద్ జిల్లాలకు, 24, 25ల్లో ఆదిలాబాద్, కొమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జోగుళాంబ గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల వారికి శారీరక, మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటల్లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని వివరించారు. -
ముందే ఫిజికల్ టెస్టులు
సాక్షి, హైదరాబాద్ : పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి యూపీఎస్సీ తరహా నియామక పద్ధతులను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పాటించనుంది. దీనిలో భాగంగా ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్షల తర్వాతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడితే బాగుంటుందన్న నిర్ణయానికి బోర్డు అధికారులు వచ్చినట్లు తెలిసింది. దీనివల్ల మెయిన్స్‌కు వెళ్లే అభ్యర్థుల సంఖ్యపై ముందుగానే స్పష్టత రానుంది. దీంతో కేవలం ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులకే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడితే సరిపోతుందన్న అభిప్రాయానికి బోర్డు వచ్చింది. ఇప్పటికే ఎస్ఐ విభాగంలో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ప్రకటించిన బోర్డు.. ఇక రెండో దశలో ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్షలు నిర్వహించనుంది. దీనివల్ల సమయం ఆదా కావడంతోపాటు శ్రమ కూడా ఉండదని బోర్డు ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో జరిగిన నియామకాల సందర్భాల్లో ఫిజికల్ టెస్టుల కం టే ముందే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టేవారు. కానీ దీనివల్ల లక్షల మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 10 నుంచి 15 రోజుల సమయం పట్టేది. కొత్త విధానంలో మెయిన్స్ అభ్యర్థుల సర్టిఫికెట్లు మాత్రమే పరిశీలిస్తే సరిపోతుందని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎస్ఐ అభ్యర్థులతోపాటు కానిస్టేబుల్ అభ్యర్థులకు కూడా వర్తిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఎస్ఐ కొలువు కోసం ‘ఎత్తు’
– పోలీసులకు చిక్కిన అనంతపురం జిల్లా యువకుడు కర్నూలు : ఎస్ఐ కొలువు కోసం అడ్డదారి తొక్కిన అనంతపురం జిల్లా యువకుడు పోలీసులకు దొరికిపోయాడు. ఈనెల 3 నుంచి స్థానిక ఏపీఎస్పీ మైదానంలో ఎస్ఐ, ఆర్ఎస్ఐ, డిప్యూటీ జైలర్ నియామకాల కోసం దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ‘సీమ’ ప్రాంతానికి చెందిన కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల యువకులు ఎస్ఐ పరుగు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం డీఐజీ రమణకుమార్ పర్యవేక్షణలో జరుగుతున్న స్క్రీనింగ్ టెస్టుకు అనంతపురం జిల్లా గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన హరీష్ హాజరయ్యాడు. ఎత్తు తక్కువగా ఉన్నందున తలపై ఎంసిల్ అతికించుకొని వచ్చాడు. కంప్యూటరైజ్డ్ ఎలక్ట్రానిక్ మెజర్‌మెంటు సిస్టంపై నిలుచోగా ఎత్తు పరిశీలించే కానిస్టేబుళ్లు అతని తలను తడిమి చూడగా తేడా కనిపించింది. అనుమానం వచ్చి పరిశీలించగా వెంట్రుకలకు ఎంసీల్ అంటించినట్లు గుర్తించారు. డీఐజీ తీవ్రంగా పరిగణించి కేసు నమోదుకు ఆదేశించారు. కొలతలు పరిశీలించే సిబ్బందితో ఫిర్యాదు తీసుకొని 4వ పట్టణ సీఐ నాగరాజు రావు కేసు నమోదు చేశారు. యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షల్లో అపశ్రుతి
-
ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షల్లో అపశ్రుతి
కర్నూలు: ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షల్లో విషాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఎస్సై దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన ఓ కానిస్టేబుల్ అస్వస్థతకు గురై మృతిచెందాడు. అనంతపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న బాలాజీ నాయక్ శనివారం కర్నూలులో జరుగుతున్న ఎస్సై దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యాడు. ఈ క్రమంలో అతను అస్వస్థతకు గురై అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతిచెందాడు. -
ఎస్ఐ రాత పరీక్షకు 415 మంది ఎంపిక
కర్నూలు : ఎస్ఐ, ఆర్ఎస్ఐ, జైలు వార్డర్ పోస్టుల నియామకాలకు సంబంధించిన శారీరక కొలతల పరిశీలన, దేహదారుఢ్య పరీక్షల ప్రక్రియ మూడోరోజు కొనసాగింది. కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రక్రియను గురువారం రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు పరిశీలించారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి 415 మంది హాజరయ్యారు. అభ్యర్థుల అర్హత, ధ్రువీకరణ పత్రాల పరిశీలన, వేలి ముద్రల సేకరణ, ఛాతి, ఎత్తు కొలతల పరిశీలన, 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ పరీక్షలను వరుసగా నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచి రాత పరీక్షకు 415 మంది ఎంపికయ్యారు. నిఘా కోసం ప్రతి ఈవెంట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీలు రాజశేఖర్‌రాజు, ఏజీ కృష్ణమూర్తి, వెంకటరమణ, భక్తవత్సలం, సీఐలు, ఎస్ఐలు విధులు నిర్వహించారు. -
ఎస్ఐ ఉద్యోగాలకు రేపటి నుంచి దేహదారుఢ్య పరీక్షలు
– ఫోర్త్‌జోన్ పరిధిలో భర్తీ కానున్న సివిల్, ఏఆర్ ఎస్ఐ పోస్టులు 57 – దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సుమారు 40వేలు – దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులు 10,692 – ఏపీఎస్పీ రెండో పటాలంలో ఈవెంట్స్ – సమయం ఉదయం 5.30 గంటల నుంచి, సాయంత్రం వరకు కర్నూలు: పోలీసు కొలువును సాధించేందుకు జిల్లాలో యువతీ, యువకులు ఉవ్విళ్లూరుతున్నారు. వీరి ఆశలకు తగ్గట్టుగా పోలీస్ శాఖ ఫోర్త్ జోన్ పరిధిలో 57 ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు–17న నోటిఫికేషన్ జారీ చేసింది. పురుష, మహిళ ఎస్ఐ అభ్యర్థులతో పాటు డిప్యూటీ జైలర్లు (పురుషులు), అసిస్టెంట్ మ్యాట్రిన్ (మహిళలు) పోస్టుల నియామకానికి అనుమతించింది. ‘సీమ’ అభ్యర్థులందరికీ ఏపీఎస్పీ మైదానంలో.. రాయలసీమ పరిధిలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన ఎస్ఐ అభ్యర్థులకు జనవరి 3వ తేదీ నుంచి స్థానిక ఏపీఎస్పీ మైదానంలో శరీర కొలతలు, శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ నేతృత్వంలో ఈనెల 12వ తేదీ వరకు ప్రతి రోజు 5.30 గంటల నుంచి సాయంత్రం వరకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. సుమారు 10692 మంది పురుష, మహిళా అభ్యర్థులు హాజరు కానున్నారు. పీఎంటీలో అనర్హత పొందితే 12వ తేదీ అప్పీల్‌కు అవకాశం అభ్యర్థులందరికీ స్క్రీనింగ్ టెస్టుల సమాచారాన్ని అందజేశారు. ఆయా తేదీల్లో ఉదయం పూట ఎత్తు, ఛాతి (పురుషులకు), బరువు (మహిళలకు) కొలతల (పీఎంటీ) పరీక్ష ఉంటుంది. 1600 మీటర్ల పరుగు పరీక్ష కూడా నిర్వహిస్తారు. పీఎంటీలో అనర్హత పొందిన అభ్యర్థులకు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. ఆయా అభ్యర్థులు చివరి రోజు జనవరి 12న డీఐజీ రమణకుమార్‌కు అప్పీలు చేసుకుని మరో సారి పీఎంటీకి హాజరు కావచ్చు. పీఎంటీతో పాటు 1600 మీటర్ల పరుగు పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను, రెండో విడతలో ధ్రువపత్రాలు పరిశీలించి 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ (పీఈటీ) పరీక్షలకు అనుమతిస్తారు. గత ఏడాది నవంబరు 27వ తేదీ అనంతపురం, కర్నూలు కేంద్రాలుగా నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు 10079 మంది పురుషులు, 613 మంది మహిళలు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఎస్ఐ, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మా్యట్రిన్ పోస్టుల్లో ఏదో ఒకదాని కోసమే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 1600 మీటర్ల పరుగుతో పాటు, 100 మీటర్ల పరుగు లేదా, లాంగ్ జంప్ విభాగాల్లో ఏదో ఒక దాంట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఆర్ఎస్ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ పోటీల్లో అర్హత సాధిస్తేనే తదుపరి పరీక్షలకు ఎంపికవుతారు. శరీర కొలతలు, దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 18,19 తేదీల్లో తుది రాత పరీక్ష జరుగుతుంది. -
ఆన్లైన్లో కానిస్టేబుల్ అభ్యర్థుల డేటా ఎంట్రీ
కర్నూలు : పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల భర్తీ కోసం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలు ముగియడంతో ఆన్లైన్లో డేటా ఎంట్రీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ ఆదేశాల మేరకు స్థానిక ఏపీఎస్పీ మైదానంలో పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల డేటా ఎంట్రీ కొనసాగుతోంది. పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో 494 మహిళ, పురుష కానిస్టేబుల్ పోస్టులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 14,576 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. సివిల్ ఏఆర్ కానిస్టేబుల్, జైలు వార్డెన్ నియామక దేహదారుఢ్య పరీక్షలు కూడా డిసెంబర్ 20తో ముగిశాయి. ఇందులో 221 పోస్టులకు సుమారు 40,032 దరఖాస్తులు రాగా 11,762 మంది దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. డిసెంబర్ 20తో కార్యక్రమం ముగిసింది. అయితే స్క్రీనింగ్ టెస్టులో ఫెయిలై సందేహాలతో అప్పీల్ చేసుకునే అభ్యర్థులకు రెండవసారి అవకాశం కల్పిస్తూ డిసెంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. స్క్రీనింగ్ టెస్టు ప్రక్రియ పూర్తి కావడంతో దరఖాస్తుదారుల డేటా ఎంట్రీ, ఆన్లైన్లో పొందుపరిచే కార్యక్రమం మొదలెట్టారు. ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించి 220 వివరాలు పొందుపరుస్తున్నారు. జనవరి 22న కానిస్టేబుల్ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించనున్నందునా వారంలోగా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి అబ్దుల్ సలాం నేతృత్వంలో డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగుతోంది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ విధుల్లో పోలీసు కార్యాలయ సిబ్బంది గత రెండు నెలలుగా ఊపిరి సలపని విధంగా ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసు సిబ్బంది బిల్లుల తయారీలో పూర్తి జాప్యం జరుగుతోంది. సకాలంలో బిల్లులు ట్రెజరీకి చేరకపోవడంతో అందవలసిన సౌకర్యాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనవరి 3 నుంచి రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ఎస్ఐ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కర్నూలులోనే నిర్వహిస్తున్నారు. ఎస్ఐ అభ్యర్థుల స్క్రీనింగ్ టెస్టుకు కూడా డీపీఓ సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తూ కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్న కానిస్టేబుళ్లను కూడా జిల్లా కేంద్రానికి రప్పించి డేటా ఎంట్రీకి వినియోగించుకుంటున్నారు. ఆరు జిల్లాలకు సంబంధించిన కానిస్టేబుల్ అభ్యర్థుల డేటా ఎంట్రీని జిల్లాల వారీగా కంప్యూటర్లు ఏర్పాటు చేసి నమోదు చేస్తున్నారు. -
పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు మరో అవకాశం
– పీఎంటీలో అర్హత పొంది అప్పీల్ చేసుకోని వారికి దేహదారుఢ్య పరీక్షలు కర్నూలు: పీఎంటీలో అర్హత పొంది అప్పీల్ చేసుకోకుండా వెళ్లిపోయిన వారికి మరో అవకాశం కల్పిస్తూ రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు పటాలంలోని బళ్లారి చౌరస్తాలో ఉన్న ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో అప్పీల్ చేసుకుని, హాజరైన వారికి రెండవ అవకాశం ఉండదు. పీఎంటీలో అర్హత పొంది అప్పీల్ చేసుకోని వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల అభ్యర్థులకు కర్నూలులోనే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈవెంట్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు ఆధార్‌కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలపై గజిటెడ్ సంతకం తీసుకుని హాజరు కావాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్ లేని వారిని అనుమతించరు. -
పోలీసు కొలువులకు ముగిసిన దేహదారుఢ్య పరీక్ష
– చివరి రోజు 2,090 మంది హాజరు – రాత పరీక్ష జనవరి 22 కర్నూలు : పోలీసు శాఖలో సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం ముగిశాయి. నవంబర్ మాసంలో పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో 11,762 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. వీరిని రోజుకు వెయ్యి మంది చొప్పున ఆహ్వానించి స్థానిక ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో ఈనెల 8వ తేదీ నుంచి రెండు వారాల పాటు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగాయి. భర్తీ కానున్న 221 పోస్టులు జిల్లా పోలీసు శాఖలో మరో 221 సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ కానున్నాయి. కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈనెల 4వ తేదీతో దేహదారుఢ్య పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో 14,576 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. 494 మహిళా, పురుష కానిస్టేబుళ్ల పోస్టులను రాత పరీక్ష అనంతరం భర్తీ చేయనున్నారు. మూడు అంశాల్లో శారీరక పరీక్షలు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు మూడు అంశాల్లో శారీరక పరీక్షలు నిర్వహించారు. లాంగ్‌జంప్, 100 మీటర్లు, 1600 మీటర్ల పరుగు అంశాల్లో శారీరక పరీక్షలు నిర్వహించారు. ఈ మూడు అంశాల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను ప్రధాన పరీక్ష(మెయిన్)కు ఎంపిక చేశారు. గతంలో పురుష అభ్యర్థులకు 5 కిలోమీటర్ల పరుగు, మహిళలకు 3 కిలోమీటర్ల పరుగు ఉండేది. దాన్ని ప్రభుత్వం రద్దు చేసి ప్రాథమిక పరీక్ష, మెయిన్ పరీక్ష విధానాన్ని తీసుకొచ్చింది. ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన వారికి పోస్టులు కేటాయిస్తారు. పొద్దుపోయేదాకా సాగిన స్క్రీనింగ్ టెస్టు... ఛాతీ, ఎత్తు కొలతలతో పాటు పరుగు పందెం పోటీలను అధికారుల ప్రమేయం లేకుండానే సాంకేతిక పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. ఈనెల 8వ తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 17వ తేదీన వర్షం కారణంగా పరుగు పోటీలకు అంతరాయం ఏర్పడింది. వారితో పాటు గైర్హాజరైన వారందరికీ చివరిరోజు మంగళవారం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2,090 మంది పురుష, మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి పరుగు పోటీలు నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారికి జనవరి 22న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ విజయవాడలో ఉన్నతాధికారుల సమీక్ష సమావేశానికి హాజరైనందున ముగింపు రోజు డీఐజీ రమణకుమార్ దేహదారుఢ్య పరీక్షలను పర్యవేక్షించారు. రెండు వారాల పాటు దేహదారుఢ్య పరీక్షల వద్ద సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఓఎస్డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్‌తో పాటు డీపీఓ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కొనసాగుతున్న దేహదారుఢ్య పరీక్షలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక కోసం అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. వర్షం కారణంతో మంగళవారం పరీక్షలు రద్దయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మళ్లీ పరీక్షలు య«థావిధిగా కొనసాగాయి. ఐదో రోజు మొత్తం 1025 మందికిగాను 455 అభ్యర్థులు ఎంపికయ్యారు. -
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ ఎంపికలో భాగంగా సోమవారం మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. ఉష్ణోగ్రతలు పడిపోయి విపరీతమైన చలి ఉన్నా లెక్క చేయకుండా ఉదయం 5 గంటల నుంచే బెటాలియన్ చేరుకొని ఉత్సాహంగా కనిపించారు. వీరికి అధికారులు నిబంధనలు మేరకు దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించారు. ముందుగా ఎత్తు, చెస్టు కొలతలను తీసుకొని వంద మీటర్లు, 16 వందల మీటర్లు, లాంగ్‌జంప్, హైజంప్ పోటీలను నిర్వహించారు. మొత్తం 1067 మందికిగాను 450 మంది ప్రధాన పరీక్షలకు ఎంపికయ్యారు. సర్టిఫికెట్లు లేకపోవడంతో 150 మందిని వెనక్కి పంపారు. -
మూడో రోజు 791 మంది ఎంపిక
– కొనసాగుతున్న కానిస్టేబుల్ సామర్థ్య పరీక్షలు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల సామర్థ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. మూడో రోజు 791 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఉదయం 5 నుంచి రాత్రి 9.45 గంటల వరకు కొనసాగిన సామర్థ్య పరీక్షలను జిల్లా ఎస్పీ ఆకు రవికృష్ణ స్వయంగా పర్యవేక్షించారు. సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా వ్యవహరించాలని ఆదేశించారు. మొత్తం 1,305 మంది హాజరు కాగా.. సర్టిఫికెట్లు లేకపోవడంతో 150 మందిని వెనక్కు పంపారు. -
రెండోరోజు కొనసాగిన దేహదారుడ్య పరీక్షలు
– 927 మంది హాజరు – 564 మంది మెయిన్స్ ఎంపిక కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శుక్రవారం రెండో రోజు దేహధారుఢ్య పరీక్షలు కొనసాగాయి. జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ పర్యవేక్షణలో అభ్యర్థుల పరుగు, కొలతలు, సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. మొత్తం 927 మంది అభ్యర్థులు హాజరవ్వగా 564 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. సర్టిఫికెట్లు లేకపోవడంతో 136 మంది అభ్యర్థులను వెనక్కి పంపినట్లు అధికారులు తెలిపారు. -
ముగిసిన కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు
– 14,576 మంది రాత పరీక్షకు ఎంపిక కర్నూలు: కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు శనివారం ముగిసాయి. గత నెల 7వ తేదీ నుంచి స్థానిక ఏపీఎస్పీ మైదానంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో ఆరు జిల్లాల అభ్యర్థులు ఈ స్క్రీన్ టెస్టుకు హాజరయ్యారు. మొత్తం 16,363 మంది హాజరు కాగా, ఇందులో 14,576 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. చివరిరోజు శనివారం ఎక్కువమంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. మహిళా, పురుష అభ్యర్థులు కలిపి 1,025 మంది హాజరు కాగా, అందులో 856 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. నెల రోజుల పాటు దేహదారుఢ్య పరీక్షల వద్ద సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, లైజనింగ్ ఆఫీసర్ షరీఫ్, పరిపాలన అధికారి అబ్దుల్ సలాం, సీఐ మధుసూదన్‌రావు, మినిస్టీరియల్ సిబ్బంది, ఈకాప్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
బోల్ట్ కూడా పోలీస్ కాలేడు!
‘కానిస్టేబుల్’ పరుగు పరీక్షలో రాష్ట్ర ప్రభుత్వ విపరీత పోకడ నాలుగు నిమిషాల్లో 1,600 మీటర్లు.. 100 మీటర్లను 10.50 సెకన్లలో పూర్తి చేయాలని నిబంధన పురుషులతో సమానంగా మహిళలకూ పరుగు ‘పరీక్ష’ అంతర్జాతీయ పరుగు పోటీల టైమింగ్‌ను నిర్దేశించడంపై విస్తుపోతున్న క్రీడాపండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు విజయవాడ స్పోర్ట్స్: ఏపీ ప్రభుత్వం ఎస్ఐ, కానిస్టేబుల్ సెలెక్షన్స్ కు నిర్వహించనున్న పరుగు పరీక్షలో ఏ ఒక్కరైనా నిర్దేశించిన సమయంలోగా లక్ష్యాన్ని చేరుకుంటే ఆ అభ్యర్థి కచ్చితంగా ఒలింపిక్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ అంతటి ఫాస్టెస్ట్ రన్నర్ అయ్యి ఉంటారు. ఎవరైనా ఈ ఫీట్ సాధిస్తే మన దేశం అంతర్జాతీయ పోటీల్లో పతకం చేజార్చుకుందనుకోవాలి. ఏపీ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు నిర్దేశించిన ఫిజికల్ టెస్ట్(స్పోర్ట్స్)లో ప్రస్తావించిన నిబంధనలు కంగుతినేలా చేస్తున్నాయి. డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జరగనున్న కానిస్టేబుల్ పోస్టుల ఎంపికలో పరుగు పరీక్షకు ఒలింపిక్స్ టైమింగ్ నిర్దేశించడం చూసిన అభ్యర్థులు విస్తుపోతున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ అత్యుత్సాహాన్ని ప్రదర్శించిందా లేదా అవగాహన లేక నోటిఫికేషన్ విడుదల చేసిందా? అనే అనుమానాన్ని వారు వెలిబుచ్చుతున్నారు. ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్ల టైమింగ్‌లతో పోటీగా.. ఆర్మ్రిజర్వు, ఏపీఎస్పీ విభాగంలో ఎస్ఐ, కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ పోస్టులకు సెప్టెంబరు 17న విడుదల చేసిన నోటిఫికేషన్లో స్పోర్ట్స్ ఈవెంట్ల టైమింగ్‌లను రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశించింది. అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలో భాగంగా లాంగ్ జంప్‌తో పాటు 100 మీటర్లు, 1,600 మీటర్ల రన్నింగ్‌లో క్వాలిఫై కావాలి. ఇందులో నిర్దేశించిన టైమింగ్ లేదా అంతకంటే అత్యుత్తమ ప్రదర్శన చేస్తే ఫుల్ స్కోర్(30 మార్కులు) ఇస్తారు. లేదంటే మార్కులు తగ్గుతూ పోతాయి. 100 మీటర్ల రన్నింగ్‌లో ఫుల్ స్కోర్ సాధించాలంటే ఆ దూరాన్ని పురుషులైతే 10.50 సెకన్లు లేదా ఆ లోపు, మహిళలైతే 13 సెకన్లు లేదా అంతకంటే తక్కువ సమయంలో పూర్తి చేయాలి. అప్పుడే 30 మార్కులు ఇస్తారు. కాగా, రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు దేశ అథ్లెట్ల ఎంపిక కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో ఢిల్లీకి చెందిన ఎండీ అబ్దుల్ నజీబ్ 10.574 సెకన్లలో 100 మీటర్లు పూర్తి చేశాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అంతకన్నా మెరుగైన(10.50 సెకన్ల) టైమింగ్‌ని నిర్దేశించడంపై అభ్యర్థులే కాదు.. క్రీడా పండితులు కూడా విస్తుపోతున్నారు. 1,600 మీటర్లు పూర్తి చేస్తే.. ఒలింపిక్స్ స్వర్ణమే అలాగే గతంలో ఎస్ఐ, కానిస్టేబుల్ సెలెక్షన్స్ లో పురుషులకు 5 కిలోమీటర్లు, మహిళలకు 2.5 కిలోమీటర్ల రన్ నిర్వహించేవారు. ఈ ఏడాది అలా కాకుండా పురుషులకు, మహిళలకు ఒకే రన్నింగ్ ఈవెంట్‌గా 5కేఎం బదులు 1,600 మీటర్ల పరుగు పరీక్ష ఏర్పాటు చేశారు. దీంట్లోనైతే ఏకంగా రియో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన అథ్లెట్‌ను తలదన్నేలా లక్ష్యాన్ని 4 నిమిషాలు, అంతకన్నా తక్కువ సమయంలో పూర్తి చేయాలని నిర్దేశించారు. అప్పుడే ఫుల్ స్కోర్(40 మార్కులు) ఇస్తారు. గతంలో పురుషులకు 5కేఎం రన్, మహిళలకు 2.5కేఎం నిర్దేశించినట్లుగానే.. ఇప్పుడు కూడా పురుషులకు 1,600 మీటర్లు, మహిళలకు 800 మీటర్ల పరుగు పరీక్ష నిర్వహించాలి. ఇలా అయితేనే మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించినట్లు అయ్యేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అలా చేయలేదు. అయితే ఈ ఏడాది జరిగిన రియో ఒలింపిక్స్‌లో 1,500 మీటర్ల దూరాన్ని అమెరికాకు చెందిన మ్యాథ్యూ సెంట్రోవిట్జ్ 3.50 నిమిషాల్లో చేరుకొని స్వర్ణపతకం సాధించాడు. దీని ప్రకారం మ్యాథ్యూ 1,600 మీటర్ల దూరాన్నైతే 4.2 నిమిషాల్లో చేరుకుంటాడు. అది కూడా సింథటిక్ ట్రాక్‌పై, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన షూస్‌తో ఆ టైమింగ్‌లో లక్ష్యాన్ని చేరుకుంటారు. మట్టి ట్రాక్‌లో పరిగెడితే ఈ టైమింగ్‌కు ఎంత మంది చేరుకుంటారనేది ప్రభుత్వానికి, అధికారులకే తెలియాలి. సుమారు లక్షన్నర మంది అభ్యర్థులు ఈవెంట్లలో పాల్గొంటున్నారు. వారంతా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. -
మిషన్ ఎవరెస్ట్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
కర్నూలు(హాస్పిటల్): మిషన్ ఎవరెస్ట్ కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారులు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న 25 మందిలో హాజరైన 18 మంది దరఖాస్తుల పరిశీలన చేశారు. అనంతరం 100 మీటర్ల, 2.4కి.మీల పరుగు పందెంను ఏపీఎస్పీ బెటాలియన్ ఆర్ఐ యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆరోగ్యపరీక్షలను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు పీఎస్ ఉషారాణి బృందం జరిపింది. ఈ సందర్భంగా జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారి షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ జిల్లా నుంచి 10 మందిని ఎంపిక చేసి విజయవాడ/విశాఖ పట్టణం పంపిస్తామన్నారు. అక్కడ వారికి పర్వతారోహణ, ఆరోగ్యపరీక్షలు, క్రమశిక్షణ, ప్రవర్తనలో శిక్షణ ఇస్తారన్నారు. ఆ తర్వాత అన్ని జిల్లాల నుంచి వచ్చిన 130 మందిలో 20 మందిని ఎంపిక చేసి భారత రక్షణ శాఖ ద్వారా హిమాలయ పర్వతాల వద్దకు తీసుకెళ్లి, పర్వతాధిరోహణపై శిక్షణ ఇస్తారన్నారు. ఇందులో ప్రతిభ కనపరిచిన 5గురిని ఎంపిక చేసి ఏప్రిల్-జూన్ మధ్యలో ఎవరెస్ట్ అధిరోహణకు పంపిస్తారని వివరించారు. కార్యక్రమంలో సెట్కూరు మేనేజర్ పీవీ రమణ, శ్రీనివాసగుప్త, నాగరాజు, మొయినుద్దీన్, షబ్బీర్, రత్నమయ్య, ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బంది తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ పరీక్షలు విజయవంతం
ఎస్పీ విక్రమ్‌సింగ్ దుగ్గల్ వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మానం ఆదిలాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పదిహేను రోజులపాటు నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. ఎంపిక ప్రక్రియ క్రమపద్ధతిలో నిర్వహించినందుకు వ్యాయామ ఉపాధ్యాయులకు అభినంధనలు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో వ్యాయామ ఉపాధ్యాయులు జి.మహేశ్, హరిచరణ్, శాస్త్రీ, భూమన్న, నాందేవ్, రవికుమార్, ఎన్.స్వామి, కృష్ణ, సత్యనారాయణ, శబ్బీర్, జె.రవీందర్లను శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. చివరి రాత పరీక్ష కోసం 4221 మంది పురుషులు, 1117 మహిళా అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఈ పరీక్షల నిర్వహణలో కీలక పాత్రపోషించారని తెలిపారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఆధార్‌కార్డు గుర్తింపు ప్రక్రియలో కంప్యూటర్ విభాగం అధికారులు ఎంతో కృషిచేశారని వివరించారు. పోలీసు కార్యాలయ అధికారులు, పోలీసు అధికారులను ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు జీఆర్ రాధిక, విజయ్‌కుమార్, పోలీసు అధికారులు ఉన్నారు. -
పరీక్షలు విజయవంతం
ఎస్పీ విక్రమ్‌సింగ్ దుగ్గల్ వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మానం ఆదిలాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పదిహేను రోజులపాటు నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. ఎంపిక ప్రక్రియ క్రమపద్ధతిలో నిర్వహించినందుకు వ్యాయామ ఉపాధ్యాయులకు అభినంధనలు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో వ్యాయామ ఉపాధ్యాయులు జి.మహేశ్, హరిచరణ్, శాస్త్రీ, భూమన్న, నాందేవ్, రవికుమార్, ఎన్.స్వామి, కృష్ణ, సత్యనారాయణ, శబ్బీర్, జె.రవీందర్లను శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. చివరి రాత పరీక్ష కోసం 4221 మంది పురుషులు, 1117 మహిళా అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఈ పరీక్షల నిర్వహణలో కీలక పాత్రపోషించారని తెలిపారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఆధార్‌కార్డు గుర్తింపు ప్రక్రియలో కంప్యూటర్ విభాగం అధికారులు ఎంతో కృషిచేశారని వివరించారు. పోలీసు కార్యాలయ అధికారులు, పోలీసు అధికారులను ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు జీఆర్ రాధిక, విజయ్‌కుమార్, పోలీసు అధికారులు ఉన్నారు. -
లక్ష్యసాధన కోసం అభ్యర్థులు శ్రమించాలి
ఎంజీఎం : దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ లక్ష్యసాధన కోసం మరింత శ్రమించాల్సి ఉంటుందని వరంగల్ పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు సూచించారు. గురువారం పోలీస్ కానిస్టేబుళ్ల నియామకంలో భాగంగా గతంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు హన్మకొండలోని జేఎన్ఎస్ గ్రౌండ్స్‌లో ఏడో రోజు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ నిత్యం సాధన చేయడం ద్వారా పోలీసు కొలువులు సాధించడం చాలా సులభమవుతుందని సూచించారు. గురువారం 963 మంది అభ్యర్థులు 800 మీటర్ల అర్హత పరీక్షకు హాజరయ్యారు. 172 మంది మహిళా అభ్యర్థులు 100 మీటర్ల పరుగు, షాట్‌పుట్, లాంగ్‌జంప్ అంశాలల్లో పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ యాదయ్య, పరిపాలన విభాగం అధికారి స్వరూపరాణి, ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్దన్, మహేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వరరావు, ఈశ్వర్రావు, రవీందర్రావు, రమేశ్‌కుమార్ పాల్గొన్నారు.