మిషన్ ఎవరెస్ట్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
మిషన్ ఎవరెస్ట్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
Published Tue, Nov 15 2016 11:35 PM | Last Updated on Mon, Aug 20 2018 3:37 PM
కర్నూలు(హాస్పిటల్): మిషన్ ఎవరెస్ట్ కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం ఏపీఎస్‌పీ 2వ బెటాలియన్‌లో జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారులు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న 25 మందిలో హాజరైన 18 మంది దరఖాస్తుల పరిశీలన చేశారు. అనంతరం 100 మీటర్ల, 2.4కి.మీల పరుగు పందెంను ఏపీఎస్‌పీ బెటాలియన్ ఆర్‌ఐ యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆరోగ్యపరీక్షలను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు పీఎస్ ఉషారాణి బృందం జరిపింది. ఈ సందర్భంగా జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారి షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ జిల్లా నుంచి 10 మందిని ఎంపిక చేసి విజయవాడ/విశాఖ పట్టణం పంపిస్తామన్నారు. అక్కడ వారికి పర్వతారోహణ, ఆరోగ్యపరీక్షలు, క్రమశిక్షణ, ప్రవర్తనలో శిక్షణ ఇస్తారన్నారు. ఆ తర్వాత అన్ని జిల్లాల నుంచి వచ్చిన 130 మందిలో 20 మందిని ఎంపిక చేసి భారత రక్షణ శాఖ ద్వారా హిమాలయ పర్వతాల వద్దకు తీసుకెళ్లి, పర్వతాధిరోహణపై శిక్షణ ఇస్తారన్నారు. ఇందులో ప్రతిభ కనపరిచిన 5గురిని ఎంపిక చేసి ఏప్రిల్-జూన్ మధ్యలో ఎవరెస్ట్ అధిరోహణకు పంపిస్తారని వివరించారు. కార్యక్రమంలో సెట్కూరు మేనేజర్ పీవీ రమణ, శ్రీనివాసగుప్త, నాగరాజు, మొయినుద్దీన్, షబ్బీర్, రత్నమయ్య, ఏపీఎస్‌పీ బెటాలియన్ సిబ్బంది తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement