తిరుపతిలోని శంకర్ ఇంట్లో తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు
సాక్షి, అమరావతి/చిత్తూరు అర్బన్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పంతుల శంకర్ నివాసాలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు చేసింది. ఆయన అక్రమాస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదు రావడంతో తూర్పుగోదావరి, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని శంకర్ ఇళ్లు, అతని బంధువుల నివాసాల్లో ఏసీబీకి చెందిన 13 బృందాలు సోమవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ వివరాలను ఏసీబీ ప్రధాన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. శంకర్ 1989 జనవరి 16న పోలీసు శాఖలో చేరాడు.
2001 జూన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా, 2011 జూలైలో డీఎస్పీగా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనపై ఫిర్యాదు రావడంతో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. రూ.88.81 లక్షల విలువైన 3 నివాస గృహసముదాయాలున్నట్లు గుర్తించారు. రూ.32,64,500 విలువైన 9 ఇళ్ల స్థలాలు, రూ.22.51 లక్షల విలువైన 20.98 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.6.57 కోట్ల విలువైన రెండు పౌల్ట్రీ ఫార్మ్‌లు ఉన్నట్లు ఏసీబీ తనిఖీల్లో తేలింది. రూ.59,400 నగదు, రూ.27 వేల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.28,99,812 ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రూ.9,71,704 ఎస్‌బీఐ లైఫ్ ఇన్‌స్రూ?న్స్, రూ.2.70 లక్షల విలువైన బంగారం, రూ.47,340 విలువైన వెండి వస్తువులున్నట్లు ఏసీబీ సిబ్బంది గుర్తించారు. మొత్తంగా శంకర్ స్థిర, చర ఆస్తులు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ.8,43,71,756గా లెక్క తేల్చిన ఏసీబీ.. అందులో రూ.2,46,85,516 అక్రమాస్తులుగా ప్రాథమిక అంచనాకు వచ్చింది. శంకర్‌ను అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment