సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో గర్భవతులు.. కోర్టు ఆదేశాల ప్రకారం ఫిజికల్ ఈవెంట్స్ నుంచి ప్రస్తుతానికి మినహాయింపు తీసుకునే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు.
ప్రస్తుతం గర్భవతులుగా ఉన్నవారు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాకుండా నేరుగా తుది రాత పరీక్ష రాసేందుకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అయితే వారంతా తుది రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన నెల రోజుల లోపు ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొని అర్హత సాధిస్తామంటూ.. టీఎస్‌ఎల్పీఆర్బీకి రాతపూర్వకంగా అండర్‌టేకింగ్ ఇవ్వాలని సూచించారు. అండర్‌టేకింగ్ ఇవ్వని వారిని తుది పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు.
దేహదారుఢ్య పరీక్షలు పూర్తైన వెంటనే తుది రాత పరీక్ష
దేహదారుఢ్య పరీక్షలు ముగిసిన వెంటనే తుది రాత పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు తుది రాత పరీక్షకు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ ప్రక్రియ ఇప్పటికే 70 శాతం పూర్తయిందని, మరో 8 నుంచి 9 రోజుల్లో వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు.
పెరిగిన ‘అర్హత’శాతం: ఫిజికల్ ఈవెంట్స్‌లో ఇప్పటివరకు హాజరైన మొత్తం అభ్యర్థుల్లో 54 శాతం మంది వాటిని విజయవంతంగా పూర్తి చేసినట్టు బోర్డు పేర్కొంది. గత రిక్రూట్‌మెంట్ సందర్భంగా నిర్వహించిన ఫిజికల్ ఈవెంట్స్‌లో 52 శాతం మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించగా, ఈసారి ఆ సంఖ్య పెరిగింది. గతంతో పోలిస్తే ఫిజికల్ ఈవెంట్స్‌ను మరింత సరళతరం చేయడమే ఇందుకు కారణమని శ్రీనివాసరావు తెలిపారు. గతంలో పురుషులకు ఐదు ఫిజికల్ ఈవెంట్స్, మహిళలకు మూడు ఉండగా..ఈసారి అందరికీ మూడు (రన్నింగ్, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్)మాత్రమే ఉన్నాయి. గతంలో పురుషులకు ఛాతీ కొలతలను సైతం తీసేవారు. ఈసారి కేవలం ఎత్తు కొలత డిజిటల్ మీటర్ల ద్వారా తీస్తున్నారు.
70% మందికి పరీక్షలు పూర్తి
ఈ నెల 8 నుంచి అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గత 18 పనిదినాల్లో 70 శాతం మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో ఈవెంట్స్ పూర్తి కాగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్ల గొండ, సిద్దిపేటల్లో ఇంకా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment