Telangana State Level Police Recruitment Board
-
పక్కాగా ‘పోలీస్’ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసెస్ కొలువుల భర్తీలో కీలకమైన తుది రాత పరీక్షల నిర్వహణకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. అవకతవకలకు తావులేకుండా పూర్తిస్థాయిలో సాంకేతికతను వినియోగిస్తోంది. పోలీస్ శాఖతోపాటు ఎక్సైజ్, రవాణా శాఖల్లోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,516 పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షను నిర్వహిస్తున్నారు. అన్ని పోస్టులకు కలిపి దేహదారుఢ్య పరీక్షలకు 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా, వీరిలో 1,11,209 మంది తుది రాత పరీక్షలకు ఎంపికయ్యారు. మార్చి 11న తుది రాత పరీక్షలు మొదలుకానున్నాయి. ఆ రోజు ఐటీ, కమ్యూనికేషన్స్ ఎస్ఐ, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ పోస్టులకు పరీక్ష జరగనుండగా, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మార్చి 26న పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సై తుది రాత పరీక్ష, ఏప్రిల్ 2న కానిస్టేబుల్ మెకానిక్, డ్రైవర్ పోస్టులకు, ఏప్రిల్ 8, 9 తేదీల్లో సివిల్ ఎస్సై పోస్టులకు, ఏప్రిల్ 30న సివిల్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు తుది రాత పరీక్షలు జరగనున్నాయి. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ.. అభ్యర్థుల సంఖ్య ఆధారంగా రాత పరీక్షలకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ ఏఎస్సై, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సై, కానిస్టేబుల్, మెకానిక్‌వంటి పోస్టుల అభ్యర్థులకు హైదరాబాద్‌లోనే కేంద్రాలు ఏర్పాటు చేశారు. సివిల్ ఎస్సైలకు హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో నిర్వహించనున్నారు. పెద్దసంఖ్యలో అభ్యర్థులు పాల్గొనే కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు హైదరాబాద్‌తోపాటు పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. -
Telangana: గర్భిణీ పోలీసు అభ్యర్థులకు గుడ్‌న్యూస్! నేరుగా మెయిన్స్‌కు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో గర్భవతులు.. కోర్టు ఆదేశాల ప్రకారం ఫిజికల్ ఈవెంట్స్ నుంచి ప్రస్తుతానికి మినహాయింపు తీసుకునే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం గర్భవతులుగా ఉన్నవారు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాకుండా నేరుగా తుది రాత పరీక్ష రాసేందుకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అయితే వారంతా తుది రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన నెల రోజుల లోపు ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొని అర్హత సాధిస్తామంటూ.. టీఎస్ఎల్పీఆర్బీకి రాతపూర్వకంగా అండర్‌టేకింగ్ ఇవ్వాలని సూచించారు. అండర్‌టేకింగ్ ఇవ్వని వారిని తుది పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. దేహదారుఢ్య పరీక్షలు పూర్తైన వెంటనే తుది రాత పరీక్ష దేహదారుఢ్య పరీక్షలు ముగిసిన వెంటనే తుది రాత పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు తుది రాత పరీక్షకు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ ప్రక్రియ ఇప్పటికే 70 శాతం పూర్తయిందని, మరో 8 నుంచి 9 రోజుల్లో వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. పెరిగిన ‘అర్హత’శాతం: ఫిజికల్ ఈవెంట్స్‌లో ఇప్పటివరకు హాజరైన మొత్తం అభ్యర్థుల్లో 54 శాతం మంది వాటిని విజయవంతంగా పూర్తి చేసినట్టు బోర్డు పేర్కొంది. గత రిక్రూట్మెంట్ సందర్భంగా నిర్వహించిన ఫిజికల్ ఈవెంట్స్‌లో 52 శాతం మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించగా, ఈసారి ఆ సంఖ్య పెరిగింది. గతంతో పోలిస్తే ఫిజికల్ ఈవెంట్స్‌ను మరింత సరళతరం చేయడమే ఇందుకు కారణమని శ్రీనివాసరావు తెలిపారు. గతంలో పురుషులకు ఐదు ఫిజికల్ ఈవెంట్స్, మహిళలకు మూడు ఉండగా..ఈసారి అందరికీ మూడు (రన్నింగ్, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్)మాత్రమే ఉన్నాయి. గతంలో పురుషులకు ఛాతీ కొలతలను సైతం తీసేవారు. ఈసారి కేవలం ఎత్తు కొలత డిజిటల్ మీటర్ల ద్వారా తీస్తున్నారు. 70% మందికి పరీక్షలు పూర్తి ఈ నెల 8 నుంచి అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గత 18 పనిదినాల్లో 70 శాతం మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో ఈవెంట్స్ పూర్తి కాగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్ల గొండ, సిద్దిపేటల్లో ఇంకా కొనసాగుతోంది. -
పరుగుకు వేళాయెరా! పోలీసు అభ్యర్థులకు త్వరలో తీపి కబురు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శారీరక పరీక్షలు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న పోలీసు అభ్యర్థులకు త్వరలో తీపి కబురు అందనుంది. పార్ట్–2 శారీరక పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. నవంబరు 25 నాటికి రాష్ట్రంలో వివిధ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల పరిధిలో ఉన్న మైదానాలను శారీరక పరీక్షల కోసం సిద్ధం చేయాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ కమిషనర్లను, మహబూబ్‌నగర్, నల్లగొండ, సంగారెడ్డితోపాటు ఆదిలాబాద్ ఎస్పీలను అప్రమత్తం చేసింది. గతంలో 2018లో నిర్వహించిన తరహాలోనే ఈసారి కూడా అవే మైదానాల్లో నిర్వహించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆసక్తి చూపిస్తోంది. దాదాపు మూడు లక్షల మంది కోసం..! ఈ ఏడాది 16,614 పోలీసు కొలువుల భర్తీ ప్రక్రియను టీఎస్ఎల్ పీఆర్బీ చేపట్టింది. ఇందులో ఎస్సై/తత్సమాన పోస్టులు 587, కానిస్టేబుల్ పోస్టులు 16,027 ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు 2,25,668 మంది హాజరవగా, 1,05,603 మంది అర్హత సాధించారు. ఆగస్టు 28న నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు 6,03,851 మంది పరీక్ష రాయగా.. 1,90,589 మంది అర్హత సాధించారు. ప్రస్తుతం ఎస్సై, కానిస్టేబుళ్లకు కలిపి 2.96 లక్షల మందికిపైగా అభ్యర్థులు పార్ట్–2 కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అక్టోబరు 27 నుంచి నవంబరు 10 వరకు పార్ట్–2 ఈవెంట్ల కోసం టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే పనిలో ఉన్నారు. వీరికి శారీరక పరీక్షలు నిర్వహించే చోట సిబ్బందితోపాటు మౌలిక సదుపాయాలు, ప్రతీ మైదానంలో 50 ఎంబీపీఎస్ సదుపాయంతో ఇంటర్నెట్ వైఫై సదుపాయం కల్పించే పరికరాలను ఇన్స్టాల్ చేసుకోవాలనీ, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు కూడా సిద్ధం చేసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. నవంబరు 25 తరువాతే.. ప్రస్తుతం ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులంతా పార్ట్–2 శారీరక పరీక్షల్లో శ్రమించేందుకు సాధన ముమ్మరం చేశారు. నవంబరు 25 వరకు మైదానాలు సిద్ధం చేసి, తమకు సమాచారం అందించాలన్న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాలను గమనిస్తే.. ఆ తరువాత ఎప్పుడైనా శారీరక పరీక్షలు నిర్వహించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
పోలీస్ అభ్యర్థులకు ‘అప్లోడ్’ కష్టాలు!
►కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్వాసి గణేశ్‌కు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లలో ఒకటి, రెండో తరగతివి లేవు. అందుకోసం తహసీల్దార్ నుంచి స్టడీ/గ్యాప్ సర్టిఫికెట్ తీసుకున్నారు. అయితే వీటిని ఆన్లైన్లో అప్లోడ్చేయవచ్చో? లేదోననే సందేహం తలెత్తింది. ►రమేశ్ అనే టీఎస్ఎస్పీ ప్రొబెషనరీ కానిస్టేబుల్ గతేడాది జూలై 25న సర్వీసులో చేరారు. కానీ, అతన్ని టీఎస్ఎల్ పీఆర్బీ వెబ్సైట్ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించడం లేదు. అతని బ్యాచ్‌లో ఉన్న దాదాపు 3,800 మందికి ఇదే సమస్య ఎదురవుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్ఎల్ పీఆర్బీ) ఎస్సై, కానిస్టేబుళ్ల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణులైనవారు పార్ట్–2 ఈవెంట్ల కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులకు రోజుకో రకం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా 1 నుంచి 7వ తరగతి వరకు సర్టిఫికెట్లు తప్పనిసరి అని, వాటిలో ఏదైనా లేకుంటే స్థానిక తహసీల్దార్ ధ్రువీకరించిన రెసిడెన్స్ సర్టిఫికెట్ సరిపోతుందని ఇటీవల టీఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ‘సాక్షి’తో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంకా కొన్ని సందేహాలు, అనుమానాలు అభ్యర్థులను పట్టిపీడిస్తున్నాయి. అవేంటంటే.? ►పార్ట్–2 కోసం ఒకటి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ల అప్లోడ్ తప్పనిసరి. ఈ క్రమంలో గుర్తింపులేని స్కూళ్లలో చదివిన కొందరు అభ్యర్థులు ఆ విద్యా సంవత్సరాలకు ముందుగానే స్టడీ/గ్యాప్ సర్టిఫికెట్లను తీసుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ జారీ చేసిన స్టడీ/గ్యాప్ సర్టిఫికెట్లను, తమ వద్ద ఉన్న స్టడీ సర్టిఫికెట్లతో కలిపి అప్లోడ్ చేయవచ్చా? లేక ఏడేళ్లకు రెసిడెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలా? అన్న సందేహంలో వీరు ఉండిపోయారు. ►2021 జూలై 25వ తేదీన టీఎస్ఎస్పీలో సుమారు 3,800 మంది టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లుగా బాధ్యతలు స్వీకరించారు. వీరిలో చాలామంది ఇటీవల టీఎస్ఎల్ పీఆర్బీ నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష పాసయ్యారు. ఇప్పుడు ఆన్లైన్లో పార్ట్–2 దరఖాస్తు నింపే క్రమంలో మీరు ప్రభుత్వ ఉద్యోగా? అన్న కాలమ్‌లో వీరు ఎస్ అని సమాధానం ఇస్తున్నారు. సర్వీసులో ఎప్పుడు చేరారు? అన్న ప్రశ్నకు సమాధానంగా 25–07–2021 అని పొందుపరిస్తే దరఖాస్తులో ఎర్రర్ చూపిస్తోంది. అక్కడ నుంచి దరఖాస్తు ముందుకు కదలడం లేదు. పోనీ ఆ కాలమ్‌ని వదిలేద్దామా? అంటే ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. ►ప్రొబెషనరీలో ఉన్న పోలీసులు సర్వీసు సర్టిఫికెట్లు పెట్టాలా? వద్దా? అన్న సంశయంలో ఉన్నారు. 24 గంటల్లో పరిష్కరిస్తాం పార్ట్–2లో దరఖాస్తు చేసుకునేవారు తహసీల్దార్ రెసిడెన్స్/స్టడీ సర్టిఫికెట్లు, అందుబాటులో ఉన్న పత్రాలను అప్లోడ్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో వీటిని మరోసారి నిర్ధారిస్తాం. గతేడాది డిపార్ట్మెంట్లో చేరిన టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు దరఖాస్తు తీసుకోకపోవడంపై సాంకేతిక సిబ్బందితో మాట్లాడి 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తాం. సర్వీస్ సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తే అభ్యర్థులకు అది ఎంతో మేలు చేస్తుంది. ఒక్క పోలీసుశాఖే కాదు, ఇతర ఏ శాఖ ఉద్యోగులకైనా దానివల్ల దాదాపు ఐదేళ్ల వయసు మినహాయింపు దక్కుతుందని మర్చిపోవద్దు. – శ్రీనివాసరావు, చైర్మన్, టీఎస్ఎల్ పీఆర్బీ -
ఎస్సై పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో గతేడాది నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ప్రధాన రాత పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఎస్ఐ పోస్టులకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు, వారి కటాఫ్ మార్కుల వివరాలను తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక సంస్థ (టీఎస్ఎల్పీఆర్బీ) ప్రకటించింది. నేటి రాత్రి ఎనిమిది గంటల నుంచి అభ్యర్థులు www.tslprb.in వెబ్ సైట్ నుంచి మార్కులు తెలుసుకోవచ్చు. ఈ ఫలితాలపై అభ్యంతరాలు ఉన్న వారు ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు సంబంధిత వెబ్ సైట్ ద్వారా సవాల్ చేయవచ్చునని టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 2వేలను www.tslprb.in వెబ్సైట్లో చాలెంజ్ ఆప్షన్ ద్వారా సవాల్ చేసే వెసలుబాటు కల్పించింది. గతేడాది నవంబర్ 19, 20 తేదీల్లో ఎస్సై సివిల్ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది ఫిబ్రవరి 6న సివిల్, సాయుధ రిజర్వ్, ప్రత్యేక సాయుధ రిజర్వ్, టీఎస్ఎస్పీ, ఎస్ పీఎస్, అగ్నిమాపక శాఖ విభాగాల్లో మొత్తం 510 ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నేడు విడుదలైన ఫలితాల్లో మొత్తం 510 పోస్టుల్లో 76 మంది మహిళలు సహా 509 మందిని ఎంపిక చేశారు. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు, కటాఫ్ మార్కులను వెబ్ సైట్ లో చూడవచ్చు. -
దరఖాస్తుల్లో తప్పులుంటే సవాలు చేయొచ్చు
కానిస్టేబుల్ అభ్యర్థులకు టీఎస్ఎల్పీఆర్బీ అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది రాత పరీక్షలో కనీస అర్హత సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏమైనా లోపా లుంటే సవాలు చేయవచ్చని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ పూర్ణ చందర్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్/ఎస్ఏఆర్/ టీఎస్ఎస్పీ) పోస్టులతోపాటు ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్, అగ్నిమాపక శాఖలో ఫైర్‌మన్ అభ్య ర్థులు దాఖలు చేసిన దరఖాస్తుల వివరాలు, దేహదారుఢ్య పరీక్ష (పీఈటీ) సమా చారాన్ని సంస్థ వెబ్సైట్ (www. tslprb.in)లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని అందులో వివరాలను సరిచూసు కోవాలన్నారు. ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి 30న అర్ధరాత్రి వరకు వెబ్‌సైట్‌లోని ‘చాలెంజింగ్ అప్లికేషన్ ఫాం’లో మార్పులకు సంబంధించిన సమాచారాన్ని భర్తీ చేయాలని కోరారు. అప్లికేషన్ ఫాంను భర్తీ చేసేందుకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500లను డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక వేళ అభ్యర్థుల సవాలు నిజమని తేలితే ఈ డబ్బును తిరిగి ఇచ్చేస్తామన్నారు. -
నవంబర్ 26న కానిస్టేబుల్ రాతపరీక్ష
సాక్షి, హైదరాబాద్: పోలీసు కానిస్టేబుల్ (కమ్యూనికేషన్) పోస్టులకు నవంబర్ 26న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రాతపరీక్ష నిర్వహించనున్నామని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందే అభ్యర్థులు బోర్డు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.