ఎస్సై పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో గతేడాది నిర్వహించిన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) ప్రధాన రాత పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఎస్ఐ పోస్టులకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు, వారి కటాఫ్ మార్కుల వివరాలను తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక సంస్థ (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది. నేటి రాత్రి ఎనిమిది గంటల నుంచి అభ్యర్థులు www.tslprb.in వెబ్ సైట్ నుంచి మార్కులు తెలుసుకోవచ్చు.
ఈ ఫలితాలపై అభ్యంతరాలు ఉన్న వారు ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు సంబంధిత వెబ్ సైట్ ద్వారా సవాల్ చేయవచ్చునని టీఎస్ఎల్‌పీఆర్‌బీ తెలిపింది. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 2వేలను www.tslprb.in వెబ్‌సైట్‌లో చాలెంజ్ ఆప్షన్ ద్వారా సవాల్ చేసే వెసలుబాటు కల్పించింది. గతేడాది నవంబర్ 19, 20 తేదీల్లో ఎస్సై సివిల్ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
గతేడాది ఫిబ్రవరి 6న సివిల్, సాయుధ రిజర్వ్, ప్రత్యేక సాయుధ రిజర్వ్, టీఎస్ఎస్పీ, ఎస్ పీఎస్, అగ్నిమాపక శాఖ విభాగాల్లో మొత్తం 510 ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నేడు విడుదలైన ఫలితాల్లో మొత్తం 510 పోస్టుల్లో 76 మంది మహిళలు సహా 509 మందిని ఎంపిక చేశారు. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు, కటాఫ్ మార్కులను వెబ్ సైట్ లో చూడవచ్చు.