పోలీస్‌ అభ్యర్థులకు ‘అప్‌లోడ్‌’ కష్టాలు! | TSLPRB SI Constable Part 2 Application Students Problems On Study Certificates | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అభ్యర్థులకు ‘అప్‌లోడ్‌’ కష్టాలు!

Published Sat, Oct 29 2022 1:45 AM | Last Updated on Sat, Oct 29 2022 1:45 AM

TSLPRB SI Constable Part 2 Application Students Problems On Study Certificates - Sakshi

►కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌వాసి గణేశ్‌కు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లలో ఒకటి, రెండో తరగతివి లేవు. అందుకోసం తహసీల్దార్‌ నుంచి స్టడీ/గ్యాప్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నారు. అయితే వీటిని ఆన్‌లైన్లో అప్‌లోడ్‌చేయవచ్చో? లేదోననే సందేహం తలెత్తింది.

►రమేశ్‌ అనే టీఎస్‌ఎస్‌పీ ప్రొబెషనరీ కానిస్టేబుల్‌ గతేడాది జూలై 25న సర్వీసులో చేరారు. కానీ, అతన్ని టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ వెబ్‌సైట్‌ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించడం లేదు. అతని బ్యాచ్‌లో ఉన్న దాదాపు 3,800 మందికి ఇదే సమస్య ఎదురవుతోంది.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు­(టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ) ఎస్సై, కానిస్టేబుళ్ల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణులైనవారు పార్ట్‌–2 ఈవెంట్ల కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అభ్య­ర్థుల­కు రోజుకో రకం ఇబ్బందులు ఎదుర­వుతున్నాయి. తాజాగా 1 నుంచి 7వ తర­గతి వరకు సర్టిఫికెట్లు తప్పనిసరి అని, వాటిలో ఏదైనా లేకుంటే స్థానిక తహసీ­ల్దార్‌ ధ్రువీకరించిన రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ సరిపోతుందని ఇటీవల టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ‘సాక్షి’తో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంకా కొన్ని సందేహాలు, అనుమానాలు అభ్యర్థులను పట్టిపీడిస్తున్నాయి. 

అవేంటంటే.?
పార్ట్‌–2 కోసం ఒకటి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ తప్పనిసరి. ఈ క్రమంలో గుర్తింపులేని స్కూళ్లలో చదివిన కొందరు అభ్యర్థులు ఆ విద్యా సంవత్సరాలకు ముందుగానే స్టడీ/గ్యాప్‌ సర్టిఫికెట్లను తీసుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌ జారీ చేసిన స్టడీ/గ్యాప్‌ సర్టిఫికెట్లను, తమ వద్ద ఉన్న స్టడీ సర్టిఫికెట్లతో కలిపి అప్‌లోడ్‌ చేయవచ్చా? లేక ఏడేళ్లకు రెసిడెన్సీ సర్టిఫికెట్‌ తీసుకోవాలా? అన్న సందేహంలో వీరు ఉండిపోయారు.

2021 జూలై 25వ తేదీన టీఎస్‌­ఎస్‌­పీలో సుమారు 3,800 మంది టీఎస్‌­ఎస్‌పీ కానిస్టేబుళ్లుగా బాధ్య­తలు స్వీక­రిం­చారు. వీరిలో చాలామంది ఇటీవల టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ నిర్వహించిన ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష పాసయ్యారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో పార్ట్‌–2 దరఖాస్తు నింపే క్రమంలో మీరు ప్రభుత్వ ఉద్యోగా? అన్న కాలమ్‌లో వీరు ఎస్‌ అని సమాధానం ఇస్తున్నారు. సర్వీసులో ఎప్పుడు చేరారు? అన్న ప్రశ్నకు సమాధానంగా 25–07–2021 అని పొందుపరిస్తే దరఖాస్తులో ఎర్రర్‌ చూపిస్తోంది. అక్కడ నుంచి దరఖాస్తు ముందుకు కదలడం లేదు. పోనీ ఆ కాలమ్‌ని వదిలేద్దామా? అంటే ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. 

ప్రొబెషనరీలో ఉన్న పోలీసులు సర్వీసు సర్టిఫికెట్లు పెట్టాలా? వద్దా? అన్న సంశయంలో ఉన్నారు.

24 గంటల్లో పరిష్కరిస్తాం
పార్ట్‌–2లో దరఖాస్తు చేసుకునేవారు తహసీల్దార్‌ రెసిడెన్స్‌/స్టడీ సర్టిఫికెట్లు, అందుబాటులో ఉన్న పత్రాలను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌లో వీటిని మరోసారి నిర్ధారిస్తాం. గతేడాది డిపార్ట్‌మెంట్‌లో చేరిన టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లు దరఖాస్తు తీసుకోకపోవడంపై సాంకేతిక సిబ్బందితో మాట్లాడి 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తాం. సర్వీస్‌ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేస్తే అభ్యర్థులకు అది ఎంతో మేలు చేస్తుంది. ఒక్క పోలీసుశాఖే కాదు, ఇతర ఏ శాఖ ఉద్యోగులకైనా దానివల్ల దాదాపు ఐదేళ్ల వయసు మినహాయింపు దక్కుతుందని మర్చిపోవద్దు.  
– శ్రీనివాసరావు, చైర్మన్, టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement