Study certificates
-
సర్టిఫికెట్స్‌లో కుల, మత ప్రస్తావనపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: విద్యతో పాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్’, ‘నో రిలీజియన్’ అనే కాలమ్‌ను తప్పుకుండా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కులాన్ని, మతాన్ని వదులుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను వెలువరించింది. వివరాల ప్రకారం.. తమ కుమారుడికి నో క్యాస్ట్.. నో రిలీజియన్ సర్టిఫికెట్ ఇవ్వాలని 2019లో సండెపు స్వరూప పలుమార్లు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో స్వరూపతో పాటు మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్ కన్నెగంటి లలిత ఉత్తర్వులు జారీ చేశారు. ‘పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించడం రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి విరుద్ధం. ఆర్టికల్ 14, 19, 21, 25ను ఉల్లంఘించడమే అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద మత స్వేచ్ఛతో పాటు ఇలాంటి కొన్ని హక్కులు పౌరులకు ఉన్నాయి. ఏ మతాన్ని, కులాన్ని ఆచరించకూడదని ఎంచుకునే హక్కు పౌరులకు ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఇదే చెబుతోంది. నో క్యాస్ట్.. నో రిలీజియన్ అనే కాలాన్ని అన్ని దరఖాస్తుల్లో (ఆన్‌లైన్‌లోనూ) చేర్చాలని మున్సిపల్ కమిషనర్లకు, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాం’ అని తీర్పులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో నేడు, రేపు స్కూల్స్ బంద్ -
పోలీస్ అభ్యర్థులకు ‘అప్లోడ్’ కష్టాలు!
►కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్వాసి గణేశ్‌కు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లలో ఒకటి, రెండో తరగతివి లేవు. అందుకోసం తహసీల్దార్ నుంచి స్టడీ/గ్యాప్ సర్టిఫికెట్ తీసుకున్నారు. అయితే వీటిని ఆన్లైన్లో అప్లోడ్చేయవచ్చో? లేదోననే సందేహం తలెత్తింది. ►రమేశ్ అనే టీఎస్ఎస్పీ ప్రొబెషనరీ కానిస్టేబుల్ గతేడాది జూలై 25న సర్వీసులో చేరారు. కానీ, అతన్ని టీఎస్ఎల్ పీఆర్బీ వెబ్సైట్ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించడం లేదు. అతని బ్యాచ్‌లో ఉన్న దాదాపు 3,800 మందికి ఇదే సమస్య ఎదురవుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్ఎల్ పీఆర్బీ) ఎస్సై, కానిస్టేబుళ్ల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణులైనవారు పార్ట్–2 ఈవెంట్ల కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులకు రోజుకో రకం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా 1 నుంచి 7వ తరగతి వరకు సర్టిఫికెట్లు తప్పనిసరి అని, వాటిలో ఏదైనా లేకుంటే స్థానిక తహసీల్దార్ ధ్రువీకరించిన రెసిడెన్స్ సర్టిఫికెట్ సరిపోతుందని ఇటీవల టీఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ‘సాక్షి’తో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంకా కొన్ని సందేహాలు, అనుమానాలు అభ్యర్థులను పట్టిపీడిస్తున్నాయి. అవేంటంటే.? ►పార్ట్–2 కోసం ఒకటి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ల అప్లోడ్ తప్పనిసరి. ఈ క్రమంలో గుర్తింపులేని స్కూళ్లలో చదివిన కొందరు అభ్యర్థులు ఆ విద్యా సంవత్సరాలకు ముందుగానే స్టడీ/గ్యాప్ సర్టిఫికెట్లను తీసుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ జారీ చేసిన స్టడీ/గ్యాప్ సర్టిఫికెట్లను, తమ వద్ద ఉన్న స్టడీ సర్టిఫికెట్లతో కలిపి అప్లోడ్ చేయవచ్చా? లేక ఏడేళ్లకు రెసిడెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలా? అన్న సందేహంలో వీరు ఉండిపోయారు. ►2021 జూలై 25వ తేదీన టీఎస్ఎస్పీలో సుమారు 3,800 మంది టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లుగా బాధ్యతలు స్వీకరించారు. వీరిలో చాలామంది ఇటీవల టీఎస్ఎల్ పీఆర్బీ నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష పాసయ్యారు. ఇప్పుడు ఆన్లైన్లో పార్ట్–2 దరఖాస్తు నింపే క్రమంలో మీరు ప్రభుత్వ ఉద్యోగా? అన్న కాలమ్‌లో వీరు ఎస్ అని సమాధానం ఇస్తున్నారు. సర్వీసులో ఎప్పుడు చేరారు? అన్న ప్రశ్నకు సమాధానంగా 25–07–2021 అని పొందుపరిస్తే దరఖాస్తులో ఎర్రర్ చూపిస్తోంది. అక్కడ నుంచి దరఖాస్తు ముందుకు కదలడం లేదు. పోనీ ఆ కాలమ్‌ని వదిలేద్దామా? అంటే ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. ►ప్రొబెషనరీలో ఉన్న పోలీసులు సర్వీసు సర్టిఫికెట్లు పెట్టాలా? వద్దా? అన్న సంశయంలో ఉన్నారు. 24 గంటల్లో పరిష్కరిస్తాం పార్ట్–2లో దరఖాస్తు చేసుకునేవారు తహసీల్దార్ రెసిడెన్స్/స్టడీ సర్టిఫికెట్లు, అందుబాటులో ఉన్న పత్రాలను అప్లోడ్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో వీటిని మరోసారి నిర్ధారిస్తాం. గతేడాది డిపార్ట్మెంట్లో చేరిన టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు దరఖాస్తు తీసుకోకపోవడంపై సాంకేతిక సిబ్బందితో మాట్లాడి 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తాం. సర్వీస్ సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తే అభ్యర్థులకు అది ఎంతో మేలు చేస్తుంది. ఒక్క పోలీసుశాఖే కాదు, ఇతర ఏ శాఖ ఉద్యోగులకైనా దానివల్ల దాదాపు ఐదేళ్ల వయసు మినహాయింపు దక్కుతుందని మర్చిపోవద్దు. – శ్రీనివాసరావు, చైర్మన్, టీఎస్ఎల్ పీఆర్బీ -
గుర్తింపు లేని పాఠశాలలపై కొరడా
- డీఈఓ విజయభాస్కర్ ఒంగోలు వన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కొరడా ఝుళిపించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి ప్రారంభ అనుమతి లేకుండా కొత్తగా పాఠశాలలను ప్రారంభించరాదు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలలను నిర్వహించరాదని చట్టం చెబుతోంది. అయితే ఈ నిబంధనలన్నింటినీ తోసిరాజని కొందరు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎటువంటి గుర్తింపు, అనుమతులు లేకుండా పాఠశాలలను నిర్వహిస్తుండటంపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత విద్యాసంవత్సరంలోనే అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలకు భారీగా జరిమానాలు కూడా విధించారు. విద్యాహక్కు చట్టం అమలుల్లోకి వచ్చి ఇప్పటికి నాలుగు సంవత్సరాలైంది. ఇప్పటికీ ఇంకా ఈ చట్టం నిర్దేశించిన అంశాలను తోసిరాజని కొత్త ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించొద్దు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పిండొద్దని డీఈఓ విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేటప్పుడు ఆ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో తెలుసుకుని గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చదివే విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు ప్రస్తుత విద్యాసంవత్సరం (2014-15)లో అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చదివి విద్యార్థులు నష్టపోతే దానికి తల్లిదండ్రులే బాధ్యత వహించాలన్నారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించవద్దని తాము ముందుగానే హెచ్చరిస్తున్నందున విద్యార్థులు నష్టపోతే తమకేమీ బాధ్యత లేదన్నారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు జారీ చేసే స్టడీ సర్టిఫికెట్లు, టీసీలు చెల్లవని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 100కుపైగా ఒక్క ఒంగోలులోనే 27 ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నారని, ఆ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించవద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతులు, గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు.