- డీఈఓ విజయభాస్కర్
ఒంగోలు వన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కొరడా ఝుళిపించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి ప్రారంభ అనుమతి లేకుండా కొత్తగా పాఠశాలలను ప్రారంభించరాదు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలలను నిర్వహించరాదని చట్టం చెబుతోంది. అయితే ఈ నిబంధనలన్నింటినీ తోసిరాజని కొందరు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎటువంటి గుర్తింపు, అనుమతులు లేకుండా పాఠశాలలను నిర్వహిస్తుండటంపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత విద్యాసంవత్సరంలోనే అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలకు భారీగా జరిమానాలు కూడా విధించారు. విద్యాహక్కు చట్టం అమలుల్లోకి వచ్చి ఇప్పటికి నాలుగు సంవత్సరాలైంది. ఇప్పటికీ ఇంకా ఈ చట్టం నిర్దేశించిన అంశాలను తోసిరాజని కొత్త ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు.
గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించొద్దు
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పిండొద్దని డీఈఓ విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేటప్పుడు ఆ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో తెలుసుకుని గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చదివే విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు ప్రస్తుత విద్యాసంవత్సరం (2014-15)లో అనుమతించమని ఆయన స్పష్టం చేశారు.
గుర్తింపు లేని పాఠశాలల్లో చదివి విద్యార్థులు నష్టపోతే దానికి తల్లిదండ్రులే బాధ్యత వహించాలన్నారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించవద్దని తాము ముందుగానే హెచ్చరిస్తున్నందున విద్యార్థులు నష్టపోతే తమకేమీ బాధ్యత లేదన్నారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు జారీ చేసే స్టడీ సర్టిఫికెట్లు, టీసీలు చెల్లవని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 100కుపైగా ఒక్క ఒంగోలులోనే 27 ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నారని, ఆ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించవద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతులు, గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు.
గుర్తింపు లేని పాఠశాలలపై కొరడా
Published Mon, May 26 2014 3:24 AM | Last Updated on Fri, Sep 28 2018 4:43 PM
Advertisement
Advertisement