దరఖాస్తుల్లో తప్పులుంటే సవాలు చేయొచ్చు
కానిస్టేబుల్ అభ్యర్థులకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది రాత పరీక్షలో కనీస అర్హత సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏమైనా లోపా లుంటే సవాలు చేయవచ్చని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్ పూర్ణ చందర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్/ఎస్‌ఏఆర్/ టీఎస్‌ఎస్‌పీ) పోస్టులతోపాటు ఎస్పీఎఫ్‌లో కానిస్టేబుల్, అగ్నిమాపక శాఖలో ఫైర్‌మన్ అభ్య ర్థులు దాఖలు చేసిన దరఖాస్తుల వివరాలు, దేహదారుఢ్య పరీక్ష (పీఈటీ) సమా చారాన్ని సంస్థ వెబ్‌సైట్ (www. tslprb.in)లో అందుబాటులో ఉంచామన్నారు.
అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని అందులో వివరాలను సరిచూసు కోవాలన్నారు. ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి 30న అర్ధరాత్రి వరకు వెబ్‌సైట్‌లోని ‘చాలెంజింగ్ అప్లికేషన్ ఫాం’లో మార్పులకు సంబంధించిన సమాచారాన్ని భర్తీ చేయాలని కోరారు. అప్లికేషన్ ఫాంను భర్తీ చేసేందుకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500లను డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక వేళ అభ్యర్థుల సవాలు నిజమని తేలితే ఈ డబ్బును తిరిగి ఇచ్చేస్తామన్నారు.