సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర జనాభాలో మహిళలు దాదాపు సగం (49.7 శాతం) ఉన్నప్పటికీ... మహిళా పోలీసుల శాతం మాత్రం ఇప్పటికీ నామమాత్రంగానే ఉంది. కేంద్రం అధీనంలోని బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్ అండ్ డీ) గణాంకాల ప్రకారం రాష్ట్ర పోలీసు విభాగంలో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది, అధికారుల సంఖ్య 62,731గా ఉండగా అందులో మహిళా పోలీసులు కేవలం 5,349 (8.53 శాతం) మందే ఉన్నారు.
2021 జనవరి నాటి పరిస్థితుల ఆధారంగా...
బీపీఆర్ అండ్ డీ ఏటా అన్ని రాష్ట్రాలు, కమిషనరేట్లలో పోలీసు సిబ్బంది వివరాలను సేకరిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న జనాభాతో పురుష–మహిళా పోలీసులు, సివిల్–ఆర్మ్‌డ్ రిజర్వ్ బలగాల్లోని సిబ్బందిని గణించి నివేదిక రూపొందిస్తోంది. 2021 జనవరి నాటి గణాంకాల ఆధారంగా అధ్యయనం చేసిన బీపీఆర్ అండ్ డీ... రాష్ట్రంలో మహిళలకు అవసరమైన స్థాయిలో మహిళా పోలీసులు లేరని స్పష్టం చేసింది. అయితే అన్ని రాష్ట్రాలూ మహిళా పోలీసు పోస్టుల సంఖ్య పెంచడంతోపాటు భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
ఉన్న సిబ్బందికీ సమస్యలెన్నో...
ప్రస్తుతం పోలీసు విభాగంలో ఉన్న మహిళా సిబ్బందిని ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. చాలా మంది మహిళా పోలీసులు స్థూలకాయంతో బాధపడుతున్నారు. వ్యాయాయం లేకపోవడం, ఏళ్ల తరబడి కార్యాలయ విధులకే పరిమితం కావడంతో బందోబస్తు డ్యూటీ చేయాల్సి వస్తే నిరసనకారులను అదుపు చేయడం వారికి సాధ్యం కావట్లేదు. కొత్తగా విధుల్లో చేరిన యువ మహిళా సిబ్బంది మినహా మిగిలిన వారిలో అనేక మందికి ఈ సమస్యలు ఉన్నాయి.
మహిళా పోలీసు సిబ్బంది కొరత తీర్చడంతోపాటు ఉన్న వారిలోనూ నైపుణ్యాలు మెరుగుపరచడానికి ఉమ్మడి రాష్ట్రంలో తెరపైకి వచ్చిన ప్రతిపాదనలు ఇప్ప టికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. మహిళా పోలీసులకు సమకాలీన అంశాలపై అవగాహన కల్పించడం, వృత్తిలో మెళకువలు నేర్పే ఉద్దేశంతో క్రాష్‌కోర్స్ నిర్వహించాలని గతంలో భావించారు. అయితే ఈ ప్రక్రియ కొందరికి పూర్తయినా మిగిలిన వారికి ఆగిపోయింది. ప్రత్యేక మహిళా బెటాలియన్ ఏర్పాటుకు సన్నాహాలు చేసినా ఆచరణకి రాలేదు.
ఎట్టకేలకు లా అండ్ ఆర్డర్‌కు నేతృత్వం..
హైదరాబాద్‌లోని మూడు కమిషరేట్లలో 150కిపైగా లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్లు, ఐదు మహిళా ఠాణాలు ఉన్నాయి. మహిళా ఠాణాలకు ఉమెన్ ఆఫీసర్లే నేతృత్వం వహిస్తున్నా చాలాకాలం వరకు మూడు కమిషనరేట్లలో ఏ ఒక్క శాంతి భద్రతల విభాగం పోలీసుస్టేషన్‌కు మహిళా పోలీసును స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా నియమించిన దాఖలాలు లేవు.
అయితే హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గతేడాది మహిళా దినోత్సవం రోజు లాలాగూడ ఠాణాకు మధులతను మొదటి మహిళా ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. మరోవైపు గతంలో మహిళా పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినా అభ్యర్థి నుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన ఉండేది కాదని... తాజాగా చేపట్టిన పోలీసు రిక్రూట్‌మెంట్‌లో స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతోపాటు వారికి అనేక వెసులుబాట్లు కల్పించడంతో పోలీసు విభాగంలో అతివల కొరత చాలా వరకు తీరుతుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment