mission everest
-
మిషన్ ఎవరెస్టుకు ఆశాకిరణ్‌రాణి ఎంపిక
శ్రీకాకుళం, కోటబొమ్మాళి: స్థానిక శ్రీ నలంద స్కూల్ పూర్వపు విద్యార్థిని, నర్సపురం గ్రామానికి చెందిన కొయ్య ఆశాకిరణ్‌రాణి మిషన్ ఎవరెస్టుకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక మహిళ ఈమె. ఆశాకిరణ్‌రాణి ఎంపిక పట్ల ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మంచాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు వై.మురళి, నగేష్, నౌగాపు సుశీల, పద్మారావు, జగన్నాథరావు, కుసుము కుమారి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఫిజియోథెరపీ కోర్సు పూర్తిచేసి ప్రస్తుతం టెక్కలిలో నివాసముంటున్న ఈమె యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిషన్ ఎవరెస్టు కార్యక్రమానికి వెళ్లేందుకు ఆసిక్తి చూపి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించటం చిన్నప్పటి నుంచి అభిలాషగా ఎంచుకున్న ఆశాకిరణ్‌రాణి మిషన్ ఎవరెస్టు కార్యక్రమానికి ఎంపికయ్యారు. -
ఎవరెస్ట్ పర్వతారోహణకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం మున్సిపాలిటీ: మిషన్ ఎవరెస్ట్ పథకం–2018 కింద ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు ఆసక్తి గల యువతీ, యువకుల నుంచి స్పెషల్ కమిషనర్, యువజన సర్వీసుల శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్విజ్ సీఈఓ ఎం.సత్యనారాయణ సోమవారం తెలిపారు. 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల డిగ్రీ విద్యనభ్యసించిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. గ్రామీణ అభ్యర్థుల ఆదాయం రూ.81వేలు, పట్టణ ప్రాంత అభ్యర్థుల ఆదాయం రూ.1.03 లక్షల లోపు ఉండి తెల్ల రేషన్ కార్డుదారులై ఉండాలన్నారు. ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాట్లాడే వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. మెడికల్ ఫిట్నెస్ దరఖాస్తును ప్రభుత్వ వైద్యునిచే ధృవీకరించుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎత్తుకు తగ్గ బరువు కలిగి ఉండి, పురుషులు 100 మీటర్ల పరుగు పోటీని 16 సెకండ్ల వ్యవధిలో, 2.4 కిలోమీటర్ల పరుగు పోటీనీ 10 నిమిషాల్లో చేరుకోవాలన్నారు. 3.65 మీటర్ల లాంగ్‌జంప్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా స్త్రీలు 100 మీటర్ల పరుగు పోటీని 18 సెకండ్లలో, 2.4 కిలోమీటర్ల పరుగు పోటీనీ 13 నిమిషాల్లో చేరుకోవటంతో పాటు 2.7 మీటర్ల లాంగ్‌జంప్ పరీక్షలో అర్హత సాధించాలన్నారు. అభ్యర్థులు తల్లిదండ్రులు, సంబంధిత విద్యా సంస్థల నుంచి అనుమతి పొందిన లేఖను కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 30లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెట్విజ్ కార్యాలయం 08922– 273768, 98499 13080 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. -
రాజీలేని హైదరాబాద్ సాహసి..!!
హైదరాబాద్: ‘ఎవరెస్టంత’ ఆత్మవిశ్వాసమే పునాదిగా... వనితా లోకానికే వన్నె తెచ్చేలా సాహసయాత్రకు సిద్ధమవుతోంది సిటీకి చెందిన ఓ మహిళ. ఆరంతస్తుల మేడ ఎక్కేందుకు ఆపసోపాలు పడే ఈ రోజుల్లో.. ప్రపంచంలోని ఎత్తైన సప్త శిఖరాలపై జాతీయ జెండాను ఎగురవేయాలనే సంకల్పానికి పూనుకుంది. ఇప్పటికే సౌతాఫ్రికా టాంజానియాలోని కిలిమంజారో (19,341 అడుగులు)ను అధిరోహించి మువ్వన్నెల పతాకను రెపరెపలాడించింది. అదే స్ఫూర్తితో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ (29,029 అడుగులు) అధిరోహణకు అంతులేని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తోంది. భార్యగా.. మాతృమూర్తిగా... సామాజిక కార్యకర్తగా ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తూనే చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాన్నే ఊపిరిగా చేసుకుని మౌంట్ ఎవరెస్ట్ శిఖరాగ్రాన్ని ముద్దాడేందుకు ముందుడుగు వేస్తోంది రాజీ తమ్మినేని. ఇదీ నేపథ్యం... కర్నూలుకు చెందిన నాగరాజు, సుశీల దంపతులకు కుమార్తె రాజీ తమ్మినేని. 2006లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. నగరంలోని ఎంఎన్సీ కంపెనీలో సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేశారు. ఆమెకు సీహెచ్.వెంకటకృష్ణతో వివాహం జరగ్గా తమ ఐదేళ్ళ కుమారుడితో కలిసి నాగారంలో నివాసం ఉంటున్నారు. చిన్నతనంలో చెట్లు, పుట్టలు, కొండలు ఎక్కడం అంటే రాజీకి ఎంతో సరదా. అదే ఇప్పుడు ఆమె జీవితాశయంగా మారింది. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరి, కుటుంబ బాధ్యతలను స్వీకరించినప్పటికీ చిన్నప్పటి నుంచి తనలో దాగిఉన్న పర్వతారోహణ ఆశయాన్ని చంపుకోలేకపోయింది. దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ..లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో అటు ఉద్యోగం, ఇటు కుటుంబం చూస్తూనే తరుచూ పర్వతారోహణ టూర్లకు వెళ్తుండేది. పూర్తిస్థాయిలో మౌంటెనింగ్‌కు సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టింది. ఈ నేపథ్యంలో డార్జిలింగ్‌లోని హిమాలయ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఎన్నో విజయాలు... ⇒ 2015 ఆగస్టు 23న సౌతాఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారోను రాజీ అధిరోహించారు. ⇒2015 మే 25న వెస్ట్ సిక్కింలోని రినోక్ శిఖరాగ్రానికి చేరుకుని తెలుగువారి కీర్తిని చాటారు. ⇒తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులకు పర్వతారోహణలో మెలకువలు నేర్పించి 2016 ఆగస్టు 15న వారితో కలిసి మరోసారి కిలిమంజారో శిఖరానికి చేరుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ⇒హిమాలయ ప్రాంతంతో పాటు వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతాల్లోని మరెన్నో పర్వతాలను అధిరోహించి తనలోని అభిలాషను చాటడమే కాకుండా సాహసానికి మరోపేరుగా నిలిచారు. సప్త శిఖరాగ్రాలకు చేరడమే లక్ష్యంగా... ప్రపంచంలో ఏడు ఖండాల్లో విస్తరించిన ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనే దృఢమైన కోరికను మది నిండా నింపుకుంది రాజీ. ఇప్పటికే కిలిమంజారో శిఖర లక్ష్యాన్ని పూర్తి చేయగా...ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎవరెస్ట్ శిఖరాగ్రాన్ని అందుకునేందుకు అవసరమైన శిక్షణ తీసుకుంటోంది. పర్వతారోహణ నిపుణుడు శేఖర్‌బాబు వద్ద మెళకువలను నేర్చుకుంటూ ఫిట్నెస్పరంగా చక్రిపురంలోని సాయీస్ ఫిట్నెస్ సెంటర్లో తర్ఫీదు పొందుతున్నారు. ఏడు శిఖరాలను చేరుకునే వరకు తన లక్ష్యాన్ని వీడబోనని ఈ సందర్భంగా రాజీ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఆమెలోని పట్టుదల, తపన,విజయ ‘శిఖరా’లకు చేరుస్తోందని మెంటర్ గా వ్యవహరిస్తోన్న బాలచంద్ర పేర్కొన్నారు. అభయ ఫౌండేషన్ సహకారం... మౌంటెనీరింగ్‌లో రాజీ అభిరుచిని గమనించి అభయ ఫౌండేషన్ ఆమెకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తోంది. అభయ ఫౌండేషన్లోనే వాలంటీర్‌గా పనిచేస్తోన్న రాజీకి... శిక్షణ ఇప్పించడంతో పాటు కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించేందుకు ఇప్పటివరకు అవసరమైన సహాయ సహకారాలను అందించారు. అయితే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి రావాలంటే దాదాపు 25 లక్షల పైగా ఖర్చువుతోంది. అభయ ఫౌండేషన్ తరుపున ఐదు లక్షల మేర సమకూరుస్తుండగా మిగిలిన మొత్తం సమకూర్చుకునే విషయంపై రాజీ తర్జనభర్జన పడుతున్నారు. దాతలు ఎవరైనా ప్రోత్సహించి ఆర్థిక సహకారం అందిస్తారేమోనని ఎదురుచూస్తోంది. ప్రభుత్వమైనా స్పందించి తనకు ఆర్థిక సహాయం చేస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తానని రాజీ పేర్కొంటోంది. అభయ ఫౌండేషన్ తరుపున రూ.5 లక్షలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయగా, మరో పది లక్షల వరకు సమకూర్చుకున్నా...మిగిలిన మొత్తాన్ని శిక్షకుడు శేఖర్‌బాబు చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు రాజీ చెప్పారు. దాతలు ఎవరైనా స్పందించాలనుకుంటే 9963002727, 9032818284 నెంబర్లలో సంప్రదించవచ్చు. కాగా ఏప్రిల్‌లో జరిగే మిషన్ ఎవరెస్ట్–17కు ఈ నెలాఖరు లోగానే డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. -
మిషన్ ఎవరెస్ట్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
కర్నూలు(హాస్పిటల్): మిషన్ ఎవరెస్ట్ కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారులు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న 25 మందిలో హాజరైన 18 మంది దరఖాస్తుల పరిశీలన చేశారు. అనంతరం 100 మీటర్ల, 2.4కి.మీల పరుగు పందెంను ఏపీఎస్పీ బెటాలియన్ ఆర్ఐ యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆరోగ్యపరీక్షలను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు పీఎస్ ఉషారాణి బృందం జరిపింది. ఈ సందర్భంగా జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారి షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ జిల్లా నుంచి 10 మందిని ఎంపిక చేసి విజయవాడ/విశాఖ పట్టణం పంపిస్తామన్నారు. అక్కడ వారికి పర్వతారోహణ, ఆరోగ్యపరీక్షలు, క్రమశిక్షణ, ప్రవర్తనలో శిక్షణ ఇస్తారన్నారు. ఆ తర్వాత అన్ని జిల్లాల నుంచి వచ్చిన 130 మందిలో 20 మందిని ఎంపిక చేసి భారత రక్షణ శాఖ ద్వారా హిమాలయ పర్వతాల వద్దకు తీసుకెళ్లి, పర్వతాధిరోహణపై శిక్షణ ఇస్తారన్నారు. ఇందులో ప్రతిభ కనపరిచిన 5గురిని ఎంపిక చేసి ఏప్రిల్-జూన్ మధ్యలో ఎవరెస్ట్ అధిరోహణకు పంపిస్తారని వివరించారు. కార్యక్రమంలో సెట్కూరు మేనేజర్ పీవీ రమణ, శ్రీనివాసగుప్త, నాగరాజు, మొయినుద్దీన్, షబ్బీర్, రత్నమయ్య, ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బంది తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.